చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్

చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్

= మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
= కాంగ్రెస్ కు దగ్గరవుతున్న ఎంఐఎం
= బీఆర్ఎస్ కు పరోక్షంగా బీజేపీ సపోర్ట్
= హాట్ టాపిక్ గా మారిన పాలిటిక్స్
= గులాబీతో విభేదిస్తున్నది నలుగురే 
= సపోర్టుగానే మిగతా నేతల కామెంట్లు

హైదరాబాద్: పతంగ్ పార్టీతో కాంగ్రెస్ దోస్తీ కడుతోంది. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా కనిపించిన బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. సమీకరణాలు మారుతున్నాయి. పుష్ప–2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన.. బన్నీ అరెస్టు క్రమంలో బీజేపీ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.  బీఆర్ఎస్ సైతం బీజేపీ వ్యాఖ్యలను సమర్థించింది. ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళనపైనా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వేరు వేరుగా ఆందోళనలు చేసినా ఒకరినొకరు సమర్థించుకున్నారు. 

నలుగురు నేతలు మినహా అంతా అప్పటి కేసీఆర్ పాలనను సమర్థిస్తున్నారనే వాదన బలంగానే వినిపిస్తోంది. విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ మొత్తంలో సాయమందించి.. బయ్యారం ఉక్కును పట్టించుకోకున్నా.. బీఆర్ఎస్ పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమనార్హం. నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తున్నారు. ఆమె కూడా అర్వింద్ టార్గెట్‎గానే విమర్శలు చేయడం గమనార్హం. అదే విధంగా ఎంపీ రఘునందన్ రావు కూడా హరీశ్ రావు పైనే ఫైర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. 

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీఆర్ఎస్  నేతలే లక్ష్యంగా అప్పుడప్పుడూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇవి ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలుగానే ఉన్నాయి తప్ప ఓవరాల్‎గా పార్టీని తప్పు పట్టినట్టుగా ఉండటం లేదన్న వాదన కూడా ఉంది.  గతంలో ఆర్థికశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఎంపీ ఈటల రాజేందర్, గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావులను ఈ వారంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. 

ఈ మేరకు వారికి నోటీసులు పంపేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అదే తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ టార్గెటెడ్‎గా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనను ప్రస్తావిస్తూ.. రెండూ ఒకటేనని చెబుతున్నారు. ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని, అప్పుడే బాగుండేదనే ఆరోపణలకూ వెనుకాడటం లేదు.  కమలం లీడర్ల మాటల వెనుక కహానీ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. 

చేతికి పతంగ్

మొన్నటి వరకు బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం ఇప్పుడు దూరమైంది. గులాబీ పార్టీపై గుస్సా అవుతోంది. కావాలనే ఓల్డ్ సిటీ అభివృద్ధిని నిలిపేసిందని ఫైర్ అవుతోంది. సీఎం రేవంత్ చొరవతోనే ఓల్డ్ సిటీకి మెట్రో వస్తోందని చెబుతోంది. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రశ్న అడగటం.. దీనిపై సీఎం స్టేట్ మెంట్ చేయడం.. ఆ తర్వాత ఎంఐఎం సమర్థించడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే ఎంఐఎం కాంగ్రెస్‎కు దగ్గరవుతోందనే వాదన బలంగానే వినిపిస్తోంది.