- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- కరీంనగర్బల్దియాలో భూకబ్జా ప్రకంపనలు
- మిగతా కార్పొరేటర్లో అందోళన
కరీంనగర్: భూకబ్జా కేసులో పోలీసులు ఇవాళ మరో బీఆర్ఎస్ కార్పొరేటర్ ను అరెస్టు చేశారు. 21వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న సాగర్ పై భూములు లాక్కోవడం, కట్టిన ఇళ్లు కూల్చడం, ఇళ్లు కట్టుకునే వారి నుంచి లంచాలు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నే కరీంనగర్ సిటీలో ఓ భూబాధితుడి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ జంగిలి సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
లింగారెడ్డి అనే టీచర్ కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సాగర్ను అదుపులోకి తీసుకున్నారు. లింగారెడ్డికి పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి విషయంలో తనకు రూ. 40 లక్షలు ఇవ్వాలని సాగర్ డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పి వేడుకున్నా వినిపించుకోకుండా లింగారెడ్డికి సంబంధించిన భూమిలోంచి రోడ్డును వేయించిన సాగర్ రూ. 10 లక్షలు వసూలు చేశాడు.
ప్రజా ప్రతినిధిగా ఎన్నికై తనకు మామూళ్లు ఇవ్వనట్టయితే భూముల నుంచి రోడ్లు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా వీడియోలో రికార్డు అయింది. తనకు డబ్బులు ఇచ్చే విషయాన్ని కూడా ఆ వీడియోలో మాట్లాడిన సాగర్ తన కూతురు అకౌంట్ కు కొంత డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. అయితే మరో ఇద్దరు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నాట్లు సమాచారం భూ కబ్జాలకు సంబంధించిన కేసులో భాగంగానే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఓ వ్యక్తికి చెందిన భూమి విషయంలో జోక్యం చేసుకుని అతన్ని ఇల్లు కట్టుకోనీయకుండా రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, చీటీ రామారావు, నిమ్మశెట్టి శ్యాం అనే ముగ్గురిని వన్ టౌన్ పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటిస్తున్న సమయంలోనే కార్పొరేటర్లు అరెస్టులు కావడం బీఆర్ఎస్లో ఆందోళన కలిగిస్తున్నాయి.