సింధియా హస్తం ఉందన్న ఆరోపణలు
ఢిల్లీలో సోనియాతో కమల్‌నాథ్ భేటీ
టూర్ కుదించుకుని భోపాల్‌కు సీఎం
17 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్.. అర్ధరాత్రి మంత్రులంతా రాజీనామా
రోజుకో మలుపు తిరుగుతున్న మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా పెద్ద కుదుపే చోటుచేసుకుంది. మొన్న పదిమంది ఎమ్మెల్యేలు మిస్సింగ్ అంటూ రేగిన గందరగోళం కాస్త సద్దుమణిగిందని అనుకునేలోపే మరోటి ముంచుకొచ్చింది. ఈసారి 17 మంది ఎమ్మెల్యేలు గాయబ్ అయ్యారు. ఫోన్లు స్విచ్ఛాప్ చేసి, టచ్‌లో లేకుండా పోయారు. ఇప్పుడు కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలంతా పార్టీ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియాకు మద్దతిచ్చే వాళ్లే కావడంతో కమల్‌నాథ్ సర్కారుకు సంకటం వచ్చిపడింది. దీంతో అర్ధరాత్రి మంత్రులతో సీఎం కమల్‌నాథ్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తర్వాత మంత్రులంతా రాజీనామా చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకు కేబినెట్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని కమల్‌నాథ్ ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరుకు ఎమ్మెల్యేలు!
సోమవారం ఉదయం నుంచి హైడ్రామా చోటుచేసుకుంది. మిస్సింగ్ ఎమ్మెల్యేలు ఓ చార్టెడ్ ఫ్లైట్‌లో మధ్యాహ్నం బెంగళూరులో ల్యాండయ్యారని, ఓ ఫైవ్‌స్టార్ హోటల్ లో మకాం పెట్టారని సమాచారం. ఎమ్మెల్యేల మిస్సింగ్ వార్త తెలిసీ ఢిల్లీలోనే ఉన్న జ్యోతిరాధిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఢిల్లీలో పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, సింధియా వైఖరిని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత కమల్‌నాథ్ తన ఢిల్లీ టూర్‌ను అర్థంతరంగా ముగించుకుని, హుటాహుటిన మధ్యప్రదేశ్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో సర్కారును కూలగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం సింధియాతో కుట్రపన్నిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో రాష్ట్రంలో టెన్షన్ నెలకొన్నా సింధియా ఢిల్లీలోనే ఉండడంతో.. ఎమ్మెల్యేల అదృశ్యం వెనక ఆయన హస్తం ఉందని కొంతమంది నేతలు అంటున్నారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది.
అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బీజేపీ
అసెంబ్లీలో కమల్‌నాథ్ సర్కారుకు తగిన బలంలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నరు. సభ్యుల్లో చాలామంది సర్కారుపై అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకుని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికలకు ప్రియాంక?
రాజ్యసభ ఎలక్షన్లలో పార్టీ నుంచి ఎవరిని నామినేట్చేయాలనే విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వివిధ రాష్ట్రాల నేతలతో భేటీ అయ్యారు. సోనియాను కలిసిన వారిలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హుడా, జమ్మూ కాశ్మీర్ ఏఐసీసీ ఇంచార్జ్ అంబికా సోనిలను వేర్వేరుగా కలిసి, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ప్రియాంక గాంధీని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని ఆ రాష్ట్ర నేతలు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉంది. కొందరు ఎమ్మెల్యేలు అలిగి పార్టీ, ప్రభుత్వ మీటింగ్‌లకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందోనన్న భయం పార్టీ వర్గాల్లో నెలకొంది.