సైన్యాధ్యక్షుడు రాని యుద్ధం నెగ్గేదెలా? ఫామ్​హౌస్కే కేసీఆర్.. కార‌ణం ఇదే కావొచ్చు..!

‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు‘ అంటారు.  ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజామద్దతు కాంగ్రెస్ నిలబెట్టుకోకున్నా, ఓటమి నుంచి పాఠం నేర్చి బీఆర్ఎస్ పుంజుకోకున్నా, తద్వారా ఏర్పడే శూన్యంలోకి  బీజేపీ  విస్తరించకపోయినా... అది మూడు పార్టీలకీ రాజకీయ ఆత్మహత్యాసదృశ్యమే!  కాస్త హెచ్చుతగ్గులతోనే అయినా... ముగ్గురి ముంగిటా ఇపుడు అవకాశాలున్నాయి.  స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోవడంలోనే  నైపుణ్యం, విజయరహస్యం దాగి ఉంది. బీఆర్ఎస్పదేండ్లు అధికారం అనుభవించి, ప్రజాతిరస్కారంతో  విపక్షస్థానంలోకి  వెళ్లిన  పార్టీ  ఏడాదైనా ఓ దారినపడటం లేదు.  అధినేత,మాజీ  సీఎం కేసీఆర్  తెరవెనుకకు  పరిమితమైన పరిస్థితుల్లో.. పార్టీ వ్యవహారం మూడు ముక్కలాటలా సాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్​రావు, ఎమ్మెల్సీ కవిత తలోదారి అన్నట్టు సాగడం పార్టీకి  దశ-దిశ లేని స్థితిని కల్పిస్తోంది.

విపక్షనేత  కేసీఆర్​ ప్రధానంగా ఫామ్​హౌస్కే  పరిమితమౌతున్నారు.  పరోక్ష సందేశాలు,  సంకేతాలే తప్ప నేరుగా  ప్రజలతో సమావేశాలో, ప్రత్యక్ష ప్రకటనలో  చేయట్లేదు.  కుటుంబ సభ్యులే  అయినప్పటికీ, పార్టీ ముఖ్యనాయకులు కేటీఆర్, హరీష్​రావుల  మధ్య  అప్రకటిత  ఆధిపత్య  పోరొకటి  సాగుతోంది.  ఎవరికివారు తమదైన  పంథాలో  నడుస్తున్నారు.  పార్టీలో తామే  కీలకమయేటట్టు  కార్యక్రమాలు రచించి, అమలు చేస్తున్నారు.  ఢిల్లీ  లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ లభించి,  ఇల్లు చేరాక కొన్నాళ్లు  మౌనాన్నే ఆశ్రయించిన కేసీఆర్  తనయ  కవిత  ఇటీవల  క్రియాశీలమయ్యారు.

తాజాగా  మళ్లీ  రాజకీయ కార్యకలాపాలు, ప్రకటనలు చేస్తున్నారు.  కేసీఆర్​కు  ఈ పరిణామం  నచ్చుతున్నట్టు లేదని  ఆంతరంగిక సమాచారం.  అయినా, ఆమె  ముందుకుసాగే  యోచనతోనే ఉన్నట్టు తెలుస్తోంది.  ఏడాది పూర్తవుతుంటే,  కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై  ఏ పంథా అనుసరిస్తారు?  అనే సందిగ్ధత  నెలకొన్నవేళ  కేసీఆర్  స్పష్టమైన సంకేతమిచ్చారు. ‘కాంగ్రెస్  తప్పుడు పాలనకు ఏడాది ముగిసింది, ఇక ఉపేక్షించేది లేదు.  ప్రభుత్వ  వైఫల్యాలను అన్ని వేదికలపై  ఎండగట్టాలి.  ప్రజల ఇబ్బందుల్ని  ఎక్కడికక్కడ  ఎత్తిచూపాలి’  అని  పార్టీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీల  సమావేశంలో స్పష్టం చేశారు.  కేసీఆర్ నాయకత్వం లేకుండా విపక్షపోరు రక్తికట్టడం కష్టమే! 

ప్రజాస్వామ్యానికే అందం
కేసీఆర్  క్రియాశీలకంగా లేకపోవడానికి హేతుబద్ధ కారణమేదీ కనిపించదు.  ఆయనే ఒకటి,  రెండుమార్లు వ్యక్తం  చేసినట్టు, ‘ఈ రేవంత్​తో   నేను పోటీ పడాలా?’  అన్న ఆయన కోణంలో కారణం కావచ్చు. కానీ, అది సరైన భావన కాదని ఏపీ సీఎం చంద్రబాబు ఇదివరకే  నిరూపించారు. ‘నేను జగన్​తో  పోటీ పడాలా?  ఆయన తండ్రితోనే  పోటీ రాజకీయాలు నడిపినవాడ్ని!’  అని బాబు మునగదీసుకోవడాన్ని ప్రజలు అంగీకరించలేదు. వారసుడిగా  తనయుడు లోకేశ్​ను  ప్రకటించి,  పాదయాత్ర చేయించినా... బాబు ప్రత్యక్ష నేతృత్వం చేపడితే తప్ప జనం వారి వెంట నడవలేదు.  అది అక్షరాలా ఇక్కడ వర్తిస్తుంది. ఇద్దరు మాజీ సీఎంలు జగన్మోహన్ రెడ్డి,  కేసీఆర్ మధ్య చాలా  సామ్యాలున్నా చిత్రమైన ఓ వైరుధ్యముంది.

మీడియా సమావేశాలకు  సీఎంగా అంత ఇష్టపడని జగన్​ ఇప్పుడు ఎక్కువ మార్లు విలేకరుల సమావేశాలు పెడుతుంటే,  సీఎంగా పలుమార్లు ఉత్సాహంగా మీడియా భేటీలు  జరిపిన కేసీఆర్  ఇప్పుడు మీడియాకు దూరంగా ఉంటున్నారు.  పంజాబ్​లో మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్​సింగ్​ ఫామ్​హౌస్​ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. అది గ్రహించి, ఆయనే ప్రజల్లోకి నడిస్తే ఆదరించారు.  మూడో వంతు స్థానాలిచ్చి, బీఆర్ఎస్​ను  ప్రధాన ప్రతిపక్షంగా నిలిపినా ఆ బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదనే  భావన ప్రజల్లో బలపడుతోంది. ఇటీవల ‘పీపుల్స్ పల్స్’ అప్పటికప్పుడు (ఇన్​స్టాంట్​) జరిపిన ఓ సర్వే ఫలితాలు ఇదే చెబుతున్నాయి.  ఉత్తర,  దక్షిణ తెలంగాణాల్లోని  ఒక్కో అసెంబ్లీ  నియోజకవర్గ గణాంకాల్ని విశ్లేషిస్తే..  బీఆర్ఎస్​కు  జనాదరణ  పెరగలేదని తేలింది. 

ఆత్మపరిశీలన లేకుంటే ఎలా?
ఆత్మపరిశీలన  లేకుంటే  రాజకీయాల్లో అడుగు ముందుకుపడదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు  46.9% ఓటు వాటా లభిస్తే కాంగ్రెస్​కు  28.4% దక్కింది. 2019 లోక్​సభ  ఎన్నికల నాటికి,  అంటే 6 నెలల్లో బీఆర్ఎస్  పొందిన ఓటు వాటా 41.7%కి,  కాంగ్రెస్ ఓటు వాటా 24.68%కి  పడిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వాటా 37.35%కి పడిపోయి అధికారమే కోల్పోవాల్సి వచ్చింది.  కాంగ్రెస్ 39.40% ఓటు వాటాకు  ఎదిగి అధికారం దక్కించుకుంది.  మళ్లీ అయిదారు మాసాల వ్యత్యాసంతో జరిగిన లోక్​సభ  ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ ఓటు శాతాన్ని  పెద్దగా  పెంచుకోకపోయినా, 40.10%తో  నిలకడ చేసుకుంది. కానీ,  బీఆర్ఎస్  ఓటు వాటా మాత్రం 16.68%కి  పడిపోయింది. అంటే, కిందటి అసెంబ్లీ ఎన్నికల సొంత గణాంకాలతో పోలిస్తే ఇది 21% తగ్గుదల కాగా, తాను ‘పీక్’ చేరిన 2018 ఎన్నికల్లో లభించిన ఓటు వాటా (46.%)తో పోలిస్తే 30 శాతానికి పైగా తరుగుదల!  2019, 24 లోక్​సభ  ఎన్నికల్లోనూ ఆమేర  బీజేపీ పుంజుకుంది.

ఇదంతా ప్రజాక్షేత్రంలో  బీఆర్ఎస్  ఆదరణ  కోల్పోతోందనడానికి ఆనవాలు.  పార్టీ అగ్రనేతల సొంత నియోజకవర్గాల్లోనూ ఇదే సరళి కనిపించింది. 2018-, 23 అసెంబ్లీ  ఎన్నికల  గణాంకాల్ని పోల్చినపుడు,  సిరిసిల్లలో  కేటీఆర్ 23% (70% నుంచి 47%కి) ఓటు వాటా కోల్పోతే,  సిద్దిపేటలో హరీష్​రావు  20% (78.58) ఓటువాటా  కోల్పోయారు.  ఎందుకు అదనంగా  ‘కామా రెడ్డి’లో  పోటీకి వెళ్లి చేతులు కాల్చుకున్నారో... తనకే  తెలియని కేసీఆర్, సీఎం హోదాలో గజ్వేల్​లో  12% (60%-48%)  ఓటు వాటాను కోల్పోయారు.  అంతకు ముందు తన ప్రత్యర్థిగా పోటీ చేసిన  ప్రతాపరెడ్డి,   శిబిరం మారి  ఆయన  పార్టీలో చేరినా పరిస్థితి ఇది!  ఈ  ముగ్గురి స్థానాలను కలుపుకొని ఉన్న పట్టభద్రుల,  టీచర్ల  నియోజకవర్గాలకు (ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు) రేపు ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి.  ఒకరకంగా  ఇది 

బీఆర్ఎస్కు పరీక్షా కాలమే! బీఆర్ఎస్​ స్థిరపడకపోతే..
విద్యాసంస్థలకు పేర్లు పెట్టడం నుంచి ‘తెలంగాణ తల్లి విగ్రహ’ అంశం వరకు సీఎం రేవంత్​రెడ్డి  వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక జాతీయ పార్టీ తరపున రాష్ట్ర సీఎం అయ్యుండి, నెమ్మదిగా  తెలంగాణ అస్తిత్వవాదాన్ని  సీఎం తనచుట్టూ  తిప్పుకుంటున్న తరుణంలో  చేతులు కాల్చుకునే ప్రయోగాలు వికటిస్తాయి.  విపక్షంగా బీఆర్ఎస్ ప్రజల్ని ఆకట్టుకొని, తిరుగులేని ప్రత్యామ్నాయంగా స్థిరపడకపోతే, ఆ శూన్యంలోకి బీజేపీ విస్తరించే ఆస్కారం తెలంగాణలో పుష్కలంగా ఉంది.  దేశంలో  ఎక్కడైనా  ముఖాముఖి  పోటీల్లో  బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో  కాంగ్రెస్​ను అధిగమిస్తోందన్న గ్రహింపుంటేనే,   ఒక ప్రాంతీయశక్తిగా  బీఆర్ఎస్ తనస్థానాన్ని పటిష్టపరచుకోగలదు. ‘జనరల్’ రాకుండా వెళ్లే సేన.. యుద్దం గెలిచేనా? అన్నదే ప్రశ్న!

మూడు ముక్కలాట!
పార్టీ ముఖ్యనేతలు హరీష్​రావు, కేటీఆర్​ల మధ్య అంతర్లీనంగా సాగే ‘ఆధిపత్య పోరు’ ఓ దాగని సత్యం!   ఒకరిని ‘యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచ్’ వెన్నంటి ఉంటే, మరొకరికి ‘బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్’ దన్నుగా ఉంటుంది.  కవితకు ఎవరి మద్దతుందో అంత స్పష్టత లేదు.  పార్టీ అట్టడుగు కార్యకర్తల్లో అనుకున్నంత ఆదరణ కేటీఆర్​కు  లేనట్టే,   కేటీఆర్​కు మీడియాలో ఉన్నంత  వెయిటేజ్ హరీష్​రావుకు  లేదన్నది సత్యం.   జిల్లా స్థాయి అంతర్గత పోరు పార్టీకి ఎంత నష్టమో  ఖమ్మం  ఒక ఉదాహరణ.   

ఏ ఎన్నికలోనూ ఒకటికి మించి అసెంబ్లీ సీటు పార్టీకి దక్కని జిల్లా. ఇక రాష్ట్ర స్థాయి స్పర్ధ వల్ల,  ఎవరి వెనుక ఉండాలో?   ఉంటే ఏం ఇబ్బందో,  లేకుంటే ఏం సమస్యో?  మాజీ మంత్రులు,  ఎంపీలు,  ఎమ్మెల్సీ-,  ఎమ్మెల్యేల స్థాయి నాయకుల నుంచి చిన్న కార్యకర్త వరకు మీమాంసే!  ఇది కేసీఆర్ పరిష్కారం చూపాల్సిన అంశమే!   ఇప్పుడు  కేసీఆర్ ఎదుర్కొంటున్నది తనయుడు, -మేనల్లుడి మధ్య స్పర్ధ!  జనాదరణ,  పార్టీలో పట్టు,  రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన హరీష్​రావుకు  తగిన  ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి. 2018 గెలుపు తర్వాత, అలా తప్పుడు సంకేతం ఇచ్చినందుకే పార్టీ ఎంతో నష్టపోవాల్సి వచ్చి, పరిస్థితి తర్వాత సరిదిద్దుకున్నారు.

దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