పదేళ్లు తెలంగాణను కేసీఆర్​ ఆగం పట్టించారు.. పైత్యం ముదిరిన కూటమి రాతలు

పదేళ్లు తెలంగాణను కేసీఆర్​ ఆగం పట్టించారు.. పైత్యం ముదిరిన కూటమి రాతలు

చట్టపరంగా వచ్చిన తెలంగాణ తప్ప, పదేండ్లు దాటినా తెలంగాణకు స్వయం పాలన అనుభూతి రాలేదనే చెప్పాలి. స్వయం పాలన పేర పదేండ్లు సాగిన పాలన సైతం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది తప్ప  కాపాడింది ఏమీ లేని అనుభవం ఒకవైపు ఉండగా.. తెలంగాణ రాజకీయాల్లోకి మరో పరాయి కూటమి రాబోతున్నదనే రాతలు చూస్తే.. తెలంగాణ ఇంత చులకనగా మారిపోయిందా అనిపించింది. అదేం పైత్యమో తెలియదు. 

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేండ్లు దాటినా.. పైత్యం రాతలు మారడంలేదు.రెండు రాష్ట్రాల్లో ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. కానీ మళ్లీ  తమ పైత్యాన్ని.. రాతల రూపంలో  తెలంగాణ పై రుద్దే ప్రయత్నం చేస్తుండడం వారి గుణం మారలేదని చెపుతున్నది. 

స్వీయ పాలకుడు (కేసీఆర్​) పదేండ్లు ఆగం పట్టించిన తెలంగాణకు.. ఇపుడు పరాయి కూటమి అవసరమని ఆ రాతకర్తకు ఎవరు చెప్పారో? తెలంగాణలో ఆంధ్రా పార్టీలతో కలిసి కూటమి కట్టబోతున్నామని ప్రధాని నరేంద్రమోదీ ఏమైనా ఆ రాతకర్తకు చెవిలో చెప్పాడా? కూటమి పేర  ఆంధ్రా పార్టీలతో గొల్లెం పెట్టించి, తెలంగాణను తమ ఆధిపత్యంలోకి తెచ్చుకునే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునేందుకు.. పొలిటికల్​ ఫీడ్​ బ్యాక్​ కోసం రాసిన రాతలు కావా అవి?

తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఏమైనా కొదవ ఉందా? ముచ్చటగా మూడు పార్టీలు కొనసాగుతున్నాయి. స్వయం పాలన పేర పరాయి పాలన నడిపిన బీఆర్​ఎస్​ను ఇప్పటికే ప్రజలు గ్యారేజీకి పంపించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. బీజేపీ బలపడుతోంది. ఇన్ని  పొలిటికల్​ ఆప్షన్స్​  కళ్ల ముందుండగా  మాకు ఓ పరాయి కూటమి కావాలని తెలంగాణ ప్రజలేమైనా రాతకర్తకు మొర పెట్టుకున్నారా?

స్వయంపాలనలో సాగిన  పరాయి దోపిడీ

పదేండ్లు తెలంగాణ స్వయం పాలన చూడలేదు, పాలకుడి స్వీయ పాలనను మాత్రమే చూసింది. ప్రజలకు ఉచిత పథకాల ఎరవేసి, తెలంగాణ సంపదను అవినీతి మేసింది ఒక ఎత్తు అయితే.. పక్క రాష్ట్ర నీటి దోపిడీకి గేట్ల తాళాలు తీసి అప్పగించింది. పోతిరెడ్డిపాడు తూములు పెరుగుతుంటే, కళ్లప్పగించి చూసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణమవుతుంటే.. రోజా ఇంట్లో రొయ్యల పులుసు విందులు జరిగాయి. కనీసం రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణంపై సీరియస్​గా అభ్యంతరం చెప్పిన దాఖలా లేదు. జంతర్​మంతర్​ వద్ద ధర్నా చేసింది అంతకన్నా కనిపించలే. 

అప్పటి పక్కరాష్ట్ర పాలకుడి (జగన్​)తో ఉన్న ఫ్రెండ్​షిప్​కు నజరానాగా కృష్ణా నీటిని గిఫ్ట్​గా అప్పగించారని వినికిడి.  పదేండ్లు సెక్రటేరియెట్​లో  70శాతం ఆంధ్రా ఉద్యోగులతో రాజ్యమేలిన స్వీయ పాలకుడు తెలంగాణను ఎలా మోసం చేశాడో తెలుసు. హైదరాబాద్​లో ఉన్న సెట్లర్ల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల ఏనాడూ చూపలేకపోయారు. పదేండ్లలో హైటెక్​ సిటీ చుట్టూ ఆంధ్ర రాజ్యాన్ని ఏర్పరిచిన స్వీయ పాలకుడు.. ఆయా రంగాలలో ఎంత మంది తెలంగాణ ప్రజలను పైకి తెచ్చారో చెప్పలేడు. 

ALSO READ | ప్రజాప్రభుత్వానికి గవర్నర్ కితాబు

సామాన్యుడికి అపాయింట్​మెంట్​ ఇవ్వని స్వీయ పాలకుడు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు,  వ్యాపారులకు, సినీ హీరోలకు మాత్రం ఎప్పుడంటే అప్పుడే అపాయింట్​మెంట్లు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ముసుగులో సాగిన ఆంధ్రా పాలన అది.  ఇదీ పదేండ్ల స్వయం పాలకుడి వ్యవహారం.  ఇంటోడి వ్యవహారం ఇలా ఉంటే.. ఇపుడు పరాయి పార్టీల కూటమి వస్తుందని, దాన్ని తెలంగాణ ఆమోదిస్తుందనే ఆలోచన ఆ రాతకర్తకు  ఎలా వచ్చిందో బ్రహ్మదేవుడికి సైతం  తెలియకపోవచ్చు. 

ఇంటి పాలనలోనూ ఎదిగింది పరాయిలే

తెలంగాణ చాలా ఆశలతో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నది. కానీ పదేండ్లలో  ఏదీ కంటికి కనిపించిన దాఖలాలేదు. తెలంగాణ ఏర్పడితే అన్ని రంగాలలో తెలంగాణ వాళ్లు ఎదిగి వస్తారనే ఆశ ఉండేది. తీరా చూస్తే..  వ్యాపారాలలో, విద్యారంగంలో, అన్ని రంగాల్లో అంతా పరాయివాళ్లు తప్ప తెలంగాణోళ్లు ఎవరూ ఎదిగొచ్చిన దాఖలాలేదు. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలలో  తెలంగాణ ఈరోజుకూ విద్యలో  అట్టడుగున 32వ స్థానంలో ఉన్నదంటే.. విద్యను సైతం పరాయీల వ్యాపారంగా మార్చిన ఘనత కేసీఆర్​ది  కాదని ఎవరైనా అనగలరా? పెద్ద కాంట్రాక్టర్లుగా  ఏ తెలంగాణోడు ఎదిగిరాలె. 

ఆంధ్రా పెద్ద కాంట్రాక్టర్లనే స్వీయపాలకుడైన కేసీఆర్​ పెంచిపోషించాడు. మరి తెలంగాణలో  వచ్చిన మార్పు ఏమిటయ్యా అంటే.. స్వయంపాలన  కాస్తా  కేసీఆర్​ స్వీయ పాలనగా  మారింది అంతే! అలాంటి చేదు అనుభవాలను చూసిన ఈ తెలంగాణ సమాజం.. పరాయి కూటమి  పేర వస్తారంటున్న  చంద్రబాబు, పవన్​ కల్యాణ్​కు  ఏమని ఓటేస్తారనుకుంటున్నాడో ఆ రాతకర్తకే తెలియాలె. 

ఇద్దరు చంద్రలపై ఉన్న ప్రేమను ప్రజలపై రుద్దడమే!

కూటమి వస్తుందనే రాతలు ఎవరి కోసం రాశారు? రాతకర్త ఏమి ఆశిస్తూ రాశారో..  దాన్ని చదివిన ప్రతి తెలంగాణ పాఠకుడికి తప్పకుండా అర్థమయ్యే ఉంటది.  పదేండ్లు ఆర్థికంగా, అభివృద్ధిపరంగా దెబ్బతిన్న తెలంగాణను మరింత దెబ్బతీసే దోపిడీ ఆలోచన నుంచి పుట్టిందే తప్ప ఆ రాత తెలంగాణను ఉద్ధరించడానికి పుట్టిందని ఏ పాఠకుడూ అనుకోలేడు.  ఇంటోడు చేసిన అనర్థం చాలదని.. బయటోని దోపిడీకి తెలంగాణ తలుపులు తెరుస్తుందనేది ఎవరైనా నమ్మే ముచ్చటేనా? చంద్రబాబుపై, కేసీఆర్​పై రాతకర్తకు ఉన్న  ప్రేమను .. తెలంగాణ ప్రజలపై      బలవంతంగా రుద్దడం భావ్యమేనా?

