
- వాగుల పై పోలీసుల నిరంతర నిఘా
- పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు
- అక్రమ ఇసుక రవాణాదారులపై కేసులు
మహబూబాబాద్, వెలుగు: అక్రమ ఇసుక రవాణాకు పోలీసులు చెక్ పెడుతున్నారు. మానుకోట జిల్లాలో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం నుంచి నరసింహులపేట, చిన్నగూడురు, మరిపెడ, సీరోలు మండలాల పరిధిలో ఆకేరు వాగు విస్తరించి ఉండగా, అక్రమ ఇసుక రవాణా నిరోధం కోసం ఎన్నడూ లేనివిధంగా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. షిప్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకు వచ్చి ఇందిరమ్మ గృహాలకు ఉచితంగా, సామాన్యులకు అందుబాటులో ఇసుక ధర ఉండేలా సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి ఆఫీసర్ల ఆదేశాలతో మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ క్షేత్ర స్థాయిలో వాగులను ఇటీవల పోలీస్ఆఫీసర్లతో కలసి సందర్శించారు. అవసరమైన చోట పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
వాగుల వెంట చెక్‌పోస్టులు..
జిల్లాలోని ఆకేరువాగు, మున్నేరు, పాలేరు వాగులు ప్రవహిస్తున్నవి. నెల్లికుదురు, నర్సింహులపేట, చిన్నగూడూరు, డోర్నకల్, మరిపెడ, గూడూరు, గార్ల, బయ్యారం, దంతాలపల్లి, పెద్దవంగర పోలీసు, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి, ఐదు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలోను పోలీసులు వాగుల సమీపంలో పెట్రోలింగ్ పెంచారు.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఇసుక అక్రమ రవాణా చేయవద్దని పోలీసులు హెచ్చరించినా కొంత మంది మారడం లేదు. ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లాలో 71 మందిని బైండోవర్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. తొమ్మిది రోజుల్లోనే 8కి పైగా కేసులు నమోదు చేశారు. ఎనిమిదిపైగా ట్రాక్టర్లు సీజ్ చేశారు. 11 మందిపై కేసులను నమోదు చేశారు. జిల్లాలో కొంత కాలంగా వాగుల పరివాహక ప్రాంతాలకు చెందిన వారు వివిధ రాజకీయ పార్టీల నేతల అండదండలు, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో యథేచ్చగా వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి లక్షల రూపాయలు సంపాందించారు. కానీ, ఇప్పుడు అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల వచ్చే వరకు ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లాలోని వాగుల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. వాగు పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాం. వాగుల వెంట ఇసుక రవాణాకు ఆస్కారం ఉన్న చోట పోలీస్, రెవెన్యూ అధికారులతో చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. అక్రమ ఇసుక రవాణాకు ఆఫీసర్లు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రజల దృష్టికి వస్తే డయల్ 100 కు ఫోన్ చేసి వివరాలను తెలపాలని పేర్కొన్నారు.
సుధీర్ రామ్నాథ్కేకన్, మహబూబాబాద్ఎస్పీ