రిటైర్డ్​ ఎంపీడీవో హత్య కేసులో మరికొందరు?

  • దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు
  • నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ

జనగామ, వెలుగు : రిటైర్డ్​ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు జడ్పీ వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి భర్త గిరబోయిన అంజయ్యతో పాటు మరో ఇద్దరు నిందితులు శ్రీకాంత్, భాస్కర్ ను పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. దీంతో నిందితులను బుధవారం ఉదయం జనగామ సబ్​ జైల్​నుంచి వరంగల్​ఎస్సీ, ఎస్టీ కోర్టుకు తరలించి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం వరకు కమిషనరేట్ లో విచారణ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత సాయంత్రం జనగామకు తీసుకువచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన అంజయ్య చేసిన భూ లావాదేవీలపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. 

ఇటీవల హత్యకు గురైన రామకృష్ణయ్యతో ఉన్న గొడవతో పాటు గతంలో మండలంలో జరిగిన అనుమానాస్పద మృతి ఘటనల్లో ఇతడి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో ఆరా తీయగా అంజయ్య మరికొందరి పేర్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారిని కూడా హత్య కేసులో నిందితులుగా చేర్చనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పలువురు అంజయ్య బాధితులు ఇప్పటికే వరంగల్ సీపీతో పాటు, బచ్చన్నపేట పోలీస్​స్టేషన్ కు  వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మృతుడి కొడుకు అశోక్​నిత్యం సీపీ రంగనాథ్​తో టచ్ లో తన వద్ద ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్​ చేసుకుంటుండడంతో హత్య కేసుపై సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్థానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను సైతం రంగంలోకి దింపి పలువురిని తమ దైన శైలిలో విచారిస్తున్నారు. కాగా నిందితుల కస్టడీ గురువారంతో ముగియనుంది.