బిహార్​ రాజకీయ భవిష్యత్తు మారేనా? : పెంటపాటి పుల్లారావు

బిహార్​ రాజకీయ భవిష్యత్తు మారేనా? : పెంటపాటి పుల్లారావు

ఆకాశంలో సూర్యుని ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు. పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలు అవుతుంది. కానీ, బిహార్‌‌‌‌‌‌‌‌లో 1990 నుంచి ఆ రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పు లేకపోవడంతో రాజకీయ వాతావరణం స్తంభించిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్​ 1990లో  బిహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత అతని భార్య రబ్రీ దేవి 2005 వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 

2005 నుంచి నితీశ్​ కుమార్ మాత్రమే బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.  మధ్యలో  మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ ఒక సంవత్సరం పాటు సీఎం పదవిలో ఉన్నారు. అంటే.. 1990 నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ లేదా నితీశ్​ కుమార్ మాత్రమే బిహార్​ ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు మోదీ సర్కారుతోపాటు ప్రతిపక్షాల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి.

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు లాలూ ప్రసాద్​యాదవ్​తోపాటు ఆయన కుటుంబం,  ఎవర్ గ్రీన్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్  భవితవ్యాన్ని కూడా నిర్ణయించనున్నాయి. 2024 ఎన్నికల్లో  బిహార్ కీలక రాష్ట్రంగా మారనుంది. 2019లో బిహార్‌‌‌‌‌‌‌‌లో 40 మంది ఎంపీలకు గాను 39 మందిని బీజేపీ కూటమి గెలుచుకుంది. అయితే అప్పటి నుంచి బిహార్‌‌‌‌‌‌‌‌లో బీజేపీకి సమస్యలు తలెత్తాయి. ఈ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి తక్కువ ఎంపీలు లభిస్తాయని విస్తృతంగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. 

1990 నుంచి లాలూ ప్రసాద్​ యాదవ్​  లేదా నితీశ్ కుమార్​ వారిపై ఆధారపడిన రాజకీయ కుటుంబాలే రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి.  దాదాపు 50 కుటుంబాల సభ్యులు వారి అనుచరవర్గాలే 1990 నుంచి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 90వ దశకం రాజకీయ వాతావరణానికి కాలం చెల్లింది. 

1989 నుంచి సీఎం పదవిని అధిష్టించినవారిని పరిశీలిస్తే చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ అనంతరం, రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్ర బాబు నాయుడు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే బీహార్‌‌‌‌‌‌‌‌లో 1990 నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ లేదా ఆయన భార్య రబ్రీదేవి అనంతరం సుదీర్ఘకాలంగా నితీశ్​ కుమార్ మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

నితీశ్, లాలూ మధ్య చాలా వ్యత్యాసం

నితీశ్​ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య చాలా తేడా ఉంది. లాలూకు చాలామంది పిల్లలు ఉన్నారు  లాలూ వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చాడు.  నితీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు.  నితీశ్​ కుమారుడు రాజకీయాల్లో ఎన్నడూ క్రీయాశీలకంగా కనిపించడు. నితీశ్​కుమార్ ఒక బలమైన లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రిగా పేరు పొందాడు. మిస్టర్​ క్లీన్ ఖ్యాతిని కలిగి ఉన్నాడు. 

ఈ లక్షణాలతో పాటు  నితీశ్​ గొప్ప  రాజకీయ చతురత ఉన్న నాయకుడు కూడా,  బీజేపీని, లాలూ ప్రసాద్​ యాదవ్​ సారథ్యంలోని ఆర్జేడీని  ఎప్పుడు కావాలంటే అప్పుడు మభ్యపెట్టగల సత్తా నితీశ్​ కుమార్​కి ఉంది.  లాలూ వారసుడు తేజేస్వీ యాదవ్.  తేజస్వీ  రెండుసార్లు బిహార్​ ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. అయితే, లాలూ తన వారసుడు తేజస్వీ యాదవ్​ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. తేజస్వీ లాలూ రాజకీయాలకు తగిన వ్యక్తి.  రాజకీయాల్లో రాణించేందుకు అవసరమైన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడు. అన్నింటికంటే ముఖ్యమైనది తేజస్వీ యాదవ్​ విద్యార్హత హైస్కూల్ ఉత్తీర్ణత మాత్రమే, ఇది అతనికి రాజకీయాల్లో రాణించడానికి ఉపకరిస్తోంది. అధిక విద్య రాజకీయ పురోగతిని అడ్డుకుంటుంది. 

బిహార్‌‌‌‌‌‌‌‌ భవిష్యత్తు

బిహార్​ రాజకీయ భవిష్యత్తును మనం పూర్తిగా ఊహించలేం. కానీ, ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై చాలావరకు ఆధారపడి ఉంటుంది. 2019లో బిహార్‌‌‌‌‌‌‌‌లో 40 మంది ఎంపీ నియోజకవర్గాలకు గాను 39 మంది ఎంపీ స్థానాలను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ మళ్లీ మంచి ఫలితాలు సాధిస్తే,  నితీశ్​ కుమార్ మరింత బలమైన ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా బిహార్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ కూటమి విజయం సాధిస్తే మళ్లీ ప్రధాని పదవిని దక్కించుకోవడానికి నరేంద్ర మోదీకి మార్గం సుగమం అవుతుంది. సహజంగానే బిహార్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ కూటమి ఘోరంగా పరాజయం పాలైతే మోదీ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ పవర్​ వీగిపోయినట్లే. 

లాలూ ఇండియా కూటమి లోక్​సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి బీజేపీ కూటమికి చెందిన ఎంపీలను తగ్గిస్తే, 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు లాలూ బలమైన కీలక నేతగా మారతారు.  2024 లోక్​సభ ఎన్నికల్లో లాలూ సారథ్యంలోని ఆర్జేడీ ఆశించిన మేరకు ఫలితాలు సాధించకుంటే లాలూ  కుటుంబ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. 

లాలూ రాణించకపోయినా లేదా బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆయన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం, లాలూ కుటుంబం మొత్తం  రైల్వే జాబ్స్​ ఫర్​ ల్యాండ్​ స్కాండల్​ను ఎదుర్కొంటోంది. 2004-–2009 మధ్య లాలూ ప్రసాద్​ యాదవ్​ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, 1500 రైల్వే ఉద్యోగాలను ఇళ్లు లేదా భూమి తీసుకుని విక్రయించారని ఆరోపణలు రాగా,  ఆ కుంభకోణం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. సహజంగానే, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారీగా అరెస్టులు జరుగుతాయి. లాలూ కుటుంబం కోసం ఈడీ, సీబీఐ వేచి ఉన్నాయి. 

లాలూ తన పిల్లలపై ప్రత్యర్థులు 

తలపడకుండా చేయవలసిన రాజకీయాలన్నీ చేశాడు. ప్రముఖ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్,  దూకుడు రాజకీయ నాయకుడు పప్పు యాదవ్‌‌‌‌‌‌‌‌లకు 2024లో  బిహార్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు రాకుండా చేశారు. లాలూ తన కుటుంబం కోసం అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. 1990 నుంచి  బిహార్​లో స్తంభించిపోయిన రాజకీయ వాతావరణం మారుతుందో లేదో వేచిచూద్దాం.

1990 నుంచి బిహార్ రాజకీయాలు

లాలూ ప్రసాద్ యాదవ్ 1990లో జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత లాలూ జనతా పార్టీని వదిలేసి సొంతంగా రాష్ట్రీయ జనతాదళ్​ (ఆర్జేడీ)ని ప్రారంభించారు. నితీశ్​ కుమార్ 2005 నుంచి లాలూ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ను ముఖ్యమంత్రి కుర్చీకి దూరంగా ఉంచారు. మరోవైపు లాలూ తన నలుగురు పిల్లలను మంత్రులుగా, ఎంపీలుగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. లాలూ ప్రసాద్​ యాదవ్​ వారసుడు 34 ఏళ్ల తేజస్వి యాదవ్ రెండుసార్లు బిహార్​ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1990 నుంచి లాలూ ప్రసాద్​ యాదవ్​ దూకుడుగా వ్యవహరిస్తూ అగ్రెసెవ్​ నాయకుడిగా మారారు. బిహార్​లో చట్టం కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. లాలూ సర్కారు ఆటవికరాజ్యంగా పేరు తెచ్చుకుంది. 

కాగా, 1989 నుంచే  బిహార్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయింది. కాంగ్రెస్ రాజకీయంగా క్షీణించిన ప్రాంతాల్లో బీజేపీ అడుగుపెట్టింది. ఈక్రమంలో అనేక చిన్న కుల పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే కమలం పార్టీ బలపడిన మాట వాస్తవమే అయినా.. బిహార్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఎప్పుడూ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. 2005 నుంచి నితీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ కారణంగానే బీజేపీ బిహార్​లో అధికారాన్ని పంచుకోగలిగింది.

ఇండియా కూటమిని నితీశ్ ఎందుకు వీడారంటే..

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా కూటమిని ఎందుకు విడిచిపెట్టి, తిరిగి బీజేపీలో చేరారనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది. నితీశ్​కుమార్ జూన్, 2023లో బీజేపీయేతర ప్రతిపక్షాల ఇండియా కూటమిని స్థాపించారు. ఆయన ఇండియా కూటమికి నాయకుడిగా ప్రధాని పదవి దక్కుతుందని భావించారు. అయితే నితీశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. లాలూ ప్రసాద్​ యాదవ్​ కూడా నితీశ్​ కుమార్ ఇండియా కూటమికి చీఫ్​ కావాలని  కోరుకున్నారు, తద్వారా నితీశ్​ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన కుమారుడు తేజస్వీ యాదవ్​కి సీఎం పదవిని ఇస్తారని అంచనా వేశారు. 2023  డిసెంబర్​లో నితీశ్​ కుమార్​ ఇండియా కూటమికి షాక్ ఇచ్చి లాలూ అలయన్స్​ను విడిచిపెట్టి తిరిగి బీజేపీలో చేరారు. ఇండియా అలయన్స్‌‌‌‌‌‌‌‌తో కొనసాగితే సమయం వృథా చేయడమే అని నితీశ్​ భావించారు.

- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్