తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత బడ్జెట్తో పోలిస్తే ఎక్కువో, తక్కువో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈ బడ్జెట్ ను ఇప్పటి వరకూ కొనసాగిన మార్గదర్శకాల ప్రకారమే కేటాయించినా, ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. దాని వల్ల ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం కావు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు విషయంలో పాత ఆలోచనా ధోరణిని మార్చుకుని, కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు విధానపరంగా, చట్టపరంగా కొన్ని అంశాలు చర్చించి నిర్ణయాలు చేయాలి. వీటిని అసెంబ్లీలో చర్చించి ఆమోదించడంతోపాటు వెంటనే అమలులోకి తీసుకురావాలి.
వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు
తెలంగాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలి.రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ కుటుంబాల కోసం ఉద్యోగుల వేజ్ కమిషన్ తరహాలో ఆదాయ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ సిఫారసులకు చట్టబద్ధత కల్పించాలి. తెలంగాణ వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి కమిషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్ గా నియమించాలి. చట్టం ప్రకారం పూర్తి స్థాయి కమిషన్ ను నియమించాలి. ఈ కమిషన్ లో ఇద్దరు మహిళలు ఉండేలా నియమించాలి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ రూపొందించిన కరువు మాన్యువల్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నందున రాష్ట్ర స్థాయిలో పంటల బీమా పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ పంటల బీమా కంపెనీని ఏర్పాటు చేయాలి. 2022 వానా కాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాలను అమలు చేయాలి.
వ్యవసాయ రంగం కోసం కేటాయించే నిధులలో నిర్వహణ పద్దు కింద, వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైన నిధులను కేటాయించాలి. రెండున్నర వేల ఎకరాలు లేదా 1000 మంది రైతులకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండేలా మార్గదర్శకాలు మార్చి ఈ కేటాయింపులు చేయాలి. మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యాన అధికారులకు ప్రత్యేక కార్యాలయం, వాహన సౌకర్యం కల్పించాలి. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వీలుగా రాష్ట్ర సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించాలి. దీని కోసం బడ్జెట్ లో తగిన నిధులను కేటాయించాలి. వ్యవసాయ విద్యా, పరిశోధనల్లో ఈ అంశాన్ని చేర్చాలి. విద్యా, పరిశోధనలకు నిధులు పెంచాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు రిజర్వేషన్లలో కౌలు రైతుల పిల్లలకు అవకాశం ఇవ్వాలి.
రైతుబంధు సాయానికి పరిమితి పెట్టాలె
రైతు బంధు పెట్టుబడి సాయానికి భూమి పరిమితిని నీటి పారుదల ప్రాంతాల్లో 5 ఎకరాలకు, మెట్ట ప్రాంతాల్లో 7.5 ఎకరాలకు పరిమితం చేయాలి. రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, గుట్టలకు రైతు బంధు సాయం ఇవ్వడం మానేయాలి.గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేలు వారీగా ప్రతి సీజన్ లో ప్రతి సర్వే నంబర్ లో ఎవరు వాస్తవంగా సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు బంధు పెట్టుబడి సాయం అందించాలి. ఈ మేరకు ఎప్పటికప్పుడు నిజమైన సమాచారం అందించేలా, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. పెట్టుబడి సాయం నిజమైన సాగుదారులకు మాత్రమే ఉపయోగపడేలా మార్గదర్శకాలు మార్చాలి. 2022 వానాకాలం సీజన్ నుంచి కౌలు రైతులకు, పోడు రైతులకు, మహిళా రైతులకు కూడా రైతుబంధు సాయం అందించేలా మార్గదర్శకాలు మార్చాలి. రైతు బీమా పథకాన్ని గ్రామీణ ప్రజల బీమా పథకంగా మార్చాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలి. వయో పరిమితిని 75 సంవత్సరాలకు పెంచాలి. పాత కౌలు రైతు చట్టాలను సమీక్షించి, 15 లక్షల మంది కౌలు రైతులకు న్యాయం జరిగేలా, కొత్తగా కౌలు రైతుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలి.
రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పడి పని చేస్తున్న రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న సహకార సంఘాలను ఒక వేదిక మీదకు తేవడానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పరచాలి. ఈ కమిటీ అధ్వర్యంలో పంటల ప్రణాళిక, పంటల మార్కెటింగ్, గ్రామీణ , ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు తదితర అంశాలు ఉంచాలి. వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలి. రైతులు, ఇతర ఉత్పత్తి దారుల ప్రతినిధులను కూడా ఈ కమిటీలో నియమించాలి గ్రామీణ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలను రైతులుగా గుర్తించే ప్రక్రియ వెంటనే చేపట్టాలి. వారికి రైతులుగా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. అన్ని స్థాయిల్లో జండర్ సెల్స్ ఏర్పాటు చేయాలి. బడ్జెట్ లో మహిళా రైతుల కోసం 33% నిధులు కేటాయించి ఖర్చు చేయాలి.
రైతు వేదికల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.
రైతు వేదిక భవనాలను, గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయం, ఇతర జీవనోపాధులపై అవసరమైన శిక్షణ కోసం ఉపయోగించాలి. ఈ శిక్షణలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. వివిధ శాఖల అధికారులను, ఇతర నిపుణులను ఈ శిక్షణ కోసం ఎంపిక చేసుకోవాలి.
