భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీసులకేమైంది?

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీసులకేమైంది?
  • వంద రోజుల్లో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్​ ఆత్మహత్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వంద రోజుల్లో జిల్లాలో ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో రకం కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లాలో పోలీసు​లకేమైందనే చర్చ మొదలైంది. 

ఇదీ పరిస్థితి.. 

జిల్లాలోని అశ్వారావుపేట పోలీస్​ స్టేషన్​లో ఎస్సైగా పనిచేస్తున్న శ్రీరాములు శ్రీనివాస్​ జూన్​ 30న ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారం రోజుల తర్వాత చనిపోయాడు. పై అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది తనను కించపర్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ  ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాస్​ పెట్టిన సెల్ఫీ వీడియో అప్పుడు రాష్ట్ర స్థాయిలో కిందట పోలీస్ శాఖలో కలకలం రేపింది.  

ఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీస్​ స్టేషన్​లోనే పనిచేస్తున్న కొందరు సిబ్బందితో పాటు ఇంటిలిజెన్స్​ డిపార్ట్​మెంట్​ వాళ్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దు పోలీస్​ స్టేషన్​ కావడం, స్టేషన్​లో కొందరు సిబ్బంది చెప్పిందే వేదంగా మారడంతో ఆఫీసర్లు, సిబ్బంది మధ్య మిస్​ అండర్​ స్టాండింగ్​ నెలకొంది. ఈ క్రమంలో సిబ్బంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎస్సై సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 

ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్​ ఆత్మహత్య నుంచి జిల్లా పోలీసులు తేరుకోక ముందే క్లూస్​ టీంలో పనిచేస్తున్న రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పాల్వంచలో నివాసం ఉంటూ క్లూస్​ టీంలో పనిచేస్తున్న కానిస్టేబుల్​ రమణారెడ్డి సెప్టెంబర్​లో ఆత్మహత్య చేసుకున్నారు. తట్టుకోలేని కష్టాలు తనకే వస్తున్నాయి, కుటుంబ సమస్యలతో సతమత మవుతూ మానసిక ఒత్తిడితో గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఆయన తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 

తాజాగా బూర్గంపహడ్​ పోలీస్​ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న సాగర్​ అనే కానిస్టేబుల్ ​ఆత్మహత్య చేసుకోవడం జిల్లా పోలీస్​ శాఖలో సంచలనం సృష్టించింది. పోలీస్​ స్టేషన్​లో గంజాయి మాయమైన కేసులో తనను పోలీస్​ ఆఫీసర్లు అక్రమంగా ఇరికించారని, ఎస్సైలు సంతోష్, రాజ్​కుమార్​ ఇందుకు బాధ్యులని, అన్యాయంగా తనను ఇబ్బందులు పెట్టారని సెల్ఫీ వీడియోలో ఆరోపించిన  సాగర్​ పురుగుల మందు తాగి సూసైడ్​ చేసుకున్నాడు. 

కౌన్సిలింగ్​ అవసరం..

వరుస ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే అవగాహన సదస్సులు పెట్టించాల్సిన అవసరం ఉందనే వాదన పోలీస్​ శాఖలో వినిపిస్తోంది. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్​, ఆర్థిక ఇబ్బందులు, పర్యవేక్షణపై పర్సనాలిటీ డెవలప్​మెంట్​పై పలు సూచనలు ఇవాల్సి ఉంది. 

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ఎస్పీ బి. రోహిత్​ రాజు పేర్కొన్నారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. పోలీస్​ ఆఫీసర్లతో పాటు సిబ్బంది ఎప్పుడైనా తన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించానని చెప్పారు. బూర్గంపహడ్​ కానిస్టేబుల్​ సాగర్​ను వారి కుటుంబ సభ్యులు, ఆయన విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో ఈ నెల 8న సస్పెన్షన్​ ఎత్తివేశామని, పోస్టింగ్​ కూడా ఇచ్చామని, ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం అయ్యేదని పేర్కొన్నారు. తొందర పాటుతో ప్రాణం పోగొట్టుకోవడం బాధగా ఉందన్నారు.