దేశవ్యాప్తంగా కుల గణన పై గత మూడు నెలలుగా రాజకీయ చర్చ మొదలైంది. ఇది వరకే రాష్ట్ర స్థాయిలో బిహార్‌లో కుల గణనను చేపట్టిన నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లను 67 శాతానికి పెంచడానికి నిర్ణయించుకుంది. కులగణన ద్వారా సేకరించిన విద్య సాంఘిక ఆర్థిక గణాంకాలు ప్రకారంగా 16% ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 20%, 1% ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు 2 శాతానికి, 30 శాతం ఉన్న ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లు 43% పెంచనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఒడిస్సా ప్రభుత్వం కులగణనను మొదలు పెట్టగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాట క ప్రభుత్వాలు త్వరలో కులగణనను చేస్తామని ప్రకటించాయి.
సమాన న్యాయం
కులగణన ప్రధాన లక్ష్యం కులాలవారీగా సామాజిక-, ఆర్థిక విద్యాపరమైన గణాంకాలను అందించడమే. వివిధ కులాలు ఎదుర్కొంటున్న విశేష సౌకర్యాలు లోటు పాట్లను అర్థం చేసుకోవడానికి కుల గణన సహాయం చేస్తుంది. అందరికీ మరింత సమానమైన సమాజం కోసం కులగణన దోహదపడుతుంది. అయితే కులగణనకు సంబంధించి భిన్నాభిప్రాయాలు, విమర్శలు వస్తున్నాయి. ఇది సమాజాన్ని కులం, జాతి ఆధారంగా మరింతగా విభజించవచ్చని కొందరు వాదిస్తారు. మరికొందరు కొన్ని కులాల సంభావ్య కళంకం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, కులం అనేది ఒక అపోహ కాదు, కుల ఆధారిత వివక్ష దౌర్జన్యాలు దేశాన్ని పీడిస్తున్నాయని గుర్తించడం చాలా అవసరం.
కుల గణన అనేది ఖచ్చితమైన డేటా, సమాచారాన్ని అందించడానికి, అసమానతలను తగ్గించడానికి, పేదరికం నిర్మూలించడానికి దోహదం చేస్తుంది. అసమానతలను తగ్గించడం లక్ష్యంగా సాగించే కులగణన, ఇది వరకే ఉన్న విధానాలలోని హానికరమైన లోపాలను సవరించడమే కాకుండా, కొత్త విధానాలను కూడా రూపొందించి, కుల వ్యవస్థను నిర్మూలించి మరింత మెరుగైన, న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది. కులగణన వల్ల ప్రభుత్వాలకు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడానికి, వివిధ అసమానతలను తొలగించడానికి కావాల్సిన గణాంకాలను తెలియజేస్తుందన్న అంశాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
కాంగ్రెస్, బీజేపీ వైఖరి
ఎప్పటి నుంచో కుల గణనను చేపట్టాలని వాదిస్తున్న బీసీ సంఘాల న్యాయబద్ధమైన పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ సుముచితంగా స్పందించి కుల గణన అంశాన్ని ఇప్పుడు జరుగుతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అంశంగా లేవనెత్తుతుంది. రాహుల్ గాంధీ ప్రతి ఎన్నిక సభల్లో కులగణనను లేవనెత్తుతూ సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇది కచ్చితంగా బీసీల పట్ల, సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ పార్టీ మారిన వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇండియా అలయన్స్ లోని పార్టీలన్నీ కులగణనకు సానుకూలంగా స్పందించాయి.
2018లో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొదటిసారిగా జనాభా గణనలో ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) కులాలను చేర్చడాన్ని నిర్ధారిస్తూ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియా సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ వైఖరి గణనీయమైన మార్పుకు గురైంది. బిహార్ కులగణన కేసులో సుప్రీంకోర్టులో, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌తో ప్రతిస్పందిస్తూ, కుల గణనను నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని, జనాభా గణనకు సంబంధించిన అంశాలు యూనియన్ జాబితా కిందకు వస్తాయి అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర స్థాయి కుల గణన కోసం వాదించారు. ఈ విధానానికి మద్దతుగా సాంకేతిక కారణాలను ఉటంకిస్తూ, కుల స్థితిగతులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గణనీయంగా మారవచ్చని ఆయన వాదించారు.
భయాలు అనవసరం
కుల గణనను వ్యతిరేకించే వారు తమ వైఖరికి మద్దతుగా మూడు కీలక వాదనలను ముందుకు తెచ్చారు. మొదటిగా, భారతదేశంలో కులాల సంఖ్య ఎక్కువగా ఉన్నందున దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించడం సాంకేతికంగా సవాలుగా ఉందని, అసాధ్యమని వారు వాదించారు. రెండవది, కుల గణన సమాజాన్ని కులాల వారీగా విభజించగలదనే ఆందోళన ఉంది. మూడవది, జనాభా లెక్కల ఫలితాల ఆధారంగా కొన్ని కులాలు ఎక్కువ ప్రతినిథ్యం కోరవచ్చనే భయాలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ, న్యాయం, సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం నిజంగా కట్టుబడి ఉంటే ఈ వాదనలు ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇప్పటికే రాష్ట్రాల వారీగా ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలను నిర్వహించడం గమనించదగ్గ విషయం. కాబట్టి, న్యాయమైన, సమానత్వాన్ని ప్రోత్సహించే విషయంలో కుల గణన సంభావ్య ప్రయోజనాలను పూర్తిగా తోసిపుచ్చలేము.
అసమానత తగ్గితేనే హిందువుల్లో ఐక్యత
ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ కుల గణనపై స్పష్టమైన వైఖరిని ఇప్పటివరకు తెలియజేయలేదు. పైపెచ్చు కులగణన వల్ల హిందూ మతంలో వివిధ వర్గాలు మరింతగా చీలిపోతారని వితండవాదం చేస్తున్నారు. కులాల మధ్య అసమానతలను ఎంత తగ్గిస్తే హిందూమతంలో అంత ఐక్యతను తీసుకురావచ్చన్న ఆలోచనా విధానం ఆర్ఎస్ఎస్ వర్గాల్లో పనిచేస్తున్న బీసీలు తెలియచేయాల్సిన సమయం వచ్చింది. కుల గణన వల్ల ప్రభుత్వాలకు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడానికి, వివిధ అసమానతలను తొలగించడానికి కావాల్సిన గణాంకాలను తెలియజేస్తుందన్న అంశాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
- జి కిరణ్ కుమార్,జాతీయ అధ్యక్షుడు,ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్