‘మరక మంచిదే!’ అని ఓ వ్యాపార ప్రకటనలో చెప్పినట్టు మరక బట్టలకు అంటితే... డిటర్జెంట్ పౌడరో, సబ్బో ఉంటుంది కనుక మంచిదేమో, కానీ రాజకీయాల్లో కాదు. ఏ మరకయినా.. రాజకీయాల్లో అంటితే, అంత తేలిగ్గా పోదు. పైగా, ఎన్నికల్లో నిలువునా ముంచే ప్రమాదముంది. ప్రజలకు కొత్త విశ్వాసం కల్పించి అధికారంలోకి వచ్చిన వారి నుంచి ‘మెరుపులు’ తగ్గి ‘మరకలు’ పెరిగితే.. ఏముంది, అదే ప్రజావిశ్వాసం తగ్గి ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. ‘అవినీతి మరక’ ‘అక్రమార్జన మరక’ ‘అధికార దుర్వినియోగం మరక’ ‘ఆశ్రిత వర్గానికి మేళ్ల
(క్రోనీ క్యాపిటలిజం) మరక’ ఇలా రకరకాల మరకలు అంటి ఒకటొకటిగా మన ప్రభుత్వాలన్నీ మసకబారుతున్నాయి. ప్రజలు ఆలోచిస్తున్నారు.
‘అవినీతి లేని పాలన’ లక్ష్యంగా తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. ‘ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య’ అని ఆ పార్టీ ఎంత మొత్తుకున్నా, ఏది నిజమో నిర్దారణ అయ్యేవరకు వారు ఆ నిందను మోయాల్సిందే! కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్నఢిల్లీ ‘లిక్కర్ స్కామ్’లో దర్యాప్తు ముందుకు సాగుతున్నకొద్దీ ఆప్ లోలోతుకు కూరుకుపోతోంది. ‘నెంబర్ టూ’గా ఉన్న మనీష్ సిసోడియాతో సహా ఇప్పటికి మంత్రులిద్దరు అరెస్టయి కటకటాలు లెక్కిస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్ వాటిని ఆమోదించారు. లిక్కర్ స్కామ్ లింకు ఇంకెక్కడి దాకా విస్తరిస్తుందో తెలియదు.
తెలంగాణలో అమలు కాని హామీలు,
తెలంగాణలో రెండోసారి గెలిచాక బీఆర్‌ఎస్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో కల్పించిన ఆశలకు, అమలుకు పొంతన లేదనే విమర్శ ఉంది. నీటిపారుదల రంగంలో అవినీతి, విద్యా రంగంలో నిర్లక్ష్యం, హామీల అమలులో వైఫల్యం తారాస్థాయికి చేరుతున్నాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి అంశాల్లో వచ్చిన ఆరోపణలు, నిర్దిష్ట విమర్శలు రాష్ట్ర ప్రభుత్వంపై చెరిగిపోని మరకలుగానే నిలిచాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వరంగంలో ప్రమాణాలు పడిపోతుంటే, నిత్యం విస్తరిస్తున్న ప్రయివేటులో ఫీజులు శక్తికి మించిన భారమౌతున్నాయి. ‘కాళేశ్వరాన్ని ఏటీఎమ్‌గా మార్చుకున్నారం’టూ విమర్శించే బీజేపీ, తామే నడిపే కేంద్ర ప్రభుత్వంతో మరెందుకు ఆ విషయంలో దర్యాప్తు ఎందుకు జరిపించదు? అన్న ప్రత్యర్థుల విమర్శకు బీజేపీ తగిన జవాబివ్వాలి. ‘కేంద్రం సరైన సమయం కోసం చూస్తోంది!’ అని ఆ పార్టీ వర్గాలు చెప్పేది నిజమైతే, ఇది బీఆర్‌ఎస్‌కి పెద్ద మరకే! రైతు బంధు, ఆసరా పెన్షన్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి, రైతు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, పోడు భూముల పట్టాలు, నిరుపేదలకు మూడెకరాల భూమి, ఫీ రీయింబర్స్‌మెంట్ వరకు.. పలు విషయాల్లో పడ్డ మరకలు తుడుచుకోవాల్సిందే!
ఏపీ ప్రభుత్వంపైనా..
జనాభీష్టం ప్రకారం కాక తమ ఇష్టానుసారం సర్కారు నడుపుతున్నారనే విమర్శ ఏపీ ప్రభుత్వంపై ఉంది. అభివృద్ది లోపించింది, సంక్షేమ, -అభివృద్ది నడుమ సమతుల్యత చెడిందనే మరక ఎన్నికలకు ఏడాది ముందరా వెన్నాడుతూనే ఉంది. ‘సంక్షేమ పథకాలు సరే, రాష్ట్రంలోని ఏ రోడ్డుపైనా దాదాపు నాలుగేళ్లలో పిడికెడు మట్టి వేసిన పాపాన పోలేద’ని సర్కారుపై ఉన్న విమర్శ గట్టి మరకే! ఇక, ఎటూ తెగని ‘రాజధాని’ అంశం ఓ పెద్ద మరక! మానిఫెస్టో హామీల మేర సంక్షేమ పథకాలు సజావుగా అమలవుతున్నా.. ఏదో తెలియని అసంతృప్తి జనాల్లో ఉంది. దాన్ని దిద్దే ఏ ప్రయత్నం జరుగుతున్నట్టు లేదు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, కేటాయింపుల విషయాల్లో, భూదురాక్రమణలతో పాలకపక్ష స్థానిక నాయకత్వం దౌర్జన్యాలు, దాష్టీకాలకు దిగుతోందనే మరక ప్రభుత్వ పెద్దలకూ చికాకు కలిగించేదే! అటుఇటు కాని ‘మద్యం విధానం’తో ప్రభుత్వ పెద్దలు ‘బలపడుతుం’టే, సాధారణ వినియోగదారుడి ‘ఒళ్లు- ఇల్లు గుల్ల’ అవుతోందనే విమర్శ ఉంది. నిరసనల్ని అడ్డుకోవడం, ప్రశ్నిస్తే నిర్బంధించడం వంటి అణచివేత చర్యలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ముఖ్యమంత్రి పినతండ్రి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు, కుటుంబ స్పర్థలు కూడా ఎన్నికల్లో ప్రత్యర్థుల ప్రచారాస్త్రాలు కావడం వైఎస్సార్సీపీ పాలనపై మరకే! సంబంధం లేదంటే ఎలా?