రాష్ట్రంలో ఉన్న కోటి పశువుల సంరక్షణ(మేత, ఆరోగ్యం ) కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో పాడి రైతుల సహకార సంఘాలను జిల్లా స్థాయిలో ఏర్పర్చాలి. వాటిని రాష్ట్ర సమాఖ్యలో భాగస్వాములను చేయాలి. గుజరాత్ నుంచి వచ్చే అమూల్ ను ప్రోత్సహించడం కాకుండా, మన రాష్ట్ర పాడి రైతులకు, గ్రామీణ కుటుంబాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలి. అవసరమైన పెట్టుబడులు పెట్టాలి. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే ఆహార శుద్ధి పరిశ్రమల పార్క్ ల్లో మన రాష్ట్రంలో ఏర్పడి పని చేస్తున్న సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సమాఖ్యలకు, జిల్లా మహిళా సమాఖ్యలకు ఉచితంగా స్థలాలు ఇవ్వాలి. ఈ సహకార సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు బ్యాంకులు ఇచ్చేలా ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. ఈ సహకార సంఘాలకు రుణాలపై వడ్డీ రాయితీ కోసం నిధులు కేటాయించాలి. ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే ప్రాసెసింగ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ లేదా తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాలి. అలాగే ఈ పరిశ్రమల ఏర్పాటులో సహకార సంఘాలు చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి రీయింబర్స్ చేయాలి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నిజమైన సాగుదారులకు మాత్రమే లక్ష రూపాయల రుణ మాఫీ ఒకే విడతలో పూర్తి చేయాలి. వ్యవసాయం చేయని కేవలం భూమి యజమానులకు రుణమాఫీ చేయనవసరం లేదు.రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన మండల స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ధరణిలో తప్పులను వెంటనే సరి చేయాలి. నిర్ధిష్ట కాల పరిమితిలో భూ సమగ్ర సర్వే పూర్తి చేసి, రీ సెటిల్మెంట్ చేయాలి.సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమీక్షించాలి. శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తూనే, మన సాగు భూములకు, వాతావరణానికి పనికిరాని, వరి, ఆయిల్ పామ్, పత్తి లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల ప్రోత్సాహాన్ని మానుకోవాలి.
సామాజిక న్యాయం కోణంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు..
బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు తప్పకుండా చట్టం ప్రకారం పూర్తి స్థాయి నిధుల కేటాయింపు చేయాలి. గత సంవత్సరాల్లో ఈ పద్దు కోసం కేటాయించి ఇప్పటి వరకూ ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను కూడా ఈ బడ్జెట్ లో విడిగా చూపించి అదనంగా కేటాయించాలి. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని అందించే పథకాన్ని కొనసాగించాలి. మూడెకరాల భూమి ఇప్పటికే పొందిన దళిత మహిళలను రాష్ట్ర స్థాయిలో సహకార సంఘంగా నిర్మించి, వారి భూముల అభివృద్ధికి, వ్యవసాయానికి మద్దతు అందించాలి.
ఎస్సీ, ఎస్టీ తరగతుల్లో బాగా వెనుకబడిన వర్గాలకు కూడా ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల వారికి వివిధ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలి. అలాగే సంచార జాతుల జీవనోపాధి, ఇతర సంరక్షణలకు సంబంధించి చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో చదువు నుంచి డ్రాప్ ఔట్ అయిన యువతీ యువకులకు వివిధ విషయాల్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణలు ఇచ్చి, వారి జీవనోపాధికి అవసరమైన పెట్టుబడి సహాయం అందించడానికి ప్రత్యేక స్కీములు అమలు చేయాలి. రాష్ట్రంలో బీసీ వర్గాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం దక్కేలా కొత్త పథకాలు రూపొందించాలి.
మైనారిటీ వర్గాలకు, వారి జనాభాను బట్టి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ప్రత్యేక పథకాలు రూపొందించాలి. 2016 సుధీర్ కమిషన్ రిపోర్ట్ సిఫారసులను అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.రాష్ట్రంలో సగ భాగంగా ఉన్న మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలి. మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో 33 శాతం జండర్ బడ్జెట్ గా కేటాయించి, అన్ని శాఖల్లో మహిళలకు నైపుణ్యం, ఉపాధి, ఆదాయం కల్పించేలా ప్రత్యేక పథకాలు రూపొందించాలి. ట్రాన్స్ జండర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక విధానం రూపొందించాలి. ట్రాన్స్ జండర్ లకు కూడా ఆసరా పెన్షన్ అందించాలి.
సమాజంలో పిల్లలు(0–6 అంగన్ వాడీ, 5–15 స్కూల్ విద్యార్థులు ,16–18 ఇంటర్మీడియెట్) అతి ముఖ్యమైన భాగం. ఈ పిల్లల శారీరక, మానసిక, మేధోపరమైన అభివృద్ధి భవిష్యత్ సమాజానికి అత్యంత ముఖ్యమైనది. ఈ పిల్లల అభివృద్ధి కోసం కేంద్రం అమలు చేసే పథకాలను వాడుకుంటూనే ప్రత్యేక పథకాలు రాష్ట్ర స్థాయిలో రూపొందించాలి.వృద్ధాప్య పింఛన్, ముఖ్యంగా వృద్ధుల జంటకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను నెలకు రూ.5,000కు పెంచాలి. మిగిలిన వారికి రాష్ట్ర కనీస వేతనంలో కనీసం 50 శాతం పెన్షన్ ఉండేలా విధాన నిర్ణయం చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెన్షన్ మొత్తాలను సవరించాలి. వృద్ధుల సంక్షేమం, సంరక్షణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. సమాజంలో శారీరకంగా వైకల్యం కలిగిన వ్యక్తుల సంక్షేమానికి, సంరక్షణకు అభివృద్ధికి ఒక విధానం రూపొందించాలి. వారి జీవనోపాధికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలి.