కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు రైడ్ చేయడాన్ని నిరసిస్తూ సీపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీసీసీకు వచ్చే దారులను మూసివేశారు.
పోలీసుల తీరుకు నిరసనగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని మండల కేంద్రాల్లో నిరసనకు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తలదూర్చితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
నిన్న రాత్రి 10 గంటల సమయంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది. సోదాల సందర్భంగా సునీల్ కార్యాలయంలోని సిబ్బంది సెల్ ఫోన్లను పోలీసులు స్విచ్చాఫ్ చేయించారు. ఆఫీసులోని కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. సునీల్ కనుగోలు టీమ్ గత కొంత కాలంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే.
పోలీసుల సోదాల సందర్భంగా సునీల్ కనుగోలు ఆఫీసులో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, షబ్బీర్ అలీ, అనీల్ కుమార్ యాదవ్ లు కలిసి కార్యాలయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏసీపీతో మల్లు రవి, షబ్బీర్ అలీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కార్యాలయ సిబ్బంది ఫోన్లు లాక్కొని ఒక గదిలో నిర్బంధించారని ఆరోపించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని పోలీసు అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందన్న మల్లు రవి మండిపడ్డారు. కనీసం ఎందుకు సోదాలు చేస్తున్నారు.. ఏ కేసులు ఉన్నాయి.. ఎవరు కేసులు పెట్టారనే విషయాన్ని కూడా పోలీసులు తమకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లు రవి, షబ్బీర్ అలీ, అనీల్ కుమార్ యాదవ్ నిరసన ఎంతకూ విరమించకపోవడంతో వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ‘టాస్క్ ఫోర్స్ 2024’ గ్రూపులో సునీల్..
రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ‘టాస్క్ ఫోర్స్ 2024’ గ్రూపును ఏర్పాటుచేసింది. ఇందులో సభ్యుడిగా రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును నియమించింది. ‘టాస్క్ ఫోర్స్ 2024’ గ్రూపులో ప్రియాంకా గాంధీ, చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాతో పాటు సునీల్ కనుగోలు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి చీఫ్ ఎవరూ ఉండరు. టాస్క్ ఫోర్స్ కు ప్రత్యేక చీఫ్ లేకుండా సభ్యులకు నిర్దిష్ట పనులను కేటాయించి, నిర్ణయాధికారాలు కూడా వారికే అప్పగిస్తారని కాంగ్రెస్ పార్టీ గతంలో వెల్లడించింది. దీన్నిబట్టి ‘టాస్క్ ఫోర్స్ 2024’ గ్రూపులో సునీల్ కనుగోలుకు కావాల్సినంత స్వేచ్ఛ లభించినట్లయింది. 2024 ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాల రచన, కమ్యూనికేషన్, మీడియా వ్యవహారాలను ఈ గ్రూపు పర్యవేక్షిస్తుంది.