కాం గ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి అంతా ఊహించినదే జరిగింది. ఫలితాలను చూస్తుంటే ఓటరు కార్డు ఉన్న ప్రతినిధులందరూ జాగ్రత్తగా ‘ఎన్నిక’లో పాల్గొన్నారని తెలుస్తున్నది. ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానంకు రెండు షాక్‌లు తగిలాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి ఒక షాక్తగిలితే, శశి థరూర్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి నిరాకరించడం ఊహించని మరో షాక్. ఈ నేపథ్యంలో ఫలితంలో ఏమైనా మార్పు ఉంటుందేమోనని కొందరు ఆశించినా.. గాంధీల ఆశీర్వాదం ఉన్న వ్యక్తే గెలిచాడు. సాధారణంగా ఉత్తర కొరియా, క్యూబా, చైనా లాంటి దేశాల్లో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ పెద్దలు అధికారికంగా నిలబెట్టిన అభ్యర్థులకు 99 శాతం ఓట్లు వస్తాయి. 2001లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా జితేంద్ర ప్రసాద్‌పై సోనియా గాంధీ విజయం సాధించినప్పుడు ఆమెకు 99 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఓడిపోయిన అభ్యర్థి థరూర్‌కు1072 ఓట్లు రాగా, అధికారిక అభ్యర్థి మల్లికార్జున ఖర్గేకు7,897 ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లుగా పాల్గొనే ప్రతినిధులను ఎన్నుకోలేదని, ఎంపిక చేశారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భంలో ఎంపికైన వ్యక్తులు ఎటువైపు నిలబడతారనేది ఊహించవచ్చు.
ఓట్లు వేసింది ఎంపికైనోళ్లే..
కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గాంధీల హయాంలో క్షీణదశకు వచ్చిన పార్టీ, ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నది. దీని నుంచి బయటపడటానికి, తిప్పికొట్టడానికి ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంలో చరిష్మా ఉన్న ఒక ఉత్తేజకరమైన అభ్యర్థిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తే, భారతదేశంలోని యువకులు, విద్యావంతులు ఆయనకు మద్దతు ఇచ్చేవారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను పునరుద్ధరించగలడన్న అంచనాలూ ఉన్నాయి. కానీ మల్లికార్జున ఖర్గే ఎన్నికతో పార్టీలో ఎలాంటి మార్పు రాబోతుందనే ఉత్కంఠగానీ, అంచనాలు గానీ ఇప్పుడు పెద్దగా లేవు. ఏఐసీసీ నేతలు నియమించిన ప్రదేశ్కాంగ్రెస్అధ్యక్షులే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు 9000 డెలిగేట్ఓట్లను డిసైడ్చేశారు. వీరిలో ప్రతి ఓటరు ఎంపిక చేసిన వారే తప్ప ఎన్నికైన వారు కారు. మొత్తం 9000 ఓట్లలో దాదాపు 3000 ఓట్లు ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవే. ఈ 5 రాష్ట్రాల్లో ఆంధ్ర, బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేరు. ఉత్తరప్రదేశ్‌లో 403 మందిలో కాంగ్రెస్‌కు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాల్లో డీఎంకే వంటి కూటమి భాగస్వాముల కారణంగా కాంగ్రెస్‌కు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ మనుగడలో లేని ఈ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఈ 3000 మంది ప్రతినిధుల ఓట్లలో 95 శాతం ఖర్గేకు వెళ్లి ఉంటాయి.
పార్టీకి పూర్వ వైభవం వస్తుందా?
కర్నాటక నుంచి అనేక ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు గాంధీ కుటుంబానికి ఖర్గే విధేయుడిగా ఉన్నారు. దాన్ని కాదనలేం. అయితే ఖర్గే తన వ్యక్తిగత కెరీర్‌లో ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది కాదిక్కడ, తీవ్ర సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను తిరిగి నిలబెట్టగలరా? బీజేపీతో ఉన్న కొత్త ఓటర్లను ఆయన ఎంత వరకు ఆకర్షించగలరు అనేది ప్రశ్న. -కాంగ్రెస్ పునరుద్ధరణలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఖర్గే దక్షిణాదికి చెందిన ఓ దళిత నేత. ఆయన కనీసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లనైనా పార్టీ వైపు తిప్పుకోగలరా? కాంగ్రెస్ ఇప్పుడు దళిత ఓటర్లను ఆకర్షిస్తున్నదని చెబుతున్నారు. కానీ రాహుల్ గాంధీ పంజాబ్ ముఖ్యమంత్రిని మార్చి దళితుడైన చరణ్‌జిత్ చన్నీని ముఖ్యమంత్రిని చేశారు. పంజాబ్‌లో 32 శాతం దళిత జనాభా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 8 శాతం దళితులు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఇప్పుడు దేశం మారింది.
గాంధీలు నిజమైన మార్పుకోరుకున్నరా?
గాంధీజీలు కాంగ్రెస్ ను వదులుకునేందుకు ఇష్టపడకపోవడం సహజం. థరూర్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడైతే కాంగ్రెస్ పార్టీ మీద అధికారం కోల్పోతామని వారికి తెలుసు. ఎన్నికల్లో గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీని నియంత్రించాలని గాంధీలు భావిస్తున్నారు. మొదట అశోక్ గెహ్లాట్‌ను సీఎం పదవి నుంచి తొలగించి బరిలో దింపాలనుకున్నారు. కానీ అది విఫలమైంది. దీంతో వారు తమకు విధేయుడైన ఖర్గేను గుర్తించారు. గాంధీలు నిజంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనుకుంటే, ఖర్గే కంటే మంచి అర్హతలు కలిగిన నాయకులు ఉన్నారు. వారిని కాదని ఉద్దేశపూర్వకంగా ఖర్గేను ఎన్నుకున్నారు. అతని వల్ల వారికి ఎలాంటి ముప్పు ఉండదు. కాంగ్రెస్‌కు ఇప్పుడు గాంధీలు నాయకత్వం వహించడం లేదని చెబుతున్నప్పటికీ, ఖర్గే వారి ‘ఎస్మ్యాన్’ అనే విషయం దేశానికి తెలుసు. అందుకే పార్టీ పునరుజ్జీవంలో ఖర్గే ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. ఖర్గే వల్ల ఇప్పుడు మునుగోడులో ఎంత మంది ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటేస్తారు? ఖర్గే కాంగ్రెస్ కు అధికారిక అధ్యక్షుడై ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధే నిజమైన అధ్యక్షుడని స్పష్టంగా తెలుస్తున్నది. విపత్కర పరిస్థితుల్లో, దేశాలు, రాజకీయ పార్టీలు కొత్త నాయకుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ గాంధీలు పాత, పురాతనమైన, ఎలాంటి ప్రభావం చూపని వ్యక్తిని ఎంచుకున్నారు. దీనర్థం వారు నిజమైన మార్పును కోరుకోలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తన పాత జనరల్స్‌ను ఉక్రెయిన్‌లో దించాడు. కానీ ఏం జరిగింది? వాళ్లు విజయం సాధించలేకపోయారు. గాంధీలు కూడా ఖర్గేకు బదులుగా, గొప్ప చరిష్మా ఉన్న శశి థరూర్‌ని ఎంపిక చేసి ఉండాల్సింది.
శశి థరూర్ గెలిచి ఉంటే..
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన శశిథరూర్ విజయం సాధించి ఉంటే ఎలా ఉండేదనే దానిపైనా చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నది. గాంధీలు ఇప్పుడు ఓటర్లను ఆకర్షించే స్థితిలో లేరు. ఈ సందర్భంలో ఓటర్లను తన వైపు తిప్పుకునే నాయకుడు పార్టీకి కావాలి. అధ్యక్షుడిగా శశి థరూర్ అయితే సరైన ఎంపికగా ఉండేది. ఎందుకంటే విద్యావంతులు సహా సాధారణ, మధ్యతరగతి ప్రజలు కూడా కుటుంబ పాలనను ఇష్టపడటం లేదు. శశి థరూర్ దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ఉన్న నేత. ఆయనకు పగ్గాలు ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు కొత్త ఊపు తెచ్చేవాడేమో. ఈ ఎన్నికలో ఆయన ఓడినప్పటికీ గాంధీ కుటుంబం బరిలో దింపిన అధికారిక అభ్యర్థిపై పోటీ చేసేంత ధైర్యం తనకు ఉందని శశి థరూర్ నిరూపించారు.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్