భోపాల్ : న్యూఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్ తో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
కోట్మా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్.. న్యూఇయర్ సందర్భంగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత తన జేబు నుంచి రివాల్వర్‌ను బయటకు తీసి.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై ఇటీవల కూడా ఒక కేసు నమోదైంది. భర్త, పిల్లలతో కలిసి రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన మహిళను మద్యం మత్తులో ఉన్న ఆయన, మరో ఎమ్మెల్యేతో కలిసి లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ భర్త ట్విట్టర్ ద్వారా పోలీసుల సహాయం కోరాడు. రైల్వే పోలీసులు ఆ మహిళకు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.