
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి స్థలం వివాదం రోజురోజుకు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానిరెడ్డి మధ్య మొదలైన గొడవ చివరికి రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టే వరకు వెళ్లింది. తుల్జా భవాని స్వయంగా తన పేరిట ఉన్న స్థలం ప్రహరీ గోడను కూల్చగా, అందుకు స్థానిక ప్రతిపక్ష పార్టీల నేతలు సహకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుల లిస్ట్‌నుంచి తుల్జా భవాని పేరును నుంచి తొలగించిన పోలీసులు, ప్రతిపక్ష నేతల పేర్లను ఉంచారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ రాజకీయ నేతల జోక్యం కారణంగా కుటుంబ వివాదం రాజకీయం అయ్యిందన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల టైంలో పెద్ద చెరువు మత్తడి స్థల వివాదం పొలిటికల్ హీట్పెంచుతోంది.
కక్ష సాధింపు చర్యలే
వివాదాస్పద స్థలం పక్కనే ఉన్న అన్నం జితేందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలం ప్రహరీని కూల్చివేశారని అతని భార్య రాజీబాయి తుల్జా భవానిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన చేర్యాల పోలీసులు.. భవానిరెడ్డి తన సొంత స్థలం ప్రహరీ గోడను తానే కూల్చుకుందని చెబుతూ నిందితుల లిస్ట్‌నుంచి ఆమె పేరును తొలగించారు. 15 మంది ప్రతిపక్ష పార్టీల నేతలపై మాత్రం కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, కాంగ్రెస్ రాగుల శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ జిల్లా కమిటీ మెంజర్ అందె అశోక్, టీడీపీ నాయకుడు ఒగ్గు రాజుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మరో 11 మంది నేతల పేర్లను చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడేండ్ల కింద ఇదే స్థలంలో ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై విచారణ సాగుతోంది. పెద్ద చెరువు మత్తడి స్థలం వివాదం తెరపైకి వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మత్తడి స్థలం రిజిస్ట్రేషన్ సాధ్యమేనా?
పెద్ద చెరువు మత్తడి స్థలంలో తన పేరిట ఉన్న 1,270 గజాల స్థలాన్ని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని ఎమ్మెల్యే కూతురు ప్రకటించగా, అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నంబర్ 1402 పరిధిలో 2,500 గజాల ఖాళీ స్థలం ఉండగా, అందులోని 1,270 గజాలను 2020లో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి తన కూతురు పేరు మీద, తన వ్యాపార భాగస్వాములైన మారుతీ ప్రసాద్, జితేందర్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో కొద్ది రోజులుగా తుల్జా భవానిరెడ్డి తండ్రి యాదగిరిరెడ్డిని బహిరంగంగా నిలదీస్తూ వస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థలం కొనుగోలు చేశారని ఆరోపిస్తూనే.. సదరు స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చేస్తానని ప్రకటించడం అయోమయానికి గురిచేస్తోంది.
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ?
చెరువు మత్తడి స్థల వివాదంలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్టు తెలుస్తోంది. దశాబ్దం క్రితం ఇదే స్థలాన్ని కొందరు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నిస్తే అడ్డుకున్న అధికారులు ప్రస్తుతం మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి పట్టా స్థలంగా పేర్కొంటూ కొనుగోలు చేసి కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేయించగా, ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చెరువు కట్ట వెంబడి పైకి కాలువ అలైన్మెంట్ ఖరారు చేశారు. ఇటీవల కాలువ నిర్మాణం పనులకు మరో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సైలెంట్‌గా ఉండడం, పోలీసులు ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోట్ల విలువైన స్థలాన్ని కాపాడుకోవడానికి అన్ని శాఖలను వాడుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.