కేంద్రంలోనూ..
దేశంలోని ఎగువ మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారులు పోగు చేసుకున్న షేర్‌మార్కెట్ సంపద లక్షల కోట్ల మేర హరించుకుపోయినా ‘అదానీ స్టాక్ కుంభకోణం’పై సమగ్ర దర్యాప్తు జరిపించక, ఉపేక్షించడం కేంద్ర ప్రభుత్వంపై పెద్ద మరక! అప్పటివరకు అన్నిటా అదానీకి అనుచిత మేళ్లు, అయాచిత ప్రయోజనాలూ కల్పించి, ‘డమేల్’మనగానే...‘మాకేమి సంబంధం, అది ఒక కంపెనీ`షేర్ హోల్డర్ల ద్వైపాక్షిక అంశం’ అనటాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తూ.. ధరల (ద్రవ్యోల్భణం) నియంత్రణ లేకపోవడం, గ్యాస్ సిలెండరు పై మరో రూ.50 పెంచడం, నిరుద్యోగిత తొలగించే నిర్దిష్ట ప్రణాళిక కొరవడటం.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సర్కారు కడుక్కోవాల్సిన మరకలే! సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ వంటి సంస్థలు మున్నెన్నడు లేనంతగా దుర్వినియోగమయ్యాయనే అభిప్రాయం ఉంది. హామీ ఇచ్చినట్టు 2022 దాటినా రైతు ఆదాయం రెట్టింపు కాలేదు సరికదా, పెట్టుబడి వ్యయం రెట్టింపయింది. పెద్దనోట్ల రద్దులో తప్పుబట్టాల్సిందేమీ లేదని సుప్రీంకోర్టు చెప్పినా, ‘నల్లధనం కట్టడి వల్ల ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు అకౌంట్లో వచ్చి పడేది! ఎప్పుడా అని నిరీక్షిస్తున్నామం’టూ పలువురు హాస్యమాడుతున్నారు. ఆర్థిక అసమానతలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, స్వచ్ఛభారత్ వంటి నినాదాల విషయంలో కార్యాచరణ కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత లభించడం ఓ చెరగని మరకగా ఉంది.
చెప్పే వాళ్లే నీతి తప్పితే..
ఎంత లేదన్నా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. ఎక్కువ ధర ఖరారు-తక్కువ నమోదు, మనీ లాండరింగ్, లెక్కకులేని పెద్ద మొత్తం డబ్బు మార్పిడి వంటివి ధ్రువపడిన నేరాలు. ఎవరెవరి పాత్ర ఎంత అన్నది నిధానంగా తేలుతుంది. ఈ లిక్కర్ స్కామ్ వెలుగు చూడటానికి కొన్ని నెలల ముందు, పంజాబ్ ఎన్నికల్లో ‘ఆప్’ డబ్బు ఖర్చు విధానం ప్రస్తావనకు వచ్చినపుడు, తెలుగు రాజకీయ పెద్ద ఒకరు చేసిన వ్యాఖ్య స్కామ్‌కు రుజువిచ్చే సంకేతం! ‘అదంతా మన డబ్బేలే!’ అన్నారాయన.అన్నా హజారే, తదితరులతో కలిసి జరిపిన ‘జన్‌లోక్‌పాల్’ ఆందోళనల నుంచి ఎదిగిన క్రమంలో రాజకీయంగా ఆవిర్భవించిన ‘ఆప్’ గ్రాఫ్ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు, పాలన పంజాబ్‌కు విస్తరించింది. విద్య, వైద్యం, పరిమితులతో విద్యుత్తు వంటివి ఉచితంగా సమకూర్చి జనహృదయాలను గెలిచింది. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ, నీతికి నిలబడుతూనే.. సమర్థ పౌరసేవ సాధ్యమని నిరూపించింది.
కానీ, మద్యం స్కాం ఓ పెద్ద ‘మరక’గా మారడంతో ఆప్ ప్రతిష్ట ఘోరంగా దెబ్బతిన్నది.
లిక్కర్ మరకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూతురు, ఎమ్మెల్సీ కవిత ఇదే కేసులో ఇప్పటికే చార్జిషీటులో ఆమె పేరు ప్రస్తావన వచ్చింది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి తనయుడు రాఘవరెడ్డి, ఇంకా ఇతరులు ఇప్పటికే అరెస్టయ్యారు. సర్కారు పెద్దలకు సన్నిహితులైన ఇంకెందరికో ప్రత్యక్ష ప్రమేయముందని, వారి అరెస్టూ తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇదొక్కటే కాదు.. దేశంలోని వేర్వేరు ప్రభుత్వాలకు రకరకాల మరకలు అంటుతూనే ఉన్నాయి. అవి కడిగేసుకోవడంలోనే వారి కాలం కరిగిపోతోంది. ప్రజావిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది.
- ఆర్. దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