భాను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

భాను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న.. విద్యార్థి పి. భానుప్రసాద్ డెడ్ బాడీని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మూడ్రోజుల క్రితమే భాను ఆత్మహత్య చేసుకుని చనిపోయినా.. క్యాంపస్ అధికారులు ఎవరూ చెప్పలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు . ఇతరుల నుంచి తమకు అర్థరాత్రి తెలిసిందన్నారు. విద్యార్థి మరణిస్తే కూడా సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మృతదేహం చూస్తే చాలా రోజుల క్రితమే మరణించినట్లు అనిపిస్తోందన్నారు. భాను చదవలేక ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని  కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా డాక్టర్లచే పోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

మార్చురీలో ఉన్న భానుప్రసాద్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి మృతిపట్ల ప్రజాప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా డాక్టర్లచే శవపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా విద్యార్థి కనిపించకుంటే.. సిబ్బంది ఏం చేస్తున్నారని కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి.. భాను ప్రసాద్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.