- తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఉప్పల్ పోలీసులు
ఉప్పల్, వెలుగు: మిస్సింగ్ అయిన బాలుడిని గంటలోనే ఉప్పల్ పోలీసులు కనిపెట్టి తల్లి చెంతకు చేర్చారు. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపిన ప్రకారం.. చాంద్రాయణగుట్ట పరిధి ఇస్మాయిల్ నగర్ కు చెందిన ఎండీ మజీద్, మరియంబి (24) దంపతులు సోమవారం రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌కు ఆటోలో వచ్చారు. టీ కోసమని ఆటోను ఆపి.. భర్త, ఆమె తమ్ముడు దిగారు. చిన్నారికి ఆమె పాలు పట్టిస్తుండగా.. కొడుకు ఏడాదిన్నర ఎండీ అన్వాస్ ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు.
చుట్టుపక్కల వెతకగా కనిపించలేదు. బాబు తప్పిపోయినట్లు సాయంత్రం 5 గంటలకు మరియంబీ కుటుంబసభ్యులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? అనే కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రెండు టీమ్ లను నియమించి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో కూతురిని ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూల్ వద్దకు సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ ప్రవీణ్‌రెడ్డి దంపతులు వెళ్లారు. వారికి బాలుడు కన్పించగా.. వాకబు చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు.
దీంతో బాలుడిని ఫొటో తీసిన ప్రవీణ్‌రెడ్డి అనంతరం ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి వాట్సప్ కు పంపాడు. బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని తెలిసిన వారి ఇంటి వద్ద ఉంచామని తెలిపాడు. అప్పటికే బాలుడి మిస్సింగ్ పై ఫిర్యాదు రావడంతో ఫొటోను చూపించగా.. బాలుడు తమ కొడుకేనని గుర్తుపట్టి వెంటనే బాలుడి వద్దకు వెళ్లారు. ప్రవీణ్‌రెడ్డి దంపతులు, స్థానికుల సమక్షంలో బాలుడిని మరియంబీ కుటుంబసభ్యులకు అప్పగించారు. మిస్సింగ్ కేసులో వెంటనే స్పందించిన సీఐ ఎలక్షన్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.