కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో పొలిటికల్​ హీట్

  • పెళ్లిళ్లు, వార్షికోత్సవాలు, ప్రతిష్ఠాపనలు ప్రోగ్రామ్ ఏదైనా లీడర్ల అటెండ్​​​
  •  జనాల్లో ఉంటున్నట్లు కలరింగ్​​
  •  ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నాలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో పొలిటికల్​ హీట్​ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో తమ యాక్టివిటీస్​ పెంచాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన లీడర్లు గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. పార్టీ ప్రోగ్రామ్స్​తో పాటు సేవా కార్యక్రమాలు, పలకరింపులు, లగ్గాలు, టెంపుల్స్​వార్సికోత్సవాలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు ఇలా ప్రోగ్రామ్​ఏదైనా పోటాపోటీగా అటెండ్​ అవుతున్నారు. కొత్తగా టికెట్​ఆశిస్తున్నవారు సైతం ఇదే ట్రెండ్​ఫాలో అవుతున్నారు. ఓ పార్టీకి చెందిన లీడర్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లినట్లు తెలియగానే మరో పార్టీ లీడర్​ వెళ్తున్నారు. ఒకే పార్టీలో ఎమ్మెల్యే టికెట్​ఆశించే వ్యక్తులు ఎక్కువగా ఉంటే ఒకరి కంటే  ముందే మరొకరు అటెండ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు.

తలనొప్పులు రాకుండా జాగ్రత్తలు

టెంపుల్స్​లో జరిగే వివిధ కార్యక్రమాలకు అటెండ్ అయ్యేందుకు లీడర్లు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకే రోజు అన్ని పార్టీల లీడర్లు హాజరు కాకుండా నిర్వాహకులు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 3, 4 రోజుల పాటు ప్రోగ్రామ్స్​ఉంటే రోజుకొక పార్టీకి చెందిన వారు వచ్చేలా ప్లాన్ ​చేసుకుంటున్నారు. ఒకవేళ ఒకే రోజు ప్రోగ్రామ్​ ఉంటే ఒకరు వచ్చి వెళ్లిన తర్వాత మరొకరు వచ్చేలా చూస్తున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలోని దోమకొండ మండలంలో  కొన్ని రోజుల కింద ఓ ఆలయం వార్షికోత్సవానికి మూడు పార్టీల ముఖ్య లీడర్లు రోజుకొకరు చొప్పున హాజరయ్యారు. ఒకే రోజు వచ్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్​ లీడర్లు షెడ్యూల్​ఇవ్వగా ఆలయ నిర్వాహకులు కిందామీద పడి షెడ్యూల్​మార్పించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి దేవి విహార్​లో కొత్తగా కట్టిన  ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనకు వరుసగా 3 రోజులు వేర్వేరు పార్టీల లీడర్లు హాజరయ్యారు. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాల్లో జరిగిన పలు వార్షికోత్సవాలు, జాతరల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇక ఒక్కో లీడర్​వరుసబెట్టి తమ పరిధిలోని 5 నుంచి 10 లగ్గాలకు అటెండ్​ అవుతున్నారు.

ఎల్లారెడ్డిలో మరింత పోటీ

ఎల్లారెడ్డి నియోజక వర్గంపైనే  అందరి దృష్టి ఉంది. ఇక్కడి ఎన్నికల్లో కొత్త నేతలు పోటీ చేయడం ఆనవాయితీగా మారింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడ ప్రధాన పార్టీల లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడం, శుభకార్యాలు, ఎవరైనా చనిపోతే  వెళ్లి పలకరించడం, పాడే మోయడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఇద్దరు  లీడర్లు  పోటీపడుతున్నారు. ఇద్దరు కూడాఎవరికి వారే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్ తో పాటు ప్రజల్ని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే  జాజాల తనకే టికెట్​వస్తుందనే ధీమాతో ఉన్నారు. ప్రతీ పోగ్రామ్​కు అటెండ్​ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. కల్యాణలక్ష్మి చెక్​తో పాటు,పెళ్లి కూతురికి అన్న కట్నంగా చీర అందిస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కూడా విస్తృతంగా  పర్యటిస్తున్నారు.