- రూ.లక్షల ఖర్చుకు కూడా వెనకాడని లీడర్లు
- లోపాలుంటే సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు
- పార్టీల్లో కొత్తవారి చేరికలతో మార్పులపై తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సర్వేలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న లీడర్లు, తమ విజయావకాశాల గురించి తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నారు. సర్వే ఏజెన్సీలు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నా, చెల్లించేందుకు వెనకడగు వేయడం లేదు. కొందరు నాయకులు ఇప్పటికే రెండు సార్లు సర్వే చేయించుకొని, లోపాలుంటే సరిదిద్దుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ పార్టీల్లో కొత్త లీడర్ల చేరికలతో ఎంత ప్రభావం ఉంటుందోననే విషయంపై కొందరు మళ్లీ సర్వేలు చేయిస్తున్నారు. ప్రస్తుతం మూడు సర్వే టీమ్‌లు జిల్లాలో ముమ్మరంగా పనిచేస్తున్నాయి.
మంత్రి ఇలాఖాలో..
మంత్రి ప్రశాంత్‌రెడ్డి బాల్కొండ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తాననే ధీమాతో ఉన్నారు. తనవైపున్న లోపాలను తెలుసుకునేందుకు ఇటీవల సర్వే చేయించుకున్నారు. ఏజెన్సీ వాళ్లిచ్చిన సూచన మేరకు కులసంఘాల నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ అభ్యర్థి బరిలో ఉంటే, తనకు గెలుపు సునాయాసం అవుతుందోననే విషయంలోనూ ఏజెన్సీ వాళ్లు మంత్రికి సూచించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కిసాన్ఖేత్రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి కూడా సర్వేలు చేయించుకున్నారు. రూలింగ్పార్టీ అవినీతి వ్యవహారాలపై ప్రచారం ముమ్మరం చేయాలని ఏజెన్సీలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన సునీల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ లీడర్ మల్లికార్జున్‌రెడ్డి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు మంత్రి తరఫున ఓ ఏజెన్సీ పనిచేస్తున్నట్లు సమాచారం.
నిజామాబాద్అర్బన్లో..
అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ లీడర్ధన్పాల్సూర్యనారాయణ వ్యక్తిగతంగా రెండు సర్వేలు చేయించుకున్నారు. ఏజెన్సీ వర్గాలిచ్చిన్న నివేదిక తనకు అనుకూలంగా ఉండడంతో మరింత జోష్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య నేరుగా ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాను టార్గెట్‌చేసి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తాను చేయించుకున్న సర్వే రిపోర్ట్‌తో పాటు, హైకమాండ్ సూచనల మేరకు గణేశ్‌గుప్తా కొంతకాలంగా నియోజకవర్గంలోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాంగ్రెస్వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్గౌడ్ ప్రస్తుతం ఇండివిడ్యుయల్ సర్వే
చేయించుకుంటున్నారు.
లాస్ట్ మినిట్‌లో పార్టీ మారితే..
బోధన్ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల్లో ఇద్దరేసి ముఖ్యమైన లీడర్లు టికెట్ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతుండగా, మరో లీడర్కెప్టెన్కరుణాకర్రెడ్డి కాంటెస్ట్అవకాశం కోసం ఆశతో ఉన్నారు. బీజేపీలో ప్రకాశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. టికెట్‌దక్కని పరిస్థితిలో ఏ లీడరైనా లాస్ట్ మినిట్ పార్టీ మారే అవకాశం ఉంటే, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై లీడర్ల వద్ద సర్వే నివేదికలు ఉన్నాయి.
రూరల్‌లో..
రూరల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూడా తన పరిస్థితిపై సర్వే చేయించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్నగేశ్రెడ్డి తాజా మార్పులపై సర్వేకు ఏజెన్సీలను సంప్రదించారు. యువకులు నిర్వహిస్తున్న ఓ ఏజెన్సీకి తన పరిస్థితిపై అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పురమాయించారు.
కుల సంఘాల ఓట్ల కోసం..
ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలపై కుల సంఘాలు, గ్రామ కమిటీల ప్రభావం అధికంగా ఉంటుంది. తన విజయావకాశాలపై ఇవి ఎంతవరకు ప్రభావితం చూయిస్తాయనే అంశంపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇప్పటికే రెండు సర్వేలు చేయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, మాజీ మంత్రికి సన్నిహితుడైన ఏబీ చిన్నా ఉన్నారు. బీజేపీ నుంచి వినయ్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారనే బలమైన ప్రచారం జరుగుతోంది. బీజేపీలో పల్లె గంగారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి కాంటెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో రెండు బలమైన కులాల ఓట్లను గంపగుత్తాగా పొందడానికి ఏం చేయాలనే క్లారిటీ కోసం మూడు ప్రధాన పార్టీలు సర్వే ఏజెన్సీలకు పని అప్పగించాయి.