- ఏడాదిలోగా యాదాద్రి జోన్లో మరింత మెరుగైన సేవలందిస్తాం..
- మీడియా చిట్‌చాట్‌లో కొత్త డీసీపీ రాజేశ్ చంద్ర
యాదాద్రి, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నా.. నేరవిచారణలో కఠినంగా ఉండాలని, ప్రజాప్రతినిధులను పోలీసులు కలవడంలో తప్పేం లేదని యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర అన్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఆయన భువనగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఎల్బీ నగర్, మల్కాజ్గిరి జోన్ తరహాల్లో యాదాద్రి జోన్‌ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల విషయంలో పోలీసులు అలర్టుగా ఉండాలని, భూ తగాదాల కేసుల్లో రెండు వైపులా వాదనలను విన్న తర్వాతే ఎఫ్ఐఆర్ చేయాలని తెలిపారు.
భయంలేకుండా స్టేషన్‌కు రావొచ్చు..
పోలీసులు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తామన్నారు. ఫిర్యాదులు చేయడానికి త్వరలోనే వాట్సాప్ నంబర్ తెస్తామన్నారు. ఎవరితో చెప్పించకుండా, భయంలేకుండా ఫిర్యాదుదారులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే వాతావరణం ఉంటుందని గుర్తు చేశారు. సంబంధిత ఆఫీసర్లు స్టేషన్లో అందుబాటులో లేకుంటే ఫిర్యాదుదారులు స్టేషన్‌లోని ఎంట్రీబుక్లో వారి వివరాలు రాసి వెళ్లాలని, ఆఫీసర్లు వచ్చాక వారే కాల్ చేస్తారని చెప్పారు. స్టేషన్లో ఎవరినీ వెయిట్ చేయించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు.
పొలిటీషియన్లను కలవడం తప్పేంకాదు..
యాదాద్రి జిల్లాకు బదిలీపై రాగానే డీసీపీ రాజేశ్ చంద్ర.. మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా “గవర్నమెంట్లో అన్ని విభాగాలు భాగం. మేము ఎగ్జామ్ రాసి, ట్రైనింగ్ తో వచ్చాం. రూల్స్ ప్రకారం వెళ్తాం. రూల్స్ ఫ్రేమ్ చేసే పొలిటీషియన్స్‌ను ఇన్వాల్వ్ కావద్దని చెప్పలేం. ప్రజలు ఎన్నుకున్న వాళ్లను మేం కలవడం తప్పు లేదు. అయినా వాళ్లు చెప్పింది విని.. రూల్స్ ప్రకారమే నడుచుకుంటాం” అని డీసీపీ బదులిచ్చారు.
పోలీసులు బాధ్యతగా ఉండాలి..
ప్రజలతో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని, రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నా, క్రిమినల్స్‌తో స్ట్రిక్ట్ ఉండాలని చెప్పారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్యాక్ట్ను ఉపయోగంచుకోవాలని, తప్పు చేస్తే దొరికిపోతామన్న భయమూ నేరస్తులకు కలగాలని అన్నారు.