పోటీకి సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

  •     టీఆర్ఎస్ లో అసమ్మతి
  •     పోటీకి సిద్ధమవుతున్న మంత్రి కేటీఆర్ మేనబావ నర్సింగరావు
  •     ప్రచారాన్ని ప్రారంభించిన సెస్ మాజీ చైర్మన్ రామారావు
  •     సెస్ లో పాగా వేసేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ ప్లాన్

రాజ్నన్న సిరిసిల్ల, వెలుగు: సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్​) ఎన్నికలతో సిరిసిల్ల నియోజకవర్గంలో పొలిటికల్ హీట్​మొదలైంది. మంత్రి కేటీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే నియోజక వర్గంలో మంత్రి మాటే అనే పరిస్థితి నుంచి నేనంటే నేను పోటీ చేస్తానని పలువురు ప్రకటించుకొనే పరిస్థితి వచ్చింది. సీనియర్ నాయకులు సైతం  కేటీఆర్ ఆర్డర్ లేకుండానే ఎన్నికల క్యాంపులు నిర్వహించడం, కార్యకర్తలతో సీక్రెట్ మీటింగ్ లు పెట్టడం అధికార పార్టీని కలవరపెడుతోంది. 

టీఆర్ఎస్ కు చెందిన ఓ ముగ్గురు నేతలు సెస్ చైర్మన్ గిరిని దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ వ్యవహారం కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. 

టీఆర్ఎస్​లో భారీగా ఆశావహులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు,255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో సెస్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని మండలాల్లో టీఆర్ఎస్ లో భారీగా ఆశావహులు ఉండటంతో నేతల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికలు పార్టీ రహితంగా జరగనున్నా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా సపోర్ట్ చేస్తారు. సిరిసిల్ల టౌన్ 2 లో జనరల్ కు  రిజర్వ్ కావడంతో అధికార పార్టీ నుంచి చాలా మంది పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. పద్మశాలీ కమ్యూనిటీకి చెందిన  టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ ఇప్పటికే పోటీలో ఉంటానని ప్రకటించి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు.

పద్మశాలీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూర్ గ్రామానికి చెందిన వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కూడా ఎన్నికల క్యాంపెనింగ్ ప్రారంభించారు. ఓటర్లను కలుస్తూ సమీక్షలు చేస్తున్నారు. కేటీఆర్ మేనబావ చీటి నర్సింగ్ రావు కూడా సెస్​చైర్మన్​పదవి పొందాలని స్కెచ్​వేస్తున్నారు.  ఇప్పటికే నియోజకవర్గంలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో కార్యకర్తలతో రహస్య సమావేశాలు పెట్టి మద్దతు కోరుతున్నారు. తంగళ్లపల్లి, సిరిసిల్ల టౌన్ 2, ఎల్లారెడ్డిపేట మండలాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటునట్లు సమాచారం. 

కాంగ్రెస్ దూకుడు

సెస్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్​అయిన వెంటనే జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించింది. మాజీ ఎంపీ పొన్నం, సిరిసిల్ల డీసీసీ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గ ఇన్​చార్జ్​ ఆది శ్రీనివాస్ సెస్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. 

13 నుంచి నామినేషన్లు 

సెస్ ఎన్నికలకు ఈ నెల 13 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 15 వరకు నామినేషన్లు, 16న స్క్రూటినీ, 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వనున్న నేపథ్యంలో సిరిసిల్లలో సెస్ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది. 

‘సెస్’ పై బీజేపీ ఫోకస్​

సెస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎక్కువ డైరెక్టర్ స్థానాలు గెలిచి సెస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే గెలుపు అవకాశాలు ఉన్న నేతల లిస్ట్ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​కి చేరింది. జిల్లాలోని అన్ని డైరెక్టర్ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  ప్రతి మండలానికి  ఒక ఇన్​చార్జ్ ని నియమిస్తామని బండి సంజయ్​చెప్పినట్లు సమాచారం.

ఇప్పటికే సిరిసిల్ల బీజేపీ ముఖ్య నేతలు సంజయ్​ను కలిశారు. ముస్తాబాద్ నుంచి మాజీ జడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, ఇల్లంతకుంట నుంచి తిరుపతిరెడ్డి, సిరిసిల్ల టౌన్ 2 నుంచి మాజీ ఎంపీపీ సుభాష్​రావు, ఎల్లారెడ్డిపేట మండలం నుంచి రెడ్డి సంక్షేమ  సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి, గంభీరావుపేట నుంచి ఇటీవల టీఆర్ఎస్ నుంచి వచ్చిన బీసీ నాయకుని పేరు  పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.