- రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో పెరిగిన కాన్ఫిడెన్స్
- కేసీఆర్ పర్యటనపై ఆశ పెంచుకున్న బీఆర్ఎస్ లీడర్లు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పొలిటికల్ఈక్వేషన్స్ రోజురోజుకు మారుతున్నాయి. ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ జిల్లాలో పర్యటించారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. వారం రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. మరో వైపు జిల్లాలో నవంబర్7న కేసీఆర్ పర్యటనపై బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
సీఎం పర్యటన తర్వాత బీఆర్ఎస్బలం పెరుగుతుందని, జిల్లా రాజకీయాలు పూర్తిగా మారుతాయని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలపై ఆశలు పెంచుకుంటున్నారు. పరిస్థితులు గమనించిన హైకమాండ్స్ కూడా దేశ, రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలను ఇప్పటికే ఖరారు చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నెలకొన్నట్లు ఆయా పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.
నేషనల్ లీడర్లపై డిపెండ్..
జిల్లాలో గతంలో ఏ ఎన్నికల్లోనూ జాతీయస్థాయి నాయకుల పర్యటనలు ఎక్కువగా జరుగలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాత్రమే రాష్ట్ర స్థాయి నాయకులు ఒకటికి రెండుసార్లు జిల్లాలో పర్యటించారు. అలాగే సీఎం కేసీఆర్ పలు సభల్లో ప్రసంగించారు. సీఎం పెద్దపల్లి సభ ఆనాడు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గెలుపునకు దోహదపడింది. ఆ ఎన్నికల్లో మిగతా పార్టీలకు చెందిన నేషనల్ లీడర్లు ఎవరూ ప్రచారంలో పాల్గొన లేదు. గతాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ పార్టీలు తమ ముఖ్య నేతలు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నాయి. ఇటీవల రాహుల్‌గాంధీ జిల్లాలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో పర్యటించారు.
రాహుల్ పర్యటనతో పార్టీకి ఊపు రావడంతో నవంబర్ మొదటి వారంలో ప్రియాంక గాంధీ జిల్లాలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నాయి. రాహుల్పర్యటనలో మిస్సయిన రామగుండం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంకను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నాయి. బీజేపీ నుంచి కూడా జాతీయ నాయకులను పెద్దపల్లి జిల్లాలో పర్యటించేలా జిల్లా నాయకులు ప్లాన్ చేసినట్లు తెలిసింది.
మూడింట్లో టఫ్ ఫైటే...
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండేలా పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీకు చెందిన అభ్యర్థులు పోటీలో కీలకం కానున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్న క్రమంలో ఆ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ వారికే టిక్కెట్లు కేటాయించారు. దీంతో టిక్కెట్లు ఆశించిన వారితో పాటు వారి అనుచరులు బీఆర్ఎస్ను వదిలేశారు. కొంతమంది సైలెంట్అయ్యారు. అలాగే జిల్లాలో చాలావరకు క్యాడర్ కోల్పోయిన కాంగ్రెస్ గడిచిన ఆరు నెలలుగా పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్నది.
జాతీయ నాయకత్వం సహకారంతో ఎలాగైనా ఈ సారి గెలువాలని ప్రయత్నం చేస్తున్నారు. 2018లో ఎలాంటి ప్రభావం చూపెట్టని బీజేపీ ప్రస్తుతం మిగతా పార్టీలకు పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. మరోవైపు బీఎస్పీ అభ్యర్థులు కూడా ఎన్నికల్లో తమ ప్రభావం చూపడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బీఎస్పీ స్టేట్చీఫ్ ప్రవీణ్‌కుమార్ కూడా పెద్దపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నెలకు రెండుసార్లయినా పెద్దపల్లిలో పర్యటిస్తున్నారు. దీంతో జిల్లాలోని మిగతా రెండు నియోజకవర్గాల కంటే పెద్దపల్లిలో ఎలక్షన్ సీరియస్ నెస్ పెరిగిపోయింది. దీంతో జిల్లాలో పోటీలో ఉన్న పార్టీలకు టఫ్ ఫైట్ తప్పదని భావిస్తున్నారు.