
- షెడ్యూల్ వెలువడడంతో మెజార్టీ స్థానాలపై అధికార పార్టీ ఫోకస్
- ఇందులో 4 కాంగ్రెస్కు, ఒకటి బీఆర్ఎస్ కు దక్కే చాన్స్ ఒక సీటు అడుగుతున్న సీపీఐ
- ఖాళీ అవుతున్న ఐదింటిలో 4 బీఆర్ఎస్, 1 ఎంఐఎం సీటు
- సిట్టింగ్ సీటు తమకే ఇవ్వాలని ఎంఐఎం పట్టుబట్టే అవకాశం
- సీపీఐ, ఎంఐఎంకు 2 పోతే కాంగ్రెస్ కు దక్కేవి రెండేనా?
- ఎమ్మెల్సీ పదవులపై 20 మంది కాంగ్రెస్ నేతల ఆశలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెలాఖరుతో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండడం, వీటి ఎన్నికకు ఈసీ సోమవారం షెడ్యూల్ విడుదల చేయడంతో పీసీసీలో అందరి కన్ను వీటిపైనే పడింది. పలువురు సీనియర్ నేతలు ఈ పదవులపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. ఖాళీ అవుతున్న ఐదింటిలో నాలుగు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం బీఆర్‌ఎస్ సీట్లు కాగా, ఒకటి మిర్జా రియాజుల్ హసన్ ( మజ్లిస్ ) ది. అయితే అసెంబ్లీలో ఇప్పుడున్న పార్టీల సంఖ్య పరంగా4 కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ కు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి ఈ నాలుగు ఎమ్మెల్సీలు ఎవరికి దక్కనున్నాయనే చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. ఈ 4 పదవులకు సుమారు 20 మంది కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ కావడం ఖర్చులేని పనికావడంతో చాలా మంది ఈ పదవిని దక్కించుకునేందుకు ఎవరిస్థాయిలో వారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర, అటు ఢిల్లీలో హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోటి ఇవ్వాలని డిమాండ్
కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉన్న 4 పదవుల్లో ఒక్కో సామాజికవర్గానికి ఒకటి చొప్పున ఇవ్వాలనే డిమాండ్ పార్టీ నేతల నుంచి వస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలు తమకు కనీసం ఒక్క ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. 5 సామాజిక వర్గాల నేతలు ఒక్కో సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుతం 4 ఎమ్మెల్సీలు మాత్రమే ఉండడంతో ఏ సామాజిక వర్గాన్ని ఎలా సంతృప్తి పరచాలనే తర్జన భర్జనలో పార్టీ ఉంది. పైగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్న వేళ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచడం అనేది ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, అటు హైకమాండ్ కు కత్తిమీది సాములా మారింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ( మాదిగ ), పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ( మాల ), ఎస్టీల నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ( లంబాడా ) , ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ( లంబాడా ) సీటు ఆశిస్తున్నారు. మంత్రి వర్గంలో ఆదివాసీలకు ( సీతక్క ) ప్రాతినిథ్యం ఉండడంతో, ఈసారి లంబాడా వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఇక బీసీల నుంచి యాదవ, కుర్మ, ముదిరాజ్ లు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాదవుల నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు చరణ్ కౌశిక్, ఇటు కుర్మ సామాజిక వర్గం, మహిళా కోటా కింద గద్వాల జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా యాదవ్, ముదిరాజ్ , మహిళా కోటా కింద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ కూడా ఈ సీటు ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మైనార్టీ కోటాలో సీనియర్ నేత షబ్బీర్ అలీ, నాంపల్లి ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్, సీఎం రేవంత్ సన్నిహితుడు ఫహీం ఖురేషీ లూ పట్టుబడుతున్నట్టు సమాచారం.
రెడ్డి సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ
ఓసీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, పీసీసీ మీడియా ఇన్చార్జి సామా రాంమోహన్ రెడ్డి, ఓసీ బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్ రావు, కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్ ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు టికెట్ ఇవ్వరాదనే హైకమాండ్ నిర్ణయం ఇక్కడ అమలైతే ఇందులో చాలా మంది నేతలకు ఈ పదవి దూరం కానున్నది. మరి ఈ విషయంలో ఢిల్లీ పెద్దల వైఖరి ఎలా ఉండబోతుందనేదానిపై ఉత్కంఠ నెలకొన్నది.
కాంగ్రెస్కు దక్కేది రెండేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కుదుర్చుకున్న పొత్తులో భాగంగా వారికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలంటూ సీఎంపై సీపీఐ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. మరి సీపీఐకి ఇస్తారా? లేదా? అనేది కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీపై కూడా తీవ్ర చర్చ సాగుతున్నది. ప్రస్తుతం ఎంఐఎం పట్ల కాంగ్రెస్ పూర్తి సానుకూలంగా ఉంది. అసెంబ్లీలో ఆ పార్టీకి మజ్లిస్ పూర్తి అండగా నిలబడుతున్నది. అయితే ఆ పార్టీ తమ సిట్టింగ్ సీటు తమకే ఇవ్వాలని సీఎం రేవంత్ పై ఒత్తిడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ పీసీసీలో నడుస్తున్నది. ప్రస్తుతం 4 ఎమ్మెల్సీలకే కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా ఉన్న పక్షంలో ఇటు సీపీఐకి, అటు మజ్లిస్ కు చెరోటి ఇస్తే కాంగ్రెస్ కేవలం రెండు ఎమ్మెల్సీలతో సరిపెట్టుకుంటుందా? అనే చర్చ కూడా నడుస్తున్నది. ఈ విషయంలో ఇటు హైకమాండ్.. అటు సీఎం రేవంత్ రెడ్డి.. తీసుకోబోయే నిర్ణయమే కీలకంగా మారనున్నది.