సీఎం సభకు వెళ్లి వస్తుండగా.. బోల్తాపడ్డ పోలీస్ వాహనం

సీఎం సభకు వెళ్లి వస్తుండగా.. బోల్తాపడ్డ పోలీస్ వాహనం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కొల్లాపూర్ లో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్​ సభకు వెళ్లి వస్తున్న పోలీస్ వాహనం బోల్తా పడడంతో ముగ్గురు హోంగార్డులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు హోంగార్డులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశి ఇటికాల సమీపంలో జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం కొల్లాపూర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా, కొత్తకోట మండలంలోని మదనాపూర్ పీఎస్​లో హోంగార్డుగా పని చేస్తున్న మంజుల, కొత్తకోట పీఎస్ హోంగార్డు​ జయంతి, ఈమె ఏడాది కూతురు, మహబూబ్​నగర్ స్టేషన్​ హోంగార్డు అన్నపూర్ణ, ఆర్ఐ శివాజీ, నాగర్​కర్నూల్​ పీఎస్​ డ్రైవర్ తిరుపతి ఒకే వెహికల్​లో బందోబస్తుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా డ్రైవర్​ ఓవర్​స్పీడ్​తో నడపడంతో దేశి ఇటికాల సమీపంలో టర్న్​తీసుకుంటూ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టారు. 

ఘటనలో మంజుల, జయంతి, అన్నపూర్ణ తీవ్రంగా గాయపడగా ఏడాది పాప,  శివాజీ, తిరుపతి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108లో నాగర్ కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. జయంతి, మంజుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. అన్నపూర్ణను మహబూబ్​నగర్ తరలించారు. నాగర్​కర్నూల్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.