
ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతుంటే కొందరు ఇంకా మూఢ విశ్వాలలనే మగ్గుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉగాది రోజున సజీవ సమాధి పేరున ఓ వ్యక్తి చేసిన చేష్టలు గ్రామస్థులను ఆందోళనకు గురిచేశాయి. గుడి ముందు గొయ్యి తవ్వి సమాధికి కూర్చోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఉగాది పండుగ రోజు సజీవ సమాధికి ప్రయత్నించాడు. పన్నెండేళ్ల క్రితం ఊరి శివారులోని తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవల ఆలయం ముందు పెద్ద గొయ్యి తవ్విన ఆయన వారం రోజులుగా ఆ గొయ్యిలోకి వెళ్లి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు.
ఉగాధి (మార్చి 31) తెల్లవారుజామున కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోటిరెడ్డి గొయ్యిలోకి దిగి ధ్యానంలో మునిగిపోయాడు. వెంట వెళ్లిన కుమారుడు ఆ గొయ్యిపై రేకు ఉంచి దానిపై మట్టిపోసి పూడ్చేశాడు. విషయం తెలిసిన కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి గ్రామస్థులతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని కుమారుడిని బయటకు రావాలని కోరారు.
తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి కోరాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంత బతిమాలినా మొరాయించి గొయ్యిలోనే కూర్చోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తాళ్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీశారు. అయితే, వారు వెళ్లిపోయిన తర్వాత మరోమారు ఆయన గోయ్యిలోకి దిగి ధ్యానం చేశాడు. చివరికి కుటుంబ సభ్యులు, స్థానికులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు.
సజీవ సమాధి ఎందుకు కవాలని అనుకున్నావో చెప్పాలని గ్రామస్థులు అడగగా.. ‘‘భూదేవి రమ్మంటుంది. ప్రపంచ శాంతి కోసం సజీవ సమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాను. కులమత బేధాలు లేకుండా సమాజం శాంతియుతంగా ఉండాలి’’ అని ఈ సందర్భంగా చెప్పాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది. ఈ కాలంలో కూడా ఈ వింత ఆచారాలేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు.