పోటాపోటీ.. వరంగల్‍ కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ హీట్

పోటాపోటీ.. వరంగల్‍ కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ హీట్
  • కొండా మురళీ వర్సెస్‍ వేం నరేందర్‍రెడ్డి
  • ఎవరికివారుగా హైకమాండ్‍ వద్దకు..
  • ఎస్సీ, ఎస్టీ కోటాలో దొమ్మాటి సాంబయ్య, బెల్లయ్య నాయక్ 
  • గులాబీ పార్టీలో ఎక్స్ టెన్షన్‍పై సత్యవతి రాథోడ్ ధీమా, ఆశతో మాజీ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్, వెలుగు: ఓరుగల్లులో టీచర్ ఎమ్మెల్సీ వేడి తగ్గకముందే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ షెడ్యూల్‍ రావడంతో మరోసారి పొలిటికల్‍ హీట్‍ మొదలైంది. రాష్ట్రంలో మార్చి 29న శేరి సుభాష్​ ​​రెడ్డి, మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్, మిర్జా రియాజుల్ హసన్  పదవీ కాలం ముగుస్తోంది.  ఉమ్మడి వరంగల్‍ జిల్లా కాంగ్రెస్​తోపాటు  బీఆర్ఎస్‍ నుంచి సైతం నేతలు అవకాశం ఎదురుచూస్తున్నారు. 

గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీలో సత్యవతి రాథోడ్ ఓరుగల్లు నుంచే ఉండటంతో ఈ స్థానాన్ని తిరిగి ఓరుగల్లుకే ఇస్తారనే ఆశతో ఇక్కడి లీడర్లున్నారు. రెడ్డి, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆయా వర్గాలతోపాటు ఇతర కులాల నేతలు కూడా పెద్దల సభ సీటును ఆశిస్తున్నారు. పార్టీ ఓకే చెప్తే గెలుపు గ్యారంటీ కావడంతో ఎమ్మెల్యే కోటా పదవులకు డిమాండ్​ పెరిగింది. 

కాంగ్రెస్​లో కాంపిటేషన్​ ఫుల్​.. 

అధికార కాంగ్రెస్‍ పార్టీ నుంచి మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పేరు వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొండా దంపతులు వారి కుటుంబం నుంచి రెండు సీట్లు అడిగారు. మురళీకి భవిష్యత్తులో సరైన అవకాశం కల్పిస్తామని సర్ధిచెప్పి సురేఖకు సీటు ఇచ్చారు. అంతేకాకుండా వారికే పరకాల ఎమ్మెల్యే, వరంగల్​ ఎంపీ ఎలక్షన్ల బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం రేవంత్​రెడ్డి ప్రచారానికి వచ్చిన ప్రతీసారి మురళీకి సరైన గౌరవం కల్పిస్తామని సభల్లో చెప్పారు. దీంతో ప్రస్తుతం ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్​రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్​రెడ్డి పేరు కూడా వినపడుతోంది. ఆయన ప్రభుత్వ పెద్దలకు దగ్గరి మనిషిగా ఉన్నాడు.

 గతంలో పరకాల, వరంగల్ ఎంపీ స్థానాలు ఆశించి భంగపడిన నేతగా ఎస్సీ సామాజికవర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి టిక్కెట్‍ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన డెవలప్‍మెంట్‍ ఫైనాన్స్​ కార్పొరేషన్‍ చైర్మన్​ బెల్లయ్య నాయక్ ఎస్టీ కోటాలో ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మహబూబాబాద్ ఎంపీ స్థానం కోసం, కాంగ్రెస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పోస్ట్​ కోసం పోటీలో ఉన్న ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోసం బరిలో ఉన్నాడు. మరికొందరు కూడా ఎమ్మెల్సీ టికెన్​కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

కొండా వర్సెస్ వేం..  

ఉమ్మడి జిల్లాలో కొండా దంపతులతో కొన్ని రోజులుగా పరకాల, వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యేలు రేవూరి, నాయిని రాజేందర్​రెడ్డి తదితర నేతలతో గ్యాప్‍ ఉంది. ఈ క్రమంలోనే మార్చిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవుతుందని తెలిసిన క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రేవూరి, నాయినితోపాటు స్టేషన్‍ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్‍ మున్షీని కలిశారు. 

వీరివెంట ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న దొమ్మాటి సాంబయ్య సైతం ఉండటంతో ఆయనకు మద్దతుగా వీరంతా వెళ్లారనే ప్రచారం జరిగింది. కాగా, కొండా దంపతులు సైతం ఢిల్లీస్థాయిలో పార్టీ పెద్దలను కలిసి పార్టీ కోసం తాముపడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడానికి కారణాలు చెప్పి మురళీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్టు  తెలిసింది. అయితే, కొండా దంపతుల వ్యతిరేకవర్గం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​రెడ్డి పేరును ముందుకుతెచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా స్థాయిలో వేం సైతం పార్టీ పెద్దలకు దగ్గరి మనిషి కావడంతో జిల్లా నుంచి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు చెబుతున్నారు. 

బీఆర్ఎస్‍లో ఎర్రబెల్లి వర్సెస్ సత్యవతి రాథోడ్ 

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీలవారీగా చూస్తే బీఆర్ఎస్‍ పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా వారికి ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్​ కోసం ఓరుగల్లు నుంచి ఇద్దరు మాజీ మంత్రులు పోటీ పడుతున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపే నేతగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేరు వినపడుతోంది. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉండే ఓరుగల్లు నుంచి ప్రస్తుతం పల్లా రాజేశ్వర్​రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఎర్రబెల్లికి రాజకీయ శత్రువుగా భావించే కొండా సురేఖ మంత్రిగా ఉండటంతో దయాకర్​రావుకు ఏదో ఒక పదవి అనివార్యమైంది. కాగా, సత్యవతి రాథోడ్‍ రెండోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 4న పార్టీ పెద్దలు సత్యవతి రాథోడ్‍ను కౌన్సిల్లో బీఆర్ఎస్‍ విప్‍గా నియమించిన నేపథ్యంలో తిరిగి ఆమెకే అవకాశమిస్తారనే ప్రచారం జరుగుతోంది.