- తుంకిమెట్ల మర్డర్ మిస్టరీని ఛేదించిన కొడంగల్ పోలీసులు
కొడంగల్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. వికారాబాద్ జిల్లా బోంరాస్‌పేట మండలం తుంకిమెట్ల సమీపంలో ఈ నెల 2న గుర్తుతెలియని వ్యక్తి డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టి, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
యూపీకి చెందిన అమన్‌కుమార్(23), అనూప్ శుక్లా ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చారు. చేవెళ్లలోని పావని రోడ్‌లైన్స్ లో అనూప్ లారీ డ్రైవర్‌గా, అమన్ సహాయకుడిగా పనిచేస్తున్నారు. డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య గోడవ జరగగా, యూపీలోని అనూప్ ప్రియురాలు పూనమ్‌కు అమన్ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె జరిగిందంతా ఫోన్ చేసి తన ప్రియుడికి చెప్పడంతో.. అమన్‌పై అనూప్ పగ పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి కర్నాటక నుంచి సిమెంట్‌లోడ్‌తో తెలంగాణకు వస్తుండగా, తుంకిమెట్ల వద్ద రాడ్‌తో కొట్టిచంపాడు.
అనంతరం డెడ్‌బాడీని కల్వర్ట్ కింద పడేసి పరారయ్యాడు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా కేసు మిస్టరీని ఛేదించినట్లు కొడంగల్ సీఐ తెలిపారు. నిందితుడిని తాండూరు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించామన్నారు.