మరికల్, వెలుగు : నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులోని ఇథనాల్ ఫ్యాక్టరీ పరిశీలనకు వచ్చిన నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామస్తులను పోలీసులు గుండంపల్లి వద్ద అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని అక్కడి ప్రజలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ వల్ల కలిగే నష్టాలను తెలుసుకునేందుకు మరికల్ మండలం చిత్తనూరు వద్ద ఇప్పటికే ప్రారంభమైన ఇథనాల్ కంపెనీని పరిశీలించేందుకు రెండు బస్సుల్లో సుమారు 100 మంది వచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గుండ్లంపల్లి వద్ద ఆపి కంపెనీ పరిసరాల్లోకి వెళ్లేందుకు వీలు లేదంటూ తిప్పి పంపించేశారు. అనంతరం చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ కంపెనీ చేస్తున్న విధ్వంసం తెలిస్తే దిలావర్‌పూర్‌లో ఉద్యమం ఉధృతం అవుతుందన్న భయంతోనే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
నారాయణపేట, నిర్మల్ ఎస్పీలు, డీఎస్పీలు బస్ డ్రైవర్లకు ఫోన్ చేసి బస్సులను సీజ్ చేస్తామని బెదిరించడంతో వారు తిరిగి వెళ్లిపోయారని ఆరోపించారు. కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై బీఆర్ఎస్ ప్రభుత్వం లాఠీచార్జి చేసి, బాధిత రైతులపై అక్రమ కేసులు పెడితే అప్పుడు అండగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇథనాల్ కంపెనీకి అనుకూలంగా మారడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో ఎం.రాఘవాచారి, డి.చంద్రశేఖర్, ఎస్‌ఎం.ఖలీల్, జె.చక్రవర్తి, కన్నెగంటి రవి పాల్గొన్నారు.