ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి : మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి : మందకృష్ణ మాదిగ
  • నల్ల జెండాలతో పార్శీగుట్ట నుంచి ఎమ్మార్పీఎస్ ర్యాలీ
  • అడ్డుకున్న పోలీసులు.. మందకృష్ణ మాదిగ అరెస్ట్

పద్మారావునగర్/ఓయూ/శంషాబాద్, వెలుగు : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నల్ల జెండాల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్​నేషనల్​ఆఫీస్​నుంచి ట్యాంక్​బండ్​అంబేద్కర్​విగ్రహం వరకు తలపెట్టిన ర్యాలీని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు మందకృష్ణతోపాటు నాయకులను అరెస్ట్​ చేసి బొల్లారం, బండ్లగూడ పోలీస్​స్టేషన్లకు తరలించారు. 

ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణ చేయకుండా టీచర్లు, ఉద్యోగాల భర్తీ చేయడమేమిటని ప్రశ్నించారు. మాట మీద నిలబడే తత్వం రేవంత్ రెడ్డిది కాదని విమర్శించారు. మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ అమలు చేసినట్లయితే 1,250 టీచర్​పోస్టులు మాదిగలకు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 

15న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, భవిష్యత్​ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్​నరేశ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే వర్గీకరణ చేపట్టాలని కోరుతూ శంషాబాద్​లో ఎమ్మార్పీఎస్ నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు.