భ్రష్టాచార్, పరివార్​వాద్​లపై​ యుద్ధం ఇంకెప్పుడు?

అది 1980. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో  కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ప్రత్యామ్నాయం లేదు. కానీ బీజేపీ ఎదిగేందుకు మంచి అవకాశాలే ఉండినాయి. అంతలోనే 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, బీజేపీ ఎదుగుదలకు అదొక శరాఘాతంగా మారింది. కాంగ్రెసేతర పార్టీగా టీడీపీని వాజ్​పేయి బాగా ప్రేమించేవారు. కేంద్రంలో ఎప్పటికైనా ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆయన నమ్మకం. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను వాజ్​పేయి ఎన్నడూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్​ను, చంద్రబాబును పొగడడమే సరిపోయేది. వాజ్​పేయి, అద్వానీలకు అప్పటికే 75 ఏళ్ల వయసు దాటింది. ఆ వయసులో పార్టీ ఎదుగుదల వారికి ముఖ్యం కాలేకపోయింది,  దేశానికి ప్రధానమంత్రులెలా అవుతామనే ఆత్రుతే వారిలో ఎక్కువైంది. వారు టీడీపీనే బీజేపీ అనుకునేవారు. అంతే, బీజేపీ టీడీపీతో 30 ఏండ్ల సహవాసం, ఆ పార్టీతో దఫదఫాలుగా పొత్తులు బీజేపీ ఎదుగుదల అవకాశాలను పూర్తిగా కాలరాచేసింది. 1997లో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని బీజేపీ అందుకుంది. కానీ కేంద్రంలో చంద్రబాబు మద్దతు కోసం తెలంగాణను అటకెక్కించారు. చంద్రబాబును నమ్ముకున్నారు తప్ప తెలంగాణను నమ్ముకోలేదు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అది మరొక శరాఘాతంగా మారింది. ఇదే సంధికాలంలో కేసీఆర్ టీఆర్ఎస్​ను స్థాపించి ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు. 2015 వరకూ టీడీపీ సోపతిలోనే బీజేపీ కొనసాగింది. సుష్మాస్వరాజ్ పుణ్యమా అని తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీగా మాత్రం బీజేపీ పేరు నిలబెట్టుకోగలిగింది.  వాజ్​పేయి, అద్వానీ వారి జీవిత చరమాంకంలో కేంద్రంలో అధికారంలోకి రాగలిగారు. పార్టీ కన్నా ఎన్టీఆర్, చంద్రబాబులకే వారు ప్రాధాన్యమిచ్చారు. అందుకు కారణం వారి వృద్ధాప్యమే.

కోటలు దాటని ఎజెండా 

రెండు సార్లు నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పడింది. ఎవరిమీద ఆధార పడి కాదు,  తిరుగులేని నాయకుడుగా మోడీ కీర్తి గడించారు. పార్టీ విస్తరణపై దృష్టిపెట్టే అవకాశం మోడీకి లభించింది. అందులో చాలా చోట్ల సఫలమయ్యారు కూడా. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు. బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో పార్టీని ప్రత్యామ్నాయంగా మార్చగలిగారు.  2019 నుంచి తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నం మొదలు పెట్టారని అనిపించింది. కానీ, మూడేండ్లు గడిచేసరికి నిజంగానే మొదలు పెట్టారా అనే అనుమానాలే ఎక్కువగా వినిపించడం మొదలైంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాలుగేండ్లలో తెలంగాణలో బీజేపీ రాజకీయ ఎజెండాను వారే చెపుతూ వచ్చారు. భ్రష్టాచార్, పరివార్​వాద్ కో ఖతం కర్నాహై. ఇదే తెలంగాణలో బీజేపీ రాజకీయ ఎజెండాగా మారింది. ప్రజల్లోనూ బీజేపీ పట్ల అదే అభిప్రాయం స్థిరపడిపోయింది. నాలుగేండ్లు గడిచాయి. కానీ ఆ ఎజెండా వినిపించడమే తప్ప ఆచరణ లేదు.  కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, బీజేపీ తన ఎజెండాను అమలు చేసి తెలంగాణలో బలపడుతుందని రాజకీయ వర్గాలు, ప్రజలు నమ్ముతూవచ్చారు. మాటలు చెప్పడం మాకే తెలుసు, మాటలు మార్చడం మాకే తెలుసు అన్నట్లుగా వారి వ్యవహారం మారుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది.  

పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా ‘భ్రష్టాచారోంకో సజా మిల్నా చాహియే, నహీ మిల్నా చాహియే అని ప్రజలనే అడిగారు. కొద్ది రోజుల తర్వాత చేవెళ్ల సభలో హోంమంత్రి ‘హమ్ హుకూమత్ మే ఆనేకే బాద్ కేసీఆర్ కే భ్రష్టాచార్ కో బాహర్ నికాలేంగే’ అని అన్నారు. మోడీ దొక మాట, షా ది మరొక మాట!  ఒక రాష్ట్రంలో కొత్తగా  బలపడే పార్టీ విధానం అలాగే ఉంటదా? అంటే, కేసీఆర్ పట్ల వీరిది ప్రజలను భ్రమింపచేసే పోరాటమని ఎవరైనా ఎందుకు అనుకోలేరు? దాంతో  బీజేపీలో చేరిన నేతలకు ఆందోళన పెరగడం మొదలైంది. అన్ని పార్టీలను మేనేజ్​ చేయగల కేసీఆర్​ రాజకీయం బతికున్నంత కాలం తెలంగాణలో ఇతర పార్టీలకు బతుకుదెరువు కష్టమే అనేది అన్ని పార్టీల నేతలకు తెలుసు. అందుకే చాలా మంది కేసీఆర్ అవినీతి పని పట్టాలన్నా, ఆయన్ను ఓడించాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే సాధ్యం అనే నమ్మకమే అనేకులు బీజేపీలో చేరడానికి కారణమైంది. వచ్చిన వాళ్లంతా ఇవాళ పక్కచూపులు చూస్తున్నారంటే.. ఆ తప్పు ఎవరి దగ్గర ఉందో మోడీ, అమిత్​షానే ఆలోచించుకోవాల్సిన విషయం. తెలంగాణ బీజేపీలో స్తబ్దతకు  కర్ణాటక ఓటమో మరొకటో కారణం కాదు. కారణమల్లా భ్రష్టాచార్​, పరివార్​ వాద్​ ఏమాయే అనే!  వలసలకూ బ్రేక్​ పడిందీ అక్కడే! వచ్చిన వలసల పక్క చూపులకూ కారణం అదే! తెలంగాణ బీజేపీకి ఏర్పడ్డ అనారోగ్యం అది. దానికి కర్ణాటక ఓటమి పేర మందు పెడితే బాగవుతుందా? భ్రష్టాచారీల మీద దర్యాప్తులే తెలంగాణ బీజేపీ కి పట్టిన రోగానికి అసలు మందు! 

బీజేపీ పొలిటికల్​ స్పేస్​లో బీఆర్​ఎస్​ కూర్చుంది

తెలంగాణలో బీఆర్​ఎస్​ బతికున్నంత కాలం బీజేపీ బలపడడం కష్టం. బీఆర్​ఎస్​ పట్ల కసి రాజకీయంతో మాత్రమే బీజేపీ ఎదిగే అవకాశాలున్నాయి. తెలంగాణలో బీజేపీ పొలిటికల్​ స్పేస్ ను బీఆర్​ఎస్​ ఆక్రమించిఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే.. బీజేపీ చేస్తున్న తప్పేమిటో కూడా అర్థమవుతుంది. టీడీపీ ఉన్నంత కాలం ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఎదగలేదు. ఇపుడు  తెలంగాణలో బీఆర్​ఎస్ బలంగా​ ఉన్నంత కాలం బీజేపీ ఎదగడం, బలపడడం కష్టం. బీఆర్​ఎస్​పట్ల స్పష్టమైన రాజకీయ వైఖరి ఉంటేనే తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలున్నాయి.  బీఆర్​ఎస్​ పట్ల బీజేపీకి  స్పష్టమైన వైఖరి లేదనే  అనుమానాలే తెలంగాణలో ఆ పార్టీ కొంప ముంచుతున్నది. ఇపుడు దేశంలో బీజేపీ విస్తరించే అవకాశాలున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే. అలాంటి రాష్ట్రంలో ఇంత సందిగ్ధత, ఇన్ని అనుమానాలు తెలంగాణలో దాని భవిష్యత్తు కు మంచి పరిణామం మాత్రం కాదు. రాజకీయ స్పష్టతకు స్టేషన్​ దాటిపోతున్నది. ఏం చేయాలనేది మోడీ, అమిత్​ షా చేతల్లోనే ఉన్నది.  వయస్సు మీరిన వాజ్ పేయి, అద్వానీలు  సంకీర్ణ ప్రభుత్వం వల్ల అప్పటి టీడీపీకే ప్రాధాన్యమిచ్చి , రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ప్రాధాన్యమివ్వలేదు. ఇపుడు రెండు సార్లు సొంత మెజారిటీతో దేశాన్నేలుతున్న మోడీ, అమిత్​ షా లకు అలాంటి బలహీనతలు ఏమీలేవు. అయినా కేసీఆర్​ వంటి ఒక ప్రాంతీయ నేతకే రాష్ట్రాన్ని వదిలేస్తున్నారా అనే అనుమానాలు ఎందుకు విస్తరిస్తున్నాయి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలిగేది ఆ పార్టీ అధినేతలే తప్ప, ప్రజలు కాదు.
గెలిచినా, ఓడినా తెలంగాణకు ఆయనొక సమస్యే 
తొమ్మిదేండ్ల పాలనతో కేసీఆర్​ అన్ని వ్యవస్థలను చెరపట్టేశారు. ఆర్థికపరిపుష్టితో దేశ రాజకీయాలనే షేర్​ మార్కెట్​లా మారుస్తున్నారు. ఆయనను ఇపుడు ఎదుర్కోలేకపోతే, భవిష్యత్తులో ఎదుర్కోవడం సాధ్యం కాని పనే ! అపుడు మోడీ, అమిత్​ షాలకు కూడా సాధ్యంకాకపోవచ్చు.  రేపు కేసీఆర్  ఓడిపోయి,  ప్రతిపక్షంలో కూర్చున్నా తెలంగాణ రాజకీయాలకు ప్రమాదమే.  ఆయన ఆ స్థాయికి వెళ్లిపోయారు. విచ్చలవిడి పాలనతో ఆయన అలా తయారు కావడానికి ఎవరు కారకులో ఢిల్లీ  పెద్దలే ఆత్మపరిశీలన చేసుకోవాలి.  అలాంటి నాయకుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఇపుడైనా, ఎపుడైనా బీజేపీ బలపడడమనేది సాధ్యమేనా? అందుకే, కేసీఆర్​ పట్ల బీజేపీకి నిక్కచ్చి రాజకీయం అవసరం.  భ్రష్టాచార్, పరివార్​వాద్​ అనే నినాదాలు అచరణలోకి తేవడం అంతకన్నా అవసరం.  అసెంబ్లీ ఎన్నికలకు 5 నెలల కాలం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో బీజేపీ ఏం చేయాలన్నా, పార్టీ నేతలు వెళ్లిపోవడాన్ని ఆపాలన్నా, ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా, రాజకీయ నిర్ణయాలు యుద్ధ ప్రాతిపదికన జరగాలి. లేదంటే, తీరుమారని బీజేపీగానే మిగిలిపోతుంది.

