- బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లీడర్ల పరస్పర విమర్శలు
- రోజుకు రెండు సార్లు ప్రెస్మీట్లతో ఒకరిపై ఒకరు ఆరోపణలు
- ఎవరి మాటలు నమ్మాలో తెలియక గందరగోళంలో క్యాడర్, ప్రజలు
బోధన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బోధన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రేపో, మాపో ఎలక్షన్ అన్న వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన జిల్లా స్థాయి లీడర్ల నుంచి గ్రామస్థాయి లీడర్ల వరకు ప్రెస్మీట్లతో హోరెత్తిస్తున్నారు. ఒకరిపై మరొకరు ప్రతివిమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. దీంతో ఎవరి మాటలు నమ్మాలో? ఎవరి మాటలు నమ్మకూడదో తెలియక అటు క్యాడర్, ఇటు నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మొదలైందిలా..
ఈనెల 16న బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో బీఆర్ఎస్ లీడర్లు బూత్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి బోధన్ ను ఏమాత్రం డెవలప్చేయలేదని, కరోనా టైమ్‌లో నియోజకవర్గ ప్రజలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే కనీసం కన్నెత్తి చూడలేదంటూ విమర్శించారు. సుదర్శన్‌రెడ్డి హయాంలోనే ఎన్ డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం అయిందని, ఇప్పుడు కార్మికులు దీక్షలు చేస్తుంటే, వాళ్ల దగ్గరికెళ్లి పరామర్శించడం ఏమిటని కామెంట్ చేశారు. బీజేపీ లీడర్లు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి గోడమీద పిల్లిలాంటివారని, ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మారి బీజేపీలో చేరరన్నారు. బీజేపీలోనూ టిక్కెట్దక్కకుంటే ఎంఐఎం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతల విమర్శలు..
ఎమ్మెల్యే షకీల్ సుదర్శన్‌రెడ్డిపై ఆరోపణలకు సమాధానమిచ్చేందుకు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పాషామొయినోద్దీన్, టౌన్వర్కింగ్ ప్రెసిడెంట్హరికాంత్ చారి 18 న ప్రెస్‌మీట్ నిర్వహించారు. బోధన్ లో సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని, అలీసాగర్, సాలూర ఎత్తిపోతల పథకాలు చేపట్టగా, ఆ నీళ్లతోనే నేడు రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు. సుదర్శన్ రెడ్డి వైట్‌కాలర్ మంత్రిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన జోలికొస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
చోటామోటా లీడర్లు సైతం..
ఈ నెల19న కాంగ్రెస్యూత్ లీడర్లు దోడ్ల రవీందర్‌రెడ్డి, మందర్నా రవి, నాయకులతో కలసి ప్రెస్మీట్నిర్వహించారు. ఎమ్మెల్యే షకీల్చేసిన అభివృద్ధి ఏం లేదంటూ విమర్శలు చేశారు. ప్రతిగా ఇదే రోజు సాయంత్రం సాలూర మండలం హున్సాలో బీఆర్ఎస్నాయకులు జక్క నాగరాజు ప్రెస్‌మీట్‌పెట్టి మాజీ సుదర్శన్‌రెడ్డిని విమర్శించారు. 20న ఎమ్మెల్యే ఆఫీస్‌లో బీఆర్ఎస్టౌన్ప్రెసిడెంట్రవీందర్యాదవ్, మార్కెట్‌కమిటీ చైర్మన్ వీఆర్దేశాయ్, సాలూర లో రైతుబంధు మాజీ మండల కోఆర్డీనేటర్ బుద్దె రాజేశ్వర్, మార్కెట్‌కమిటీ వైస్చైర్మన్షకీల్, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రెస్‌మీట్‌పెట్టి కాంగ్రెస్, బీజేపీలీడర్లను విమర్శించారు. పూటకో లీడర్ప్రెస్మీట్పెట్టి, ఆరోపణలు చేస్తుండడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది.
బీజేపీ కౌంటర్..
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ విమర్శలకు సమాధానంగా ఈ నెల 17న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి ఎంపీఆర్ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీజేపీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అక్రమంగా వచ్చిన సంపాదనతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు చూస్తున్నారని, త్వరలోనే ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు.