నీళ్ల పథకం నీరు గారిందా? : దొంతి నర్సింహారెడ్డి

నీళ్ల పథకం నీరు గారిందా? : దొంతి నర్సింహారెడ్డి

నీరు జీవనానికి అత్యంత అవసరమైన ప్రకృతి వనరు. మానవాళి క్రమంగా నీటిని అనేక అవసరాలకు వాడడం పెరిగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఈ నీటి మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తి, వినియోగం, వినిమయం వగైరా అన్నీ కూడా నీరు లేనిదే గడవని పరిస్థితికి చేరుకున్నాం. నీరు అభివృద్ధికి ఆలవాలం అయిన తరుణంలో అందరికి నీళ్ళు ఇవ్వడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. 

ఓట్ల కొరకు నీళ్ళు వాగ్దానం చేసే రాజకీయ నాయకులు ఆనక ఆ వాగ్దానాలను పథకాల రూపం తీసుకున్నప్పుడు వాటి మీద దీర్ఘకాలిక ఆలోచనలు చేయకుండా ఏదోలా అమలు చేసి ఫలితంరాని పెట్టుబడులు పెడుతున్నారు. చివరికి, నీళ్ళు రావు. నిధుల భారం మిగిలిపాయే. అట్లాంటిదే మిషన్ భగీరథ పథకం.

ఇంటింటికి నీళ్ళ పథకానికి నామకరణం చేసి, ఒక పథకంగా చూపెట్టి ప్రచారం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు నివేదికలు కాని, టెండర్లు కాని తయారు చేయలేదు. ఈ పథకం వల్ల ఏర్పడే ప్రయోజనాలు, ఖర్చులు, భారం వగైరా అంశాల పరిశీలనకు టెక్నో- ఎకనామిక్ ఫీజిబిలిటి నివేదిక కానీ తయారు చేయలేదు. పథకం మొదలు అయిన 3 ఏండ్ల తరువాత 2019లో ఇటువంటి నివేదిక తయారు చేయడానికి రూ.30 లక్షలతో టెండర్ పిలిచారు. అది తయారు అయ్యిందా లేదా తెలియదు. ఇంత పెద్ద పథకం గురించి పూర్తి వివరాలతో కూడిన చర్చ తెలంగాణ శాసన సభలో చేయలేదు. ఈ పథకం రాష్ట్ర బడ్జెట్​లో  ఎన్నడూ పెట్టలేదు. 

లోపించిన పారదర్శకత

ఏ ఒక్క ప్రభుత్వ శాఖా అజమాయిషీ లేకుండా దీనికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పనులు మొదలు పెట్టి చివరకు నీటి పారుదల శాఖ పరిధిలోకి తీసుకు వచ్చారు. ఇట్లా ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ ప్రశ్న కూడా అడిగేవారు లేరు.  ప్రజలకు మంచి నీరు అందించే పథకం కాబట్టి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తారు. పారదర్శకంగా ఎందుకు అమలు చేయలేదు? మూడు ప్రధాన కారణాలు.. ఒకటి, ఈ పథకం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనాలు తామే పొందడానికి అప్పటి అధికార పార్టీ పన్నాగం. రెండు, పథకం వేగంగా అమలు చేయడం. మూడు, ప్రభుత్వ శాఖల్లో ఉండే విధి విధానాలు అడ్డంకిగా మారుతాయని భావించడం. 

పూర్తి  కానేలేదు

2015లో మొదలుపెట్టి తొందరగా ముగిస్తామనుకున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు మొదట్లో అనుకున్న (ప్రకటన ద్వార) పథకం రూపురేఖలు తరువాత మార్పుకు లోనైనాయి. అమెరికాలో తరహ ఇంట్లో నల్లా తిప్పితే మంచి నీళ్ళు వచ్చినట్టు ఇక్కడ కూడా అదే లక్ష్యంతో మొదలు పెట్టిన ఈ పథకం తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అన్ని ఇండ్లకు చేరలేదు. అన్ని గ్రామాలకు చేరలేదు. అన్ని పట్టణ బస్తీలకు చేరలేదు. ఆమేరకు అది పూర్తి కాలేదు. చేసిన పనుల్లో జాప్యం ఏర్పడింది. చేయాల్సిన పనులు అనేకం  పూర్తి కానే లేదు. 

సెంట్రలైజ్​ టెక్నాలజీ సెంటర్​ లేదు

మిషన్ భగీరథ పథకం ఒక సాంకేతిక అద్భుతం అని వర్ణించిన అధికారులు, దాని గుండెకాయ గురించి అయిన కేంద్రీకృత టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో నీటి సరఫరా నియంత్రించే వ్యవస్థకు ఈ కేంద్రం ప్రాజెక్టు ప్రణాళికలో చాలా కీలకం. అటువంటి కేంద్రం ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. ఇటువంటి సాంకేతిక కేంద్రానికి ముఖ్యమైన సాధనం స్కాడా టెక్నాలజీ. నీటి పైపులైన్లలో నీటి సరఫరా గురించి సమాచారం నిరంతరం అందించేది ఈ వ్యవస్థ. ఎక్కడ లీకేజీ అయినా, ఏ పైపులైన్​లో ఎంత నీరు సరఫరా అయ్యింది తెలుసుకునే వ్యవస్థ. 

ఇటువంటి కేంద్ర వ్యవస్థ లేకపోగా అక్కడక్కడ ఉన్న సరఫరా కేంద్రాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉన్నట్టు లేదు. మొదట్లో పెద్ద ఎత్తున ప్రధాన పైపులైన్లలో వచ్చిన లీకేజీల సమాచారం తెలిసి ఉండేది. కొన్ని చోట్ల లీకేజీలు చాలా ఆలస్యంగా గుర్తించారు. 2016 టెండర్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత 5 ఏండ్ల వరకు రిపేర్లు గట్రా, 10 ఏండ్ల వరకు నిర్వహణ కాంట్రాక్టర్ పని. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2024 నుంచి మిషన్ భగీరథ గ్రామ స్థాయిలో నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ గ్రామ పంచాయతీల పరిధిలోకి తెచ్చింది. ఈ వ్యవస్థకు మిషన్ భగీరథలో ఇచ్చిన బడ్జెట్ రూ.7,535 కోట్లు. ఓవర్‌‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నుంచి ఇంటి కనెక్షన్ వరకు ఇంట్రా-విలేజ్ నీటి సరఫరా వ్యవస్థను నిర్వహించాలని గ్రామ పంచాయతీలను ఆదేశిస్తూ ఒక జీఓ జారీ చేసింది. కేంద్ర ఫైనాన్స్ కమిషన్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ లేదా సంబంధిత పంచాయతీల నిధుల నుంచి ఈ పనులకు అయ్యే వ్యయాన్ని భరించాలి అని చెప్పింది. ఇది సహేతుక నిర్ణయమే అయినా మరి 10 ఏండ్ల నిర్వహణకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన సొమ్ము సంగతి ఏంది?

భగీరథ నీళ్లు  ప్రజలు తాగుతున్నారా?

మిషన్​ భగీరథ నీరు తాగే యోగ్యత ఎంత? ప్రజలు చాలా మేరకు మిషన్​ భగీరథ నీటిని ఎందుకు తాగడం లేదు ? ఇతరత్రా అవసరాలకు వాడుతున్నారు. మినరల్​ వాటర్​నే కొనుక్కొని ఎందుకు తాగుతున్నారు? వేల కోట్ల ‘భగీరథ’ పథకం నిరుపయోగమేనా? అత్యంత కీలకమైన ఈ ప్రశ్నలకు గత ప్రభుత్వం ఏనాడూ జవాబులు చెప్పలేదు.

అడవులు, చెట్ల నరికివేత అవసరం మేరకే జరిగిందా?

ఈ పథకం పరిధిలోకి దాదాపు 475 హెక్టార్ల అటవీ భూములు వస్తాయని అంచనా వేసి, వాటికి ఒకేసారి గంపగుత్త అనుమతులు అడగకుండా, వాటిని ముక్కలుగా చేసి అనుమతులు తెచ్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో అనుమతుల ప్రక్రియ మొదలుపెట్టకుండానే  పనులు చేపట్టారు.  హెక్టారుకు 50 చెట్లు నరకొద్దని నిబంధన ఉన్నా, అసలు ఎన్ని హెక్టార్ల అటవీ భూమి వారికి అప్పజెప్పారు, కొట్టేసిన చెట్లు ఎన్ని, కట్టిన సొమ్ము ఎంత వగైరా వివరాలు తెలియాల్సి ఉంది. 

కేంద్ర పర్యావరణ శాఖ వెబ్​సైట్​లో పెట్టిన సమాచారం మేరకు అటవీ భూముల్లో మంచి నీటి ప్రాజెక్టులు కట్టడానికి 72 ప్రతిపాదనలు మంజూరు అయ్యాయి. ఇవిగాక రాష్ట్ర అటవీ శాఖ ఎన్ని ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చిందో తెలియాల్సి ఉంది. మొత్తానికి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వల్ల అడవులు, చెట్లను కూడా కోల్పోవలసి వచ్చింది. ఇది అవసరం మేరకే జరిగిందా లేదా అనే విషయం మీద సమీక్ష జరగలేదు. 

లక్ష్యానికి తూట్లు

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మనిషికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135, పెద్ద నగరాలలో 150 లీటర్లు ఇస్తామని వాగ్దానం చేసింది ప్రభుత్వం. పరిశ్రమలకు 10 శాతం ఇస్తామని కూడా ఉత్తర్వులు ఉన్నాయి. కృష్ణా నది మీద ఉన్న 17 ప్రాజెక్టుల నుంచి 23 టీఎంసీ, గోదావరి మీద ఉన్న 21 ప్రాజెక్టుల నుంచి 32 టీఎంసీ నీళ్ళు తీసుకోమని ఉత్తర్వులు 2017లో జారీ చేసింది. 

ఇందులో 10 శాతం అంటే  5 టీఎంసీ నీళ్ళు పరిశ్రమలకు పోతాయి. మొత్తంగా 55 టీఎంసీల నీళ్ళు ఇండ్లల్లో, పరిశ్రమల్లో వాడిన తరువాత దాదాపు 80 శాతం కలుషిత జలాలుగా మారతాయి. ఈ వ్యర్థ జలాలను ఏ విధంగా నిర్వహిస్తారు? దేనికి ఉపయోగిస్తారు? వంటి ప్రశ్నలకు ఈ పథకంలో, ప్రభుత్వంలో జవాబు లేదు.   వాటికి పరిష్కారాలు ఎక్కడా చేపట్టలేదు. మంచి నీరు అందించి ప్రజల ఆరోగ్యం పెంచుతామని లక్ష్యంతో మొదలు అయిన పథకం, లోపభూయిష్ట ప్రణాళికతో, తొందరపాటుతో అదే లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది.

సోర్స్​ఆఫ్​ సస్టైన్​బిలిటీ ఏది?

ప్రాజెక్టుల నుంచి నీళ్ళు తీసుకోవడం మిషన్ భగీరథ పథకంలో కొత్త,  వినూత్నమైన ఆలోచనగా, ఆచరణీయమైన సుస్థిర యోచనగా ప్రచారం చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్ళు లేకపోతే? ప్రాజెక్టుల నీళ్ళు నిరంతరం ఉంటాయని గ్యారెంటీ లేదు. ఈ సంవత్సరమే కృష్ణా,  గోదావరి నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దాదాపు అన్ని ప్రాజెక్టులు ఎండిపోయాయి. కృష్ణా నదిలో నీళ్ళు లేక దాదాపు 2 ఏండ్లు అయితుంది. శ్రీశైలం ప్రాజెక్టు మీద తీవ్ర ఒత్తిడి ఉంది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో ‘సోర్స్​ ఆఫ్​ సస్టైన్​బిలిటీ’ గురించి కించిత్తు ఆలోచన కూడా చేయలేదు. 

దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడి కేవలం నీళ్ళు ‘ఇక్కడి’ నుంచి ‘అక్కడి’కి తీసుకుపోవడానికి మాత్రమే. సహజ, ప్రకృతి నీటి వ్యవస్థను బలోపేతం చేసే ఆలోచన ఈ పథకంలో లేదు. ప్రకృతి ఇస్తున్న నీటిని నిలువ చేసుకోవడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించకుండా, పైపులైన్ల వ్యవస్థ మీద ఖర్చు పెట్టి నీటి సరఫరా సుస్థిరం చేస్తున్నట్టుగా తెచ్చిన ‘భగీరథ’  పథకం మీద పూర్తి స్థాయి సమీక్ష అవసరం ఉన్నది.

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​
(మిగతా రేపు)