బంగారం కోసమే దంపతుల హత్య

బంగారం కోసమే దంపతుల హత్య
  • ఐదు నెలల కిందే స్కెచ్‌‌ వేసి, ప్లాన్‌‌ ప్రకారం హత్య చేసిన నిందితులు
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన జంట హత్యల మిస్టరీని ఛేదించిన పోలీసులు
  • 8 మంది అరెస్ట్, 8 తులాల బంగారం స్వాధీనం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గత నెల 27న వెలుగుచూసిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారం కోసమే దంపతులను హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ జంట హత్యల కోసం నిందితులు ఐదు నెలల కిందే స్కెచ్‌‌ వేసినట్లు గుర్తించారు. మర్డర్‌‌ చేసిన, వారికి సహకరించిన వారితో కలిపి మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఖమ్మం సీపీ సునీల్‌‌ దత్‌‌ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం... 

ఏపీలోని ఎన్టీఆర్‌‌ జిల్లా మొగులూరుకు చెందిన అబిద్‌‌పై ఓ హత్య కేసులో 2011లో కంచికచర్ల పీఎస్‌‌లో కేసు నమోదు అయింది. 2014లో యావజ్జీవ శిక్ష పడడంతో రాజమండ్రి సెంట్రల్‌‌ జైలుకు వెళ్లాడు. 2020లో పెరోల్‌‌పై బయటకు వచ్చిన అబిద్‌‌ పేరు మార్చుకొని సూర్యాపేట జిల్లా కోదాడలో మామిడికాయల వ్యాపారం మొదలు పెట్టాడు. అక్కడ తన రూమ్‌‌కు ఎదురుగా ఒంటరిగా ఉన్న షేక్‌‌ హుస్సేన్‌‌బీ అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అక్కడే చిట్టిపోలు సురేశ్‌‌ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతడితోనూ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. 

హుస్సేన్‌‌ బీ నేలకొండపల్లి మండలం బుద్దారానికి చెందిన తన ఫ్రెండ్‌‌ జమాల్‌‌బీ, మేనకోడలు షబీనాను అబిద్‌‌కు పరిచయం చేయగా అబిద్‌‌ షబీనాతోనూ వివాహేతర సంబంధం కొనసాగించాడు. జల్సాల కోసం ఈజీగా డబ్బు సాధించాలని భావించిన అబిద్‌‌ ఈ విషయాన్ని షబీనాతో చెప్పాడు. దీంతో నేలకొండపల్లిలో ఉండే యర్రా వెంకటరమణ వద్ద డబ్బులు బాగా ఉన్నాయని, ఇంట్లో ఇద్దరూ వృద్దులే ఉంటారని, రూమ్స్‌‌ను రెంట్‌‌కు ఇస్తారని చెప్పడంతో వారింట్లో చోరీ చేసేందుకు అబిద్‌‌ ప్లాన్‌‌ చేశారు. హుస్సేన్‌‌బీ, సురేశ్‌‌, జమాల్‌‌బీ, షబీనాతో పాటు ఖమ్మంకు చెందిన ఫరీహ్‌‌ అహ్మద్‌‌, అతడి ఫ్రెండ్‌‌ అనిల్‌‌తో కలిసి వెంకటరమణ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించాడు. ఖమ్మంలోని సర్దార్‌‌ పటేల్‌‌ స్టేడియం వద్ద సిమ్‌‌లు అమ్మే మణికంఠ వద్ద నకిలీ ఐడీ ప్రూఫ్స్‌‌తో 10 సిమ్‌‌ కార్డులు కొన్నాడు. ఓ వ్యక్తి బైక్‌‌ కొని ఫేక్‌‌నంబర్‌‌ ప్లేట్‌‌ తగిలించాడు. తర్వాత జులైలో దోపిడీ చేసేందుకు స్కెచ్‌‌ రెడీ చేసుకున్నాడు.

రూమ్‌‌ రెంట్‌‌కు తీసుకొని..

చోరీ ప్లాన్‌‌లో భాగంగా అబీద్‌‌, సురేశ్‌‌ వెంకటరమణ ఇంటికి వెళ్లి రూమ్‌‌ను రెంట్‌‌కు మాట్లాడుకున్నారు. సురేశ్‌‌ తన పేరు శ్రీనివాసరావు అని, గవర్నమెంట్‌‌ టీచర్‌‌గా పనిచేస్తానని, తన భార్య ప్రెగ్నెంట్‌‌ కావడంతో పుట్టింటికి వెళ్లిందని చెప్పి రూమ్‌‌ తీసుకున్నారు. తర్వాత అబిద్‌‌, సురేశ్‌‌ కలిసి వెంకటరమణతో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసి ఫెయిల్‌‌ అయ్యారు. దీంతో ఆడవారితో చేయించాలని ప్లాన్‌‌ చేసి నవంబర్‌‌ రెండో వారంలో షబీనా, హుస్సేన్‌‌బీలను రంగంలోకి దించారు.

 వారిద్దరూ వెంకటరమణతో మాట్లాడి వాళ్లింట్లో గదిని అద్దెకు తీసుకున్నారు. వెంకటరమణ భార్య కృష్ణకుమారితో తరచూ మాట్లాడుతూ చనువు పెంచుకున్నారు. గత నెల 25న దోపిడీకి ప్రయత్నించినా వీలుకాలేదు. తర్వాతి రోజు రాత్రి షబీనా, హుస్సేన్‌‌బీ కృష్ణకుమారితో మాట్లాడుతుండగా అబీద్‌‌, సురేశ్‌‌ ఇంట్లోకి వచ్చి వెనుక నుంచి కృష్ణకుమారి గొంతు నులిమి హత్య చేశారు. 

ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని, ఇంట్లో ఉన్న బంగారం కోసం బెడ్రూమ్‌‌లోకి వెళ్లారు. అక్కడ పడుకున్న వెంకటరమణ అలికిడి నిద్ర లేవడంతో అబిద్‌‌, సురేశ్‌‌ కలిసి వెంకటరమణ గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత బంగారం, ఫోన్‌‌ తీసుకొని పారిపోయారు. ఆనవాళ్లు దొరక్కండా ఇల్లంతా కారంపొడి చల్లారు. గత నెల 27న హత్యల విషయం బయటపడింది. 

మర్డర్‌‌ జరిగిన ప్లేస్‌‌లో సెల్‌‌ఫోన్‌‌ సిగ్నల్‌‌ ఆధారంగా నిందితుల కోసం ప్రయత్నించినప్పటికీ ఫేక్‌‌ అడ్రస్‌‌ ప్రూఫ్‌‌లు కావడంతో వారి ఆచూకీ దొరకలేదు. ఈ నెల 12న వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అబిద్‌‌ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యల విషయం వెలుగుచూసింది. దీంతో 8 మందిని అరెస్ట్‌‌ చేసి, ఎనిమిది తులాల బంగారం, నాలుగు సెల్‌‌ఫోన్లు, బైక్‌‌ స్వాధీనం చేసుకున్న సీపీ తెలిపారు.