రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక ఆధారాల కోసం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. నిందితుడు హరి డిలీట్ చేసిన వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను పోలీసులు రిట్రీవ్ చేయనున్నారు. నిందితుడిని వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు అతడిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు విచారించనున్నారు. నిందితుడు ఒక్కడే నవీన్‌ను హత్య చేశాడా.. అతడికి ఎవరన్నా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. హరిహరకృష్ణతో పాటు అతడి స్నేహితులు, కుటుంబసభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్‌తో పాటు నిందితుడు వాడిన బైక్, కత్తిని పోలీసులు సేకరించారు.
హత్య విషయాన్ని బ్రాహ్మణపల్లికి చెందిన స్నేహితుడు హసన్, ప్రేమించిన యువతికి.. హరిహరకృష్ణ చెప్పాడని పోలీసులు అన్నారు. అయితే.. ఈ విషయం గురించి తెలిసినా వారిద్దరూ ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నవీన్ హత్య కేసులో హరికి ఆశ్రయం ఇచ్చిన హసన్‌ను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇదే విషయమై యువతిని ప్రశ్నించేందుకు సిద్ధం కాగా.. ఈ కేసులోకి తనను లాగితే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించినట్టు తెలుస్తోంది. ఇక హరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మరిన్ని కీలక విషయాలు రాబట్టనున్నారు.