యూపీలో ఏం జరిగింది: ఓటర్లపై తుపాకీ గురి పెట్టిన పోలీస్

యూపీలో ఏం జరిగింది: ఓటర్లపై తుపాకీ గురి పెట్టిన పోలీస్

లక్నో: మహిళా ఓటర్లపై పోలీసు తుపాకీ ఎక్కుపెట్టిన ఘటన అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‎లో సంచలనం సృష్టించింది. ఓటు వేసేందుకు వెళ్తోన్న మహిళా ఓటర్లపై పోలీస్ తుపాకీ గురి పెట్టడంతో రాజకీయ దుమారం చెలరేగింది. తమ విజయాన్ని అడ్డుకునేందుకే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ అధికార బీజేపీపై విమర్శలు దాడి మొదలుపెట్టింది. ఎస్పీకి కౌంటర్‎గా బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. 

ఓటర్లపై తుపాకీ గురి పెట్టిన వైరల్ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్.. మిరాపూర్‌లో ఓటర్లను బలవంతంగా రివాల్వర్‌తో బెదిరించి ఉప ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకున్నారని.. మహిళా ఓటర్లపై తుపాకీ ఎక్కు పెట్టిన కకరౌలి పీఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)ని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న పోలీసును వెంటనే సస్పెండ్ చేయాలని ఈ మేరకు ఎన్నికల కమిషన్‎ను అఖిలేష్ యాదవ్ కోరారు. 

మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవద్దని ప్రశ్నించారు. కాగా, వివిధ కారణాలతో ఖాళీ అయిన 9 అసెంబ్లీ స్థానాలకు 2024, నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. కతేహరి, కర్హల్, మీరాపూర్, ఘజియాబాద్, మజ్హవాన్, సిసామౌ, ఖైర్, ఫుల్పూర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. ఈ  తొమ్మిది స్థానాల్లో ప్రధానంగా బీజేపీ, ఎస్పీ తలపడ్డాయి. 2024, నవంబర్ 23న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.