మేనిఫెస్టోలే ప్రచారాస్త్రాలు కావాలి

ఎన్నికల ప్రచారాల్లో మేనిఫెస్టోలకే  రాజకీయపార్టీలు ప్రయారిటీ ఇవ్వాలి. మేనిఫెస్టోలోని  అంశాలను ఆధారం చేసుకునే ప్రజల దగ్గరకు వెళ్లాలి. ఓట్లడగాలి. అయితే వాస్తవంగా అది జరగడం లేదు. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా కించపరచడంతోనే  పార్టీలు టైం గడిపేస్తున్నాయి. ఆరోగ్యకరమైన  ప్రజాస్వామ్యానికి ఇది ఎంత మాత్రం పనికిరాంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. దూషణలతోనే  కాలం వెళ్లబుచ్చాలనుకుంటే మేనిఫెస్టోలతో పనేమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధాలు జరగడం అసహజం కాదు. అయితే దీనికి కూడా  ప్రజాస్వామ్య విలువలే గీటురాయిగా ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిని  కాపాడుకుంటూ అందుకు అనుగుణంగా పొలిటికల్ పార్టీలు అడుగులు వేస్తేనే  ప్రజాస్వామ్యం నిలుస్తుంది. లేదంటే ప్రజాస్వామ్యం మేడిపండును తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అభివృద్ధే అజెండా కావాలి రాజకీయ పార్టీలు ప్రచారంలో తమ జెండాలతో పాటు అజెండాలను కూడా తప్పనిసరి చేయాలి. అభివృద్దే అజెండా కావాలి. అప్పుడే వ్యక్తిగత దూషణలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రభుత్వాల ఏర్పాటులో ప్రజల సమస్యలకు సంబంధించిన పరిష్కారాలే  ప్రధాన అస్త్రాలు కావాలి.  వివిధ మతాలు, కులాలు ఉన్న ఈ దేశంలో అభివృద్ధికే అన్ని రాజకీయ పార్టీలు ప్రయారిటీ ఇవ్వాలి. అభివృద్ధే రాజకీయ పార్టీల ఆయుధం కావాలి.  ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లడిగే రాజకీయ పార్టీలకు నిబద్ధత చాలా అవసరం. దీంతో పాటు సమాఖ్య స్ఫూర్తి కూడా అవసరం. అందుకు విరుద్ధంగా జరిగే చర్యలు ప్రజాస్వామ్య వాదులను కలవరపెడుతున్నాయి.
– సంవేదన, హన్మకొండ