
- విద్యార్థి జేఏసీ లీడర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆదిలాబాద్, వెలుగు : విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఎంపీ నగేశ్ ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, స్టూడెంట్ లీడర్ల మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలపై సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి, ఎన్‌టీఏను రద్దు చేయాలని, పేపర్ లీకేజీ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్‌ను తిరిగి నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్లకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బి.రాహుల్, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేశ్, సంజయ్, అశోక్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి గండ్రత్ శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు కౌడాల అఖిల్, రాహుల్, సాయి పాల్గొన్నారు.