సొంతంగా 370 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తామనటం ఒక భ్రమ! కానీ, అధికారం చేజారకుండా ప్రభుత్వంలో కొనసాగేలా చూసుకోవడానికి ఏం ప్రచారం చేసుకోవాలో బీజేపీకి బాగా తెలుసు. అందులో భాగమే ఈ మైండ్ గేమ్! ‘ఇండియా కూటమి’కి ప్రధానంగా కొరవడింది ఈ ప్రచార కళే! ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయడానికి ఏయే అంశాలను ఎజెండా చేయాలో తెలియక కూటమి వెనకబడిపోతోంది.
ఏయే అంశాల్ని తెరపైకి రానీయకుండా చూడాలో కూడా బీజేపీకి తెలుసు! ప్రతికూల వాతావరణంలోనూ బీజేపీ ఆశావహంగా కనిపించడానికి ఇదే కారణం! ఒక సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం ఆధారంగా క్షేత్ర పరిస్థితిని పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల ప్రచార వ్యూహపరమైన విజయ, వైఫల్యాలు బోధపడతాయి.
ఎన్డీయే కూటమికి 400 సీట్లు, సొంతంగా 370 స్థానాలు గెలవాలన్న బీజేపీ ఆకాంక్ష ఓ సుదూర స్వప్నమే! అదొక నిజమవని కల, వారికది తెలుసు. అయినా దాన్నే బలంగా ప్రచారంలో పెట్టడమన్నది ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బతీసి ఆధిక్యత సాధించడానికే! ముగిసిన మొదటి రెండు విడతల పోలింగ్ సరళిని గమనించినా...ఇదే విషయం తేటతెల్లమౌతోంది.
ఉత్తరాది, పశ్చిమాన ఈసారి సీట్లు తగ్గుతాయనే ఒక అంచనా పార్టీ నాయకత్వానికి ముందునుంచే ఉంది. అందుకే దక్షిణాదిన, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో సంఖ్య పెంచుకోవాలన్నది వ్యూహం. దానికనుగుణంగానే ప్రచారాంశాలకు పదును పెట్టారు. రెండేండ్లు ముందు నుంచి వివిధ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకుంది బీజేపీ. గుజరాత్‌లో ఘన విజయం లభించినా.. దానికి ముందు, వెనుక హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఓటమి, ఆ కారణాలను విశ్లేషించుకున్నారు. ప్రతికూల వాతావరణం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ చత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారం కైవసం చేసుకోవడం తమ వ్యూహ విజయంగానే పార్టీ నాయకత్వం భావించింది.
వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తలు
పెచ్చుమీరిన నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి కీలకాంశాలు దేశపౌరుల మనోఫలకం మీద బలమైన ముద్రవేసి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత బలపడకుండా ఏయే అంశాలను ముందుకు నెట్టాలో బీజేపీ నాయకత్వానికి తెలుసు! అందుకే, నాయకత్వ పటిమ, జాతీయత, హిందూత్వ, విశ్వవేదికపై భారత్ స్థానం పటిష్టమవటం.. వంటి అంశాలే తెరపైకి వచ్చేలా జాగ్రత్తపడ్డారు. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటి కీలకాంశాలను అడుక్కునెట్టి ఇతరేతర అంశాలే.. మేధావుల చర్చలు, పౌర సంభాషణలు, ప్రస్తావనలు, ఆలోచనల్లో నలిగేటట్టు తమకు దన్నుగా ఉన్న బలమైన మీడియాను బీజేపీ వ్యూహకర్తలు వాడుకున్నారు. పలు విడతల ఎన్నికల్లో ఇంకా వాడుతూనే ఉన్నారు.
బాధల్ని అదిమి పట్టి..
‘దేశంలో నిశ్శబ్ద భావజాలం అంతర్లీనంగా ప్రసరిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అనూహ్య ఆశ్చర్యకర ఫలితాలుంటాయి’ అని కాంగ్రెస్ అనుకూల మేధావి శ్యామ్ పిట్రోడా జోస్యం చెప్పారు. దాన్ని బట్టి, వాతావరణం తమకు అనూకూలంగా మారుతున్నట్టుందని ‘ఇండియా కూటమి’ కొంత ఆశావహంగా ఉన్నది. కానీ, ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆప్ డెవలపింగ్ సొసైటీస్’ (సీఎస్‌డీఎస్) జరిపిన ప్రీ-పోల్ సర్వేలో వెల్లడైన సంకేతాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీజేపీ ఆశించినట్టు పెద్ద సంఖ్యలో స్థానాలు రాకపోవచ్చు. కానీ, అంతిమంగా ఎన్డీయేనే తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నాయని వెల్లడించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యల్ని అంగీకరిస్తూనే.. ప్రభుత్వ సామర్థ్యానికే ఓటేస్తామని అత్యధికులు స్పందించారు.
ఉపాధి, ధరల సమస్యలు ఉన్నా..
ప్రధాని మోదీ నాయకత్వం బీజేపీకి ఓ పెద్ద సానుకూలాంశం, అదే బీజేపీని ఇతర ప్రత్యర్థి పార్టీల కన్నా ముందుంచుతోంది. గతంతో పోలిస్తే.. ఉద్యోగం తెచ్చుకోవడం, ఉపాధి పొందటం ఇప్పుడు కష్టంగా మారిందని సీఎస్‌డీఎస్ సర్వేలో 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి నగరాలు, పట్టణాలు, పల్లెలు.. అంతటా ఉంది. ఈ అయిదేండ్ల కాలంలో నిత్యావసరాల ధరలు అసాధారణంగా పెరిగాయని 55 శాతం మంది పేర్కొన్నారు. 19 శాతం మంది మాత్రమే ఈ అయిదేండ్లలోనే ధరలు తగ్గాయన్నారు. ఈ ధరల పెరుగుదల అంశం పేదలు, సంపన్నులు అందరినీ ఎంతోకొంత ప్రభావితం చేస్తోంది. అయినా ఓటు నిర్ణయాన్ని ఇది పెద్దగా ప్రభావితం చేయడంలేదు. అక్కడే, ఇండియా కూటమి ప్రచార వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఉత్తర, పశ్చిమంలో కాస్తంత తగ్గుదల
ఉత్తరాదిన కోల్పోయే వైభవాన్ని దక్షిణాదితో పూడ్చుకోవాలనుకుంటున్న బీజేపీకి ఎంతో కొంత వెలుగు ఒక్క తెలంగాణే! ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులతో కొంత లబ్ధి పొందాలని చూస్తోంది. కర్నాటకలో ఈసారి కొన్ని స్థానాలు (2019లో 25/28) తగ్గొచ్చు. తమిళనాడు, కేరళలో ‘ఇప్పుడు లేవు, రేపు రావు’ అన్నది సంకేతం! ప్రాంతాలవారీగా చూసినపుడు ఉత్తర, పశ్చిమ భారత్‌లో బీజేపీ, ఎన్డీయేకు ఆదరణ స్వల్పంగా తగ్గుతున్నట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. అక్కడ బీజేపీ ఓటు వాటా 47 (2019 లో 48) శాతంగా వెల్లడైంది. దక్షిణాదిలో కాస్త మెరుగవుతూ 25 (2019లో 18) శాతంగా ఓటు వాటా తెచ్చుకోనుంది. బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలతో కూడిన తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన ఓటువాటాను 42 (2019 లో 34) శాతానికి పెంచుకోనున్నట్టు సర్వేలో వెల్లడయింది. ఓటర్లను ప్రభావితం చేసే ప్రచారాంశాలు, వాటిని బలంగా జనంలోకి తీసుకువెళ్లడాన్ని బట్టే ఓటు శాతాల మొగ్గున్నట్టు సర్వేలో వెల్లడైంది.
వన్నె తగ్గినా.. ఇంకా మోదీ మంత్రమే!
ఎన్నికలకు కొన్ని వారాల ముందు కూడా ఇంకా ‘మోదీ’ మంత్రమే బీజేపీ, ఎన్డీయే కూటమికి ప్రధానాస్త్రంగా ఉంది. ఆయనని, కష్టపడే నిష్కలంకుడిగా భావించడమే కాక దేశంలోపల, బయట భారత్ ప్రతిష్టను ఇనుమడింప జేసినవాడిగానే జనం చూస్తున్నారు. ప్రతిష్టలో ఆయనతో సరితూగేవారే విపక్షంలో లేరు. ప్రతిపక్షంలోని వారు అవినీతిపరులని మోదీ చేసే ప్రచారం కొంతవరకు జనంలోకి వెళ్తోంది. ఎన్నికల బాండ్ల ద్వారా మోదీ అవినీతికి పాల్పడ్డారని విపక్ష ‘ఇండియా కూటమి’ ప్రతివిమర్శ చేసినా.. పెద్దగా దాని ప్రభావం లేదు.
ప్రధానిగా ఎవరిని కోరుకుంటారంటే 48 శాతం మంది మోదీ అంటే, 27 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీని కోరుకున్నారు. మళ్లీ మోదీ ప్రభుత్వం రావాలా? అన్న నిర్దిష్ట ప్రశ్నకు, ఈసారి ‘అవును, రావాలన్న వారు’ 44 (2019లో 47) శాతానికి తగ్గి, రావొద్దు అన్నవారు 39 (2019 లో 35) శాతానికి పెరిగారు. మోదీ ప్రభ తగ్గిందనడానికి ఇదొక సంకేతం! ప్రభుత్వ విజయాల వల్ల మళ్లీ వారికే ఓటేస్తామన్న వాళ్లలో 50 శాతం మంది ‘370 అధికరణం’ రద్దును కారణంగా చెప్పారు. 8 శాతం మంది మాత్రమే సదరు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సు గురించి 37 శాతం మందికే తెలుసు, అందులో అత్యధికులు ఆ సదస్సు భారత్ ఖ్యాతిని పెంచినట్టు భావించారు. జాతీయత, హిందూత్వ, రామమందిర నిర్మాణం, ఏకరీతి పౌరస్మృతి వంటి అంశాలే.. ధరల పెంపు, నిరుద్యోగం వంటి కీలక అంశాల్ని వెనక్కి నెట్టి, ముందుకు వచ్చినట్టు సర్వేలో వెల్లడైంది.
ఇండియా కూటమి ప్రచార వైఫల్యం
బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే కీలకాంశాలను ఇండియా కూటమి ప్రచారంలో పెట్టలేకపోయింది. క్షేత్ర పరిస్థితులను సానుకూల ప్రచారాంశాలుగా మలచటంలో బీజేపీ దూసుకుపోతుంటే, ఇండియా కూటమి బాగా వెనుకబడ్డట్టు సర్వేలో కొన్ని సాపేక్షాంశాలను బట్టి తెలుస్తోంది. ఉదాహరణకి మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన వారి శాతాల కన్నా, వైఫల్యాలను ఎత్తిచూపిన వారి శాతాలే ఎక్కువ! ఏ విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందనుకుంటున్నారు? అన్నపుడు, 24 శాతం మంది ‘ఉద్యోగ కల్పన’ అంటే, 24 శాతం మంది ‘ధరల నియంత్రణ’ అన్నారు.
ఇక, ఎందుకీ ప్రభుత్వం బాగుందనుకుంటున్నారు అన్నపుడు, 23 శాతం మంది రామ మందిరం నిర్మించడం అంటే, 9 శాతం మంది నిరుద్యోగ సమస్య పరిష్కరించినందుకు అని, 8 శాతం మంది పేదరికం నిర్మూలించినందుకని, మరో 8 శాతం మంది దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచినందుకన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విషయంలో 48 (24+24) శాతం మంది మనోభావాలకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు రచించడంలో, విస్తరించడంలో విపక్షాలు విఫలమయ్యాయి. ఒకమాటలో చెప్పాల్సివస్తే, ఇండియా కూటమి వెనుకబాటుతనమే ఎన్డీయేను ముందుకు నెడుతోంది.
- దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