- ఢిల్లీలో దారుణం ..ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ ఆపినందుకు కానిస్టేబుల్ ను నిందితులు చంపేశారు. అనంతరం వారు స్పాట్ నుంచి పారిపోయారు. కానిస్టేబుల్ కిరణ్ పాల్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 2018లో చేరారు. శనివారం వేకువజామున గోవింద్ పురి ప్రాంతంలో ఆర్య సమాజ్ మందిర్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మందు తాగి స్కూటర్ నడపడం ఆయన గమనించారు. వారిని అడ్డుకుని బండిని సీజ్ చేశారు. దీంతో దుండగులకు కోపం వచ్చి కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపేశారు.
ఆ తర్వాత నిందితులు స్పాట్ నుంచి పారిపోయారు. కానిస్టేబుల్ మృతికి కారణమైన వారిని ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు గాలించడం మొదలుపెట్టారు. శనివారం మధ్యాహ్నం కల్కాజీ ఏరియాలో దీపక్, క్రిష్ అనే ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మూడో, ప్రధాన నిందితుడైన రాఘవ్ అలియాస్ రాకీని శనివారం రాత్రి సంగం విహార్ ఏరియాలో గుర్తించారు. ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేసి సరెండర్ కావాలని హెచ్చరించారు. అయితే, రాఘవ్ పిస్టల్ తో పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరపడంతో అతడు గాయాలపాలయ్యాడు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.