
సినీ రచయిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పోసాని కృష్ణమురళి ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో మొదటగా రాజంపేట పోలీసులు.. ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆ కేసులో 14 రోజుల రిమాండ్ విధించగా.. ఆయన్ను కడప జైలుకు తరలించారు. పోసాని కృష్ణ మురళిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 15 కేసుల వరకు నమోదయ్యాయి. ఇవన్నీ అసభ్యరమైన వ్యాఖ్యలు చేసిన కేసులు. ఈ కేసుల్లో ఆయా కంప్లయింట్స్ ఆధారంగా ఆయా పోలీసుస్టేషన్ల నుంచి పీటీ వారెంట్లు జారీ అవుతున్నాయి.
దీంతో రోజుకో పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పోసాని కృష్ణ మురళి. నరసరావుపేట కోర్టు పోసానికి మార్చి 13వరకు రిమాండ్ విధించగా గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు ఇప్పుడు తాజాగా పీటీ వారెంట్ పై బాపట్ల జైలుకు తరలించనున్నారు. అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా పోసానిపై 15 కేసులు నమోదవ్వగా సోమవారం ( మార్చి 3, 2025 ) మరో రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. యాదమర్రి, పుత్తూరు పొలిసు స్టేషన్లలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ వైసీపీ న్యాయవాదులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రెండు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది కోర్టు. బుధవారం ( మార్చి 5, 2025 ) పోసాని బెయిల్ పిటీషన్లపై విచారణ జరపనుంది కోర్టు. అయితే.. అనారోగ్యం కారణంగా తనను జిల్లా జైలుకు పంపాలని పోసాని కోరగా.. న్యాయమూర్తి అంగీకరించడంతో సోమవారం ( మార్చి 3, 2025 ) పోసానిని నరసరావుపేట నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఇంతలోనే మరో పీటీ వారెంట్ జారీ అవడంతో పోసానిని బాపట్ల జిల్లా జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.
మరి, రోజుకో మలుపు తిరుగుతున్న పోసాని అరెస్ట్ ఎపిసోడ్ లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయి.. ఎన్ని జైళ్లకు షిఫ్ట్ చేస్తారు, ఇంతకీ పోసానికి బెయిల్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.