ఇది బీఆర్ఎస్ రాజకీయ కుట్ర : మినిస్టర్ దామోదర రాజనర్సింహా

  • చరిత్రలో లేని కుట్రకు ఆ పార్టీ తెరలేపింది: శ్రీధర్ బాబు, దామోదర 
  • దాడి చేసినవారిపై, చేసినోళ్లపై చర్యలు తీసుకుంటం
  • అమాయక రైతులపై కేసులంటూ దుష్ప్రచారం 
  • రైతులపై కేసులు పెట్టొద్దని సీఎం ఆదేశించారని వెల్లడి  
  • కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని పరామర్శించిన మంత్రులు 

ఎల్బీనగర్, వెలుగు: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులపై దాడి ఘటన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన రాజకీయ కుట్ర అని రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుట్రపూరిత విధానానికి ఆ పార్టీ తెర లేపిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలపాలన్నారు.

దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిని ఎల్బీ నగర్ లోని ఆర్కే ఎన్ క్లేవ్ లోని ఆయన నివాసంలో మంత్రులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు వచ్చిన అధికారులపై దాడులకు దిగడం దారుణమన్నారు.

లగచర్ల ఘటన వెనక రాజకీయ కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దాడికి కుట్ర చేసినవారిపై, దాడి చేసినవారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ భూ నిర్వాసితులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపి తమ హక్కులను సాధించుకున్నారని.. కానీ ఇప్పుడు అధికారులపై దాడులు చేసేలా బీఆర్ఎస్ చేసిన కుట్రకోణాలు ప్రజలకు అర్థం అవుతున్నాయన్నారు. 

బీఆర్ఎస్ నేతలది తప్పుడు ప్రచారం.. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను, సూచనలను గౌరవిస్తుందని మంత్రి దామోదర చెప్పారు. ప్రజలకు న్యాయమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడినవారందరిపై చర్యలు తీసుకుంటున్నామని, దీనితో సంబంధంలేని అమాయకులకు మాత్రం ఎలాంటి శిక్ష ఉండదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేములఘాట్ వద్ద ఎనిమిదేండ్లు టెంట్ వేసుకుని నిరసనలు తెలిపారని, ఎప్పుడూ అధికారులపై చిన్న దాడి కూడా జరగలేదన్నారు.

రైతులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, కానీ అమాయక రైతులపై కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మంత్రుల వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నేతలు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, వెదిరే యోగేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.