
ప్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే రాష్ట్ర పోలీసులు.. ఆ జాడ ఎక్కడా కనపడనివ్వట్లేదు. సామాన్య ప్రజలను పోనివ్వడం పక్కనుంచితే కనీసం అంబులెన్స్‌కు దారివ్వలేదు. ఈ ఘటన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పర్యటనలో చోటుచేసుకోవడం గమనార్హం.
ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్‌చెరులో పర్యటించారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు ఎక్కడికక్కడ గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అందులో ఓ చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ విషయం చెప్పినా... పోలీసులు ఎంతమాత్రం కనికరం చూపించలేదు. పాప తల్లిదండ్రులు, వాహనదారులు ఎంత బతిమాలినా అంబులెన్స్‌ను విడిచిపెట్టేందుకు వారు అంగీకరించలేదు.
ALSO READ: పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. మళ్లీ గెలిపిస్తే మెట్రోలైన్ పొడిగిస్తా
పాపకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా అంబులెన్స్‌ను విడిచిపెట్టని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు.. ప్రభుత్వ పెద్దలకు పనిచేయడం ఏంటని ఖాకీలతీరును తప్పుపడుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.