అవినీతి, కుటుంబ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

తెలంగాణ ప్రజలతో పాటు, బీఆర్​ఎస్​ సానుభూతి పరులు సైతం అవినీతిని, కుటుంబపాలననూ సహించడం లేదని చెప్పేందుకు ఇక్కడో ఉదాహరణ చెప్పుకుందాం.  లిక్కర్​ స్కామ్​లో ఈడీ విచారణ కోసం కవిత ఢిల్లీ వెళ్లిన ప్రతి సారీ తెలంగాణ ప్రజలు టీవీలకు హత్తుకుపోయి చూశారు. అరెస్టు జరుగుతుందా లేదా అని! ప్రజల్లో అంతటి ఆసక్తి ఎందుకు వచ్చినట్లు? కేసీఆర్ ప్రభుత్వంలో  ఉన్నత స్థాయిలో అవినీతి బాగా జరుగుతున్నదని ప్రజలే కాకుండా, బీఆర్​ఎస్​ కార్యకర్తలు సైతం నమ్ముతున్నారు కాబట్టి! ఇక సాధారణ ప్రజల్లో నైతే చెప్పనక్కర లేదు. బీఆర్ఎస్​ కార్యకర్తలు  కేసీఆర్​ను అభిమానిస్తారు, అనుమానం లేదు.  కానీ కేసీఆర్​ పూర్తి​​ కుటుంబ పాలనను, ఉన్నత స్థాయి అవినీతిని అంగీకరించలేక పోతున్నారు.

ఇది నిజం. మోడీ, షా చెపుతూ వచ్చిన భ్రష్టాచార్​, పరివార్​వాద్​ తెలంగాణలో బీజేపీ నినాదంగా మారిందనడానికి అదొక ఉదాహరణ. కేసీఆర్​తో బీజేపీకి అంతర్గత అవగాహన ఉన్నట్లైతే.. తెలంగాణలో బీజేపీ మరో 30 ఏండ్లు వెనక్కి వెళ్లినట్లే. 1985 నుంచి 2018 వరకు ఎన్టీఆర్​, చంద్రబాబులను నమ్ముకొని రాష్ట్రంలో 33 ఏండ్ల రాజకీయ జీవితాన్ని కోల్పోయిన బీజేపీ,  ఇపుడు కేసీఆర్​ నక్కజిత్తుల రాజకీయ వలలో చిక్కినట్లైతే, ఎన్ని దశాబ్దాల కాలాన్ని కోల్పోతుందో చెప్పడం కష్టమే.  నాడు చంద్రబాబును నమ్మిన బీజేపీ, నేడు కేసీఆర్​ను నమ్ముకొంటే ఏం కానుందో  తెలంగాణలో తెలియని నాయకుడు బహుశా ఎవరూ ఉండరు!  బీజేపీలోకి వచ్చిన నేతలు ప్రస్తుతం పక్కచూపులు చూడడానికి అదే అసలు కారణం! కేసీఆర్​ పట్ల బీజేపీకి స్పష్టమైన రాజకీయ వైఖరి లేనంత కాలం ఆ పార్టీ తెలంగాణలో ఎదగడం కష్టమే అనేది నిష్టుర సత్యం. 

- కల్లూరి శ్రీనివాస్ రెడ్డి,పొలిటికల్​ ఎనలిస్ట్​