భారత సంతతి ఫ్యామిలీ మృతిపై వీడిన మిస్టరీ

  • భార్యా పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్ ఇంజనీర్​

వాషింగ్టన్: కాలిఫోర్నియాలో  ఇటీవల జరిగిన భారత సంతతి కుటుంబం మరణాల వెనక మిస్టరీని పోలీసులు తేల్చారు. ఆనంద్ సుజిత్ హెన్రీ(42)నే తన భార్య అలిస్ ప్రియాంక(40), కవల పిల్లలు నోహ్, నీతాన్​లను చంపాడని..అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడని తేల్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఆనంద్ ఫ్యామిలీ తొమ్మిదేండ్లుగా అమెరికాలోని శాన్ మాటియోలో నివసిస్తున్నది.

ఆనంద్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా.. ప్రియాంక సీనియర్ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. వీరికి కవల పిల్లలు ఉన్నారు. కొన్నేండ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 12న ఫ్యామిలీలోని నలుగురూ ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. డెడ్ బాడీల ఆధారంగా ఆనందే తన ఫ్యామిలినీ చంపి, తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు ప్రాథమిక దర్యాఫ్తులో తేలిందన్నారు. చిన్నారుల మరణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.