- వనపర్తి జిల్లాలో మారుతున్న రాజకీయాలు
- రిపోర్టులు అధిష్టానానికి..
వనపర్తి, వెలుగు: జిల్లాలో మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రత్యేక నిఘా ఉంచి వారు పార్టీలో ఉంటారా? పోతారా? అనే కోణంలో వివరాలు ఆరా తీస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో వారి వ్యవహారాన్ని అధిష్ఠానానికి అందిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉండలేక, ఇరత పార్టీ నేతలతో టచ్ ఉంటున్న నాయకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రతీ నియోజకవర్గంలో..
జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ చేశారు. దీంతో గ్రామస్థాయి నుంచీ సమాచారాన్ని లాగుతున్నారు. అసంతృప్తి నేతలకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంత? పార్టీ మారితే నష్టమేమైనా ఉంటుందా? అనే కోణంలో వివరాలు తెలుసుకుంటున్నారు. వనపర్తి, దేవరకద్ర, మక్తల్ ,కొల్లాపూర్ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిపై ఇంటెలిజెన్స్ వర్గాలు పది రోజులుగా ఆరాతీస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల బలాలను, బలహీనతలను అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఇంటిలిజెన్స్ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
పెద్దమందడి ఎంపీపీ వేరు కుంపటి
వనపర్తి నియోజకవర్గంలో పెద్దమందడి ఎంపీపీ మెఘారెడ్డి బీజేపీలో టచ్ లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన మరో 20 మంది సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ అయిన మేఘా రెడ్డి దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాలలో పలు పనులు చేపట్టారు. వీటి బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తనకు ఈ ప్రభుత్వంలో పనులు కావటం లేదని అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పై గుర్రుగా ఉన్నారు. అతన్ని బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో పక్క వనపర్తిలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నిరంజన్ రెడ్డి తనుకు పార్టీ లో తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదంటూ లోకనాథ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకనాథ్ రెడ్డి కూడా బీజేపీ లీడర్లకు టచ్లో ఉన్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే లోక్ నాథ్ రెడ్డి పార్టీ మారే ఆలోచన లేదని చెబుతూనే బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి లోక్ నాథ్ రెడ్డి ని పార్టీ లో కొనసాగాలని కోరుతున్నారు. కానీ, పార్టీ లోని కొందరు నేతలు లోక్ నాథ్ రెడ్డి కొనసాగితే తాము పార్టీ వీడుతామని మంత్రి కి అల్టిమేటం జారీ చేశారు. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయం లో మౌనం పాటించారు.
దేవరకద్ర లో ఓ పోలీసు అధికారి హాల్ చల్..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్పీ బంటు కిషన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవరకద్ర నియోజకవర్గంలో ఈసారి తాను పోటీ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులను కలుస్తున్నారు. ఇది దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి మింగుడుపడటంలేదు. బంటు కిషన్ నియోజకవర్గం చేస్తున్న పర్యటనలు, ఎవరెవరికి ఆయన ఫోన్ లు చేస్తున్న సంగతి పై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. కిషన్ తో పలువురు కీలక లీడర్లు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. పార్టీ వీడే వారిని బుజ్జగించాలని ఎమ్మెల్యే లకు అల్టిమేటం జారీ చేసిందని కొందరు అంటున్నారు.