ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్

  •     రాజకీయ, వామపక్ష, ప్రజా సంఘాల సన్నాహక సమావేశం

కోల్​బెల్ట్​,వెలుగు:  కాంగ్రెస్​ సర్కార్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని పెండింగ్​ ప్రాజెక్టులను  పూర్తి చేయాలని  రాజకీయ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్​ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిల పక్ష సంఘాలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...    రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు, తర్వాత  సీఎంగా   ఇంద్రవెల్లిలో జరిగిన సభల్లో కుంటాల జలపాతం ఎగువన కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు.

 తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి చెన్నూరు ప్రాణహిత వరకు సాగునీరు అందించాలని, శ్రీరాంసాగర్​ ఉత్తర కాలువ ,గోదావరి నార్త్​ కెనాల్​  ప్రాజెక్టు, కడెం రెండో దశలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్​ ప్రకటించిన మందాకిని కాలువను నిర్మించాలని డిమాండ్​ చేశారు.  అనంతరం ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, సమస్యలపై చర్చించారు.  అఖిల పక్ష సంఘాల సమావేశంలో లీడర్లు నైనాల గోవర్ధన్(తెలంగాణ జలసాధన సమితి), టి. శ్రీనివాస్ (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), కె.వి ప్రతాప్ (ప్రాణహిత పరిరక్షణ వేదిక) సంకే రవి (సీపీఎం), నంది రామయ్య (సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా), కలిందర్ ఖాన్  పాల్గొన్నారు.