కరీంనగర్​ సిటీలో ఆటోడ్రైవర్ల ఇష్టారాజ్యం

కరీంనగర్​ సిటీలో ఆటోడ్రైవర్ల ఇష్టారాజ్యం
  • స్టిక్కర్లు లేవు.. నంబర్లు కనిపించవు
  • కరీంనగర్​ సిటీలో ఆటోడ్రైవర్ల ఇష్టారాజ్యం
  • ఇటీవల నంబర్​ లేని ఆటోలో పాప కిడ్నాప్​
  • కొరవడిన పోలీసులు నిఘా

కరీంనగర్, వెలుగు:  నగరంలోని ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు క్యూఆర్​కోడ్​లు, పోలీస్​స్టిక్కర్లు అతికించుకోకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. కొన్ని ఆటోలకు అసలు నంబర్లు లేకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. సిటీలో దాదాపుగా 4 వేల ఆటోలు ఉంటాయి. మరో 3 వేల ఆటోలు నిత్యం కరీంనగర్ కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోతుంటాయి. మూడు రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్​నంబర్​లేని ఆటోలో ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 

నో స్టిక్కరింగ్.. నో నంబర్స్ 

నగరంలో తిరుగుతున్న చాలా ఆటోలకు నంబర్లు, వెనుకాల స్టిక్కర్లు ఉండటం లేదు. గతంలో సిటీలో మొత్తం ఎన్ని ఆటోలు ఉన్నాయి.. ఏయే అడ్డాల పరిధిలో ఎన్ని ఉన్నాయనే సంఖ్య స్పష్టంగా తెలిసేది. నగరంలోని గీతాభవన్‍ చౌరస్తా, బసాండ్‍, రాంనగర్‍ బస్టాప్‍, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, కమాన్‍ తదితర ప్రాంతాల్లో అడ్డాలు ఉన్నాయి. వీటికి అడ్డా క్రమసంఖ్యతోపాటు పోలీస్‍ శాఖ క్యూ ఆర్‍ కోడ్‍ను కూడా ఏర్పాటు చేసింది. ఆటోలో ప్రయాణించే వారికి ఆటో డ్రైవర్‍ వివరాలు తెలిసే విధంగా ఆ క్యూ ఆర్‍ కోడ్‍తోపాటు ఆధార్​తదితర వివరాల బోర్డు డ్రైవర్‍ వెనుక సీట్‍పై ఉండేది. దీంతోపాటు ఆటో వెనకాల పోలీస్ శాఖ అందించిన ప్రత్యేకమైన నంబర్‍తో కూడిన స్టిక్కర్‍ ఉండేది. దీంతో ఆటోలో ప్రయాణించే వారు ఏమైనా వస్తువులు మరిచిపోయినా, ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఈ క్యూ ఆర్‍ కోడ్‍, స్టిక్కర్​ సాయంతో బాధితులకు సత్వరమే న్యాయం జరిగేది. ప్రస్తుతం చాలా ఆటోలకు నంబర్లు సరిగ్గా కనిపించకపోవడం, కొన్నింటికి నంబరే లేకపోవడంతో ఆటోల్లో నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది.

నంబర్​ లేని ఆటోలో కిడ్నాప్​

ఇటీవల  పాపను కిడ్నాప్‍ విషయంలో ఆ ఆటోకు నంబర్‍ లేదు. కేవలం సీసీ కెమెరాల ఫుటేజీలు, స్థానికంగా తెలిసిన కొంతమంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతడి జాడ తెలుసుకోగలిగారు. ఈ ఆటోకు వెనుక భాగంలో కనిపించిన చెట్టు బొమ్మ స్టిక్కర్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆటో డ్రైవర్‍ కూడా తెలివిగా చెట్టు స్టిక్కర్‍ను తొలగించి దర్జాగా పోలీసుల ముందే ఆటోను తిప్పాడు. దీంతో ఎటువంటి ఆధారం లేని పోలీసులు దాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. చివరకు ఆటో డ్రైవర్‍ ఇల్లును గుర్తించి పాప ఆచూకీ కనిపెట్టారు. 

త్వరలోనే ఆటోలకు ప్రత్యేక నంబర్లు

కరీంనగర్‍ సిటీలో తిరిగే ప్రతి ఆటోకు ప్రత్యేకమైన నంబర్‍ ను త్వరలోనే ఇస్తాం. ఈ నంబర్​ఆటోకు ముందు, వెనుక స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ప్రతి ఆటో డ్రైవర్‍ కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, మొత్తం ట్రాఫిక్‍, లా అండ్‍ ఆర్డర్‍ పోలీసుల వద్ద ఉంటుంది. 
- వి.సత్యనారాయణ, 
పోలీస్‍ కమిషనర్‍, కరీంనగర్‍