అయితే  చంద్రబాబు, లేదంటే కేసీఆరే కావాలె!

చంద్రబాబు పొలిటికల్​ ఎంట్రీని తెలంగాణ ఎట్టిపరిస్థితులలోనూ ఆమోదించదనే విషయం రాత కర్తకు తెలియదనుకోలేం. అయినా అక్కరలేని చుట్టాన్ని తెలంగాణపై బలవంతంగా రుద్దితే.. అది పరోక్షంగా  కేసీఆర్​కు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశం కూడా  రాతకర్తలో స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంమీద తెలంగాణ మరింతగా నష్టపోవాలంటే.. అయితే చంద్రబాబుకు, లేదంటే కేసీర్​కు లాభం కలిగించాలనేదే రాతకర్త ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆలులేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం .. అన్నట్లు తెలంగాణలో కూటమి వస్తుందని రాస్తే ప్రజలు దాన్ని పైత్యం అనుకునే అవకాశం ఉంది తప్ప, నిజమనుకునే అవకాశం ఏమాత్రం లేదు.

బీజేపీ వైఖరి చెప్పాలె

రాతకర్త చెపుతున్న కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి, ఇలాంటి పుక్కిడి రాతల వల్ల తెలంగాణలో బీజేపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం మాత్రం ఉంది. ఇపుడిపుడే బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్నదనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలా బలపడుతున్న తరుణంలో కూటమి వస్తుందంటూ అపోహలు సృష్టించడమంటే అది బీజేపీ అవకాశాలను దెబ్బతీయడమే. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ ఆ‘ కూటమి రాతల’పై స్పందించాల్సిన  అక్కర లేకపోవచ్చు. కానీ అది ప్రజల్లోకి బీజేపీ పట్ల తప్పుడు సందేశం పంపిస్తుందనే విషయంలో సందేహంలేదు.  

కూటమిపై  బీజేపీ స్పందించకపోతే.. ప్రజలు సైతం దాన్ని అర్ధాంగీకారంగా భావించే అవకాశమూ ఉంది.  నిజంగానే ఆ రాతకర్త రాసినట్లు తెలంగాణలో ఆంధ్రాపార్టీలతో కలిసి  బీజేపీ కూటమి కడితే.. తెలంగాణలో బీజేపీ తిరోగమనం పట్టక తప్పదని రాజకీయ పండితుల భాష్యాన్ని  ఎవరు కాదంటారు?

కాంగ్రెస్​ నిజాయితీకీ పరీక్షే!

తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​ను కాదని, కాంగ్రెస్​ పార్టీకి అధికారం అప్పగించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడని వైఖరితో.. చంద్రబాబుకు దగ్గర అనే నానుడిని సీఎం తిప్పికొట్టగలగాలె. బనకచర్లలాంటి నీటి దోపిడీ ప్రాజెక్టులపై గట్టిగా పోరాడాలె.  కేసీఆర్​ను ప్రజలు ఎందుకు వద్దనుకున్నారో.. కాంగ్రెస్​ ప్రభుత్వం అనునిత్యం నెమరువేసుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలె. లేదంటే.. ‘కూటమి వస్తుంది’లాంటి వ్యాసాలతో  తెలంగాణను బోల్తా కొట్టించే ప్రయత్నాలు నిరంతరం సాగుతుంటాయని, అవి తెలంగాణను తప్పుదోవ పట్టిస్తుంటాయని ముఖ్యంగా తెలంగాణలో బాధ్యత గల పార్టీలుగా  బీజేపీ,  కాంగ్రెస్​ గమనించాల్సిన అవసరం లేదంటారా?

ఇంటోడి మోసం, బయటోడి మోసం

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 10 టీఎంసీల నీటిని దోచుకుపోవడానికి  బనకచర్ల రిజర్వాయర్​ నిర్మిస్తున్నాడు. పదేండ్ల తెలంగాణ పాలకుడు కేసీఆర్ ఆంధ్రాకు​ కృష్ణా నీటిని దోచిపెట్టింది చాలదన్నట్లు.. ఇపుడు మరిన్ని నీళ్లను దోచుకుపోవడానికి తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు ఓటేయాలంటారా? ఇంటోడే మోసం చేశాడంటే.. ఇపుడు బయటోడితోనూ తెలంగాణ ప్రజలను మోసం చేయిద్దామనేనా ఆ పైత్యం రాతలు? 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​-