ఆస్తుల వివరాల సేకరణ.. కోర్టు మొట్టికాయలతో వెనక్కి
3 నెలలు రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. చివరికి పాత పద్ధతిలోనే
వీఆర్వో వ్యవస్థ రద్దు.. 3 నెలలుగా వాళ్లకు పని బంద్
వరద సాయంపై ఎన్నికలప్పుడో తీరు.. ఇప్పుడో తీరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. కొత్తగా అమలుచేస్తున్న విధానాలు.. వరుసగా బూమరాంగ్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని వివాదాల్లో చిక్కుకుంటే.. మరికొన్ని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతను, నిరసనను తెచ్చిపెట్టాయి. ఇంకొన్ని కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు వెళ్లాయి. ముందూ వెనుకా ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకోవటం.. సాధ్యాసాధ్యాలపై సమీక్షలు చేయకపోవడం.. మంత్రులు, సీనియర్ ఆఫీసర్ల ప్రమేయం లేకుండా నేరుగా ప్రగతిభవన్ నుంచి ఓకే చేయడం, ఆగమాగం జీవోలు ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కరోనా టెస్టులు, కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వోల వ్యవస్థ రద్దు, సెక్రటేరియట్, షరతుల సాగు, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్లు, ఆస్తుల సర్వే, ధరణి పోర్టల్.. ఇట్ల దాదాపు ప్రతీ నిర్ణయం, ప్రతీ పాలసీ గోడకు కొట్టిన బంతిలా రివర్స్ అవుతూనే ఉంది. మక్కలు కొనేది లేదని హెచ్చరించడం.. సన్నొడ్లకు నూరో నూటయాభయ్యో ఎక్కువిచ్చి కొంటామని చెప్పి ముఖం చాటేయడం.. గ్రేటర్లో వరద సాయంపై పొంతన లేని ప్రకటనలు చేయడం.. ఇట్ల ప్రతిదీ ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. హడావుడిగా అమలు చేసిన నిర్ణయాలను, ఇచ్చిన జీవోలను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం పడుతున్న తంటాలు.. పాలన రివర్స్ గేర్‌లో పడిందనే విమర్శలు తెచ్చిపెడుతోంది.
ధరణితో అవస్థలు
ధరణి పోర్టల్ ద్వారానే అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. ఇందుకోసం కొత్త చట్టం తెచ్చింది. కానీ పోర్టల్ పై అనేక అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ధరణి పోర్టల్ ను వ్యవసాయ భూములకే పరిమితం చేసింది. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతి ద్వారా చేస్తామని కోర్టుకు తెలిపింది. మొదట ధరణి పోర్టల్ తయారీ కోసం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రభుత్వం విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. ముందుగా పోర్టల్ రూపొందించి, ఆ పోర్టల్ ఆపరేషన్ లో టెక్నికల్, ఇంప్లిమెంటేషన్లో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలో స్టడీ చేయాలి. కానీ ముందుగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేసి, ఆ తర్వాత వెబ్ సైట్ తయారీపై దృష్టి పెట్టింది. హఠాత్తుగా రిజిస్ట్రేషన్లు బంద్ చేయడంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కన్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇతర రంగాలు కుదేలయ్యాయి. బ్యాంకింగ్ రంగంపైనా ప్రభావం పడింది. సర్కారు ఆదాయానికి కూడా గండిపడింది. తిరిగి మూడు నెలల తర్వాత మూడునాలుగురోజుల కింద నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు స్టార్టవడంతో చాలా మంది సంతోష పడ్డారు. వెంటనే తమ ఆస్తులను అమ్ముకొవచ్చని ఆశపడ్డారు. కానీ పోర్టల్‌లో అనేక టెక్నికల్ సమస్యలు, అనుమానాలు తలెత్తాయి. దీంతో వాటి పరిష్కారం కోసం బిల్డర్లు, బ్యాంకర్లతో ప్రభుత్వం సమావేశాలు పెడుతోంది.
ఆస్తుల నమోదు తప్పనిసరి అని చెప్పి..
ధరణి పోర్టల్ లో ముందుగా ఆస్తుల నమోదు తప్పనిసరి అని కండిషన్ పెట్టారు. నిర్ణీత గడువులోపు వివరాలు ఇవ్వని వారు తమ ఆస్తులను అమ్ముకోవడం సాధ్యం కాదని ప్రకటించారు. దీంతోచాలా మంది ప్రజలు ఆందోళన చెందారు. ఆస్తుల వివరాల సేకరణ, పోర్టల్ భద్రతపై కొందరు కోర్టుకు వెళ్లారు. ‘‘వివరాలు నమోదు చేసుకోకపోతే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయరా? ఆస్తుల వివరాల సేకరణ ఏ చట్టం ప్రకారం చేస్తున్నారు?’’ అని కోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తుల వివరాల నమోదు కు డెడ్ లైన్ ఏం లేదని, ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని కోర్టుకు తెలిపింది.
వీఆర్వోలను పక్కన పడేసిన్రు
వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం మూడు నెలలుగా వాళ్లకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదు. వాళ్లను ఇప్పటివరకు ఏ డిపార్ట్‌మెంట్‌కూ కేటాయించలేదు. ఐదు వేల మందికి పైగా వీఆర్వోలు రోజూ తహశీల్దార్ ఆఫీస్‌కు పోయి అటెండెన్స్ వేయించుకుంటున్నారు. తహశీల్దార్లు ఏ పని చెప్తే అది చేస్తున్నారు. వీఆర్వోలను ఏదో ఒక డిపార్ట్మెంట్లో అటాచ్ చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ.. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.
వీఆర్‌ఏలకు పే స్కేల్ ఉత్త ముచ్చట్నే..
కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టినప్పుడే వీఆర్‌ఏలకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ తర్వాత ఆ ముచ్చట్నే మరిచారు. సీఎం హామీ ఇచ్చి వంద రోజులు దాటినా కనీసం విధివిధానాల రూపకల్పనపైనా దృష్టి పెట్టలేదు. 2017లోనూ సీఎం వీఆర్‌ఏల సర్వీస్ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీని అదేవిధంగా పక్కనపెట్టారు. 22 వేల మంది వీఆర్‌ఏలు తమకు స్కేల్ ఎప్పుడు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కరోనా టెస్టులపై విమర్శలు
తొలుత కరోనా టెస్టులు అందరికీ అవసరం లేదంటూ, ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం టెస్టులు చేస్తామని ప్రభుత్వం వాదించింది. ‘ఎక్కువ టెస్టులు చేస్తే గిఫ్టులు, అవార్డులు ఇస్తారా’ అంటూ మంత్రి కేటీఆర్ వెటకారం చేశారు. టెస్టులు ఎందుకు చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత రెండు నెలలకు టెస్టుల సంఖ్యను పెంచింది. లక్షల్లో టెస్టులు చేస్తున్నామని, ఎర్లీ టెస్టింగ్‌తోనే కరోనాను కంట్రోల్ చేయొచ్చునని మంత్రులు, ఆఫీసర్లు ఇప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ప్రైవేట్ ల్యాబులు, హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయడానికి అనుమతి ఇస్తే సమస్యలు వస్తాయని చెప్పిన ప్రభుత్వం, ఆ తర్వాత కొంత కాలానికి ప్రైవేట్‌కు పర్మిషన్ ఇచ్చింది. కొన్ని ప్రైవేటు హస్పిటల్స్ బాధితుల నుంచి అడ్డగోలుగా దోచుకున్నాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో.. ప్రైవేట్ హాస్పిటళ్లలోని 50 శాతం బెడ్లను స్వాధీనం చేసుకుంటున్నామని, వాటిల్లో పేదలకు ఫ్రీగా ట్రీట్‌మెంట్ అందిస్తామని ప్రకటించింది. కానీ, ఒక్క బెడ్డును కూడా తీసుకోలేదు. దోపిడీని నియంత్రించలేదు. తొలుత కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. కానీ, ఇంతవరకు ఆరోగ్యశ్రీలో చేర్చనేలేదు.
ఎల్ఆర్ఎస్పై ఏం చేద్దాం
ఎల్ఆర్ఎస్ తో ప్రజల నుంచి లక్షల్లో ఫీజు వసూలు చేయాలని అనుకున్న ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచన పడింది. ఎల్ఆర్ఎస్ లేని ఇండ్ల జాగలను రిజిస్ట్రేషన్ చేయబోమని కండిషన్ పెట్టింది. దీంతో ప్లాట్లు కోనుగోలు దారులు ఎల్ఆర్ ఎస్ కోసం అప్లయ్ చేసుకున్నారు. ఫీజు తగ్గించాలని సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో ఎల్ఆర్ ఎస్ పై పునరాలోచనలో పడింది.
సెక్రటేరియట్ అనవరంగా కూల్చేసినమా?
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఉన్న సెక్రటేరియట్ ను కూల్చడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మంచిగున్న బిల్డింగ్స్ ను కూల్చేశారు. సెక్రటేరియట్ ఖాళీ చేసి ఏడాదిన్నర అయిపోయింది. అప్పట్నించి ఏ మంత్రి ఎక్కడ ఉంటారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఈ మధ్య హైదరాబాద్ కు వరదలు వస్తే మంత్రులు, ఆఫీసర్లతో మీటింగ్ పెట్టడానికి బీఆర్కే భవన్ లో ప్లేస్ లేకుండా పోయింది. ఆ మీటింగ్ కు వచ్చిన ఓ మంత్రి.. ‘‘సెక్రటేరియట్ ను అనవసరంగా కూల్చేశారు. ఎప్పుడు పూర్తవుతుందో ఏమో’’ అని కామెంట్ చేశారు.
షరతుల సాగుపై వెనక్కి..
షరతుల సాగు పేరుతో తాము చెప్పిన పంట వేసిన వారికే రైతుబంధు పైసలు ఇస్తామని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. కానీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గింది. తర్వాత సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చింది. కేసీఆర్ మాటలు నమ్మిన రైతులు పెద్ద ఎత్తున సన్నరకాలు పండించారు. సన్న రకాలతో దిగుబడి తక్కువ రావడం, వానలతో పంట దెబ్బతినడం, ఉన్న కాస్త పంటను కూడా కొనేదిక్కు లేకపోవడంతో రైతులు గోస పడ్డారు. చివరికి సన్నాలకు నూరో, నూటయాభయ్యో ఎక్కువిస్తామని దుబ్బాక బై ఎలక్షన్‌కు ముందు సీఎం ప్రకటించారు. అయినా ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇక వానా కాలంలో మక్కలను కొనేది లేదని సీఎం చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. మక్కలను కొంటామని ప్రకటించింది. దీంతో మీసేవ ద్వారా అప్లయ్ చేసుకోవాలని బాధితులకు సూచించింది. దీంతో ప్రతి మీసేవ సెంటర్ వద్ద కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లో ప్రజలు నిలబడాల్సి వచ్చింది. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామంది. రిజల్ట్ వచ్చి పది రోజులు అవుతున్నా ఇంత వరకు వరద సాయంపై నిర్ణయం తీసుకోలేదు.
వరద సాయంలో బొక్కబోర్లా
హైదరాబాద్ వరద బాధితులకు రూ. 10 వేల సాయం విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. లీడర్లే పైసలు పంచుకుతిన్నారని, తమకు సాయం అందలేదని పెద్ద ఎత్తున బాధితులు రోడ్డెక్కారు.
బెడిసికొట్టిన ధరణి
ధరణి ద్వారానే అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన సర్కారు కొత్త చట్టం తెచ్చింది. దానిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు కలగజేసుకోవడంతో ధరణి పోర్టల్ ను వ్యవసాయ భూములకే పరిమితం చేసింది.
మక్కలపై యూటర్న్!
వానా కాలంలో మక్కలను కొనేది లేదని సీఎం ప్రకటించారు. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం.. మక్కలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలుకు సిద్ధపడింది.
ఎల్ఆర్ఎస్పై లొల్లి లొల్లి
ఎల్ఆర్ఎస్తో లక్షల్లో ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం అనుకుంది. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత మొదలైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో ఎల్ఆర్ ఎస్ పై పునరాలోచనలో పడింది.
కరోనాపై గత్తర గత్తర
కరోనా టెస్టులు అందరికీ అవసరం లేదని, టెస్టులు చేస్తే ప్రైజులిస్తరా? అని ప్రభుత్వ పెద్దలు కామెంట్లు చేశారు. పరీక్షలు ఎందుకు చేయడం లేదని కోర్టు నిలదీయడంతో.. టెస్టుల సంఖ్యను పెంచారు.