
పాట్నా:కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఢిల్లీలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఏ పార్టీకి సరైన మెజారిటీ దక్కకపోవడంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే), ఇండియా కూట ములు తమ మిత్రపక్షాల పార్టీలతో టచ్ లోకి వచ్చాయి. బుధవారం రెండు కూటములు ఢిల్లీలో కీలక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లో ఆయా కూటమికి చెందిన నేతలు పాల్గొనాలి. అయితే, బిహార్లో మాత్రం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఎన్డీయే కూటమి భేటీలో పాల్గొనేందుకు బిహార్ సీఎం నితీశ్ కుమార్(జేడీయూ), ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే, నితీశ్ కుమార్ మాత్రం బుధవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలోనే పాల్గొన్నారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా క్లారిటీ ఇచ్చారు.