చెన్నూరులో పోలీసుల దౌర్జన్యం .. కాంగ్రెస్ అభ్యర్థి  వివేక్ వెంకటస్వామి వాహనం అడ్డగింత 

  • ఎమ్మెల్యే బాల్క సుమన్ వెహికల్ కు మాత్రం లోపలికి అనుమతి 
  • ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు.. 
  • ఆర్వో ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు 
  • బాల్క సుమన్ గూండాయిజం చేస్తున్నడు : వివేక్ వెంకటస్వామి  
  • రూల్స్ ఉల్లంఘించిన ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి

మంచిర్యాల, వెలుగు :  చెన్నూరులో పోలీసులు దౌర్జన్యం చేశారు. నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి ఆఫీస్ వద్దకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బాల్క సుమన్ వెహికల్​ను మాత్రం లోపలికి అనుమతించారు. దాదాపు 500 మీటర్ల దూరంలోనే వివేక్ వాహనాన్ని పోలీసులు ఆపేశారు. దీంతో అక్కడి నుంచి వివేక్ నడుచుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. 

అయితే అదే టైమ్ లో నామినేషన్ వేసేందుకు వచ్చిన అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ వెహికల్ ను మాత్రం పోలీసులు లోపలికి అనుమతించారు. సుమన్ వెహికల్​ను లోపలికి అనుమతించడంపై  కాంగ్రెస్​కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, వార్తల కవరేజీకి వెళ్లిన మీడియాను సైతం పోలీసులు అడ్డుకున్నారు. 

బీఆర్ఎస్ గూండాయిజాన్ని జనం సహించరు.. 

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పారేపల్లి కాలభైరవస్వామి ఆలయంలో తన సతీమణి సరోజతో కలిసి పూజలు చేశారు. అక్కడ నుంచి ఆర్వో కార్యాలయానికి వెళ్లి  నామినేషన్ వేశారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. చెన్నూరులో బాల్క సుమన్ గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా బాల్క సుమన్ తన వాహనాన్ని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాం. ఈసీకి కూడా కంప్లయింట్ చేస్తాం” అని చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సీఎం అయినా అందరూ సమానమే.

అందరూ అభ్యర్థులే. చెన్నూరు ప్రజలు  బీఆర్ఎస్ గూండాయిజాన్ని సహించరు” అని అన్నారు. బాల్క సుమన్ ప్రజలను కలవడం లేదని, కార్యకర్తలకు కూడా దొరకడం లేదని విమర్శించారు. ‘‘నా ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. చేతి గుర్తుకే ఓటేస్తామని జనం చెబుతున్నారు. నిన్న శెట్ పల్లి, కుందారం గ్రామాల్లో పర్యటించాను. ప్రజలంతా అండగా నిలిచారు. నేను గెలిచినా, ఓడినా పదేండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజల వెంటే ఉన్నాను. వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాను. వారానికి రెండు మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉంటున్నాను” అని చెప్పారు. వివేక్ వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు ఉన్నారు.